మంగళవారం 26 మే 2020
Nipuna-education - Jan 22, 2020 , 03:55:04

హైదరాబాద్‌కు ప్రథమ స్థానం

హైదరాబాద్‌కు ప్రథమ స్థానం

ప్రపంచంలోని 20 అగ్రశ్రేణి (టాప్‌-20) నగరాల్లో హైదరాబాద్‌ ప్రథమ స్థానం సాధించిందని జేఎల్‌ఎస్‌ (జోన్స్‌ ల్యాంగ్‌ లాసలె) సంస్థ జనవరి 18న ప్రకటించింది. సామాజిక, ఆర్థిక వ్యవస్థ, స్థిరాస్తి, వ్యాపార అవకాశాలు, ఉపాధి అవకాశాలు ప్రామాణికంగా 130 నగరాలను రియల్‌ ఎస్టేట్‌ రంగంలో పేరొందిన జేఎల్‌ఎల్‌ సంస్థ అధ్యయనం చేసింది.

ఈ జాబితాలో బెంగళూరు 2, చెన్నై, 5, ఢిల్లీ 6, పుణె 12, కోల్‌కతా 16, ముంబై 20వ స్థానాల్లో ఉన్నాయి. చైనా నుంచి షెన్‌జెన్‌ 10, చోంగ్వింగ్‌ 11, వుహాన్‌ 13, హాంగ్‌ఝౌ 15, షాంఘై 17వ స్థానాల్లో నిలిచాయి. అమెరికా నుంచి సిలికాన్‌వ్యాలీ 9, ఆస్త్రిన్‌ 19, మధ్య ఆసియా, ఆఫ్రికాల నుంచి నైరోబీ 4, దుబాయ్‌ 14, రియాద్‌ 18, ఆగ్నేయాసియా నుంచి హోచిమిన్‌ 3, హనోయి 7, మనీలా 8వ స్థానాల్లో ఉన్నాయి. 

పోలీస్‌ శాఖకు పురస్కారం

కంప్యూటర్‌ సొసైటీ ఆఫ్‌ ఇండియా (సీఎస్‌ఐ) సంస్థ ఇచ్చే ఈ-గవర్నెన్స్‌ ఎక్సలెన్సీ-2019 అవార్డు తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ శాఖకు లభించింది. ఈ అవార్డును భువనేశ్వర్‌లో జనవరి 17న జరిగిన సమావేశంలో ఒడిశా రాష్ట్ర ఎలక్ట్రానిక్స్‌, ఐటీ, క్రీడా మంత్రి తుషార్‌ కాంతి బెహ్రా ద్వారా తెలంగాణ డీజీపీ కార్యాలయ ప్రతినిధి ఐటీ విభాగం డీఎస్పీ వెంకట్‌రెడ్డి అందుకున్నారు. ‘హాక్‌ ఐ’ యాప్‌ను రూపొందించి మహిళలు, పిల్లల రక్షణకు చేపట్టిన చర్యలకుగాను ఈ అవార్డు దక్కింది. 

విద్యుదుత్పత్తి కేంద్రాల కార్యకలాపాలను ఆన్‌లైన్‌లోకి తీసుకువచ్చి ‘ఈ-ఆఫీస్‌'గా మార్చినందుకుగాను టీఎస్‌ జెన్‌కోకు కూడా సీఎస్‌ఐ పురస్కారం లభించింది.

వివిధ సేవల కోసం పాఠశాల విద్యాశాఖ రూపొందించిన ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌ మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ (ఐఎస్‌ఎంఎస్‌) ప్రాజెక్టుకు కూడా ఈ పురస్కారం లభించింది. 

జైళ్ల శాఖకు అవార్డులు

రాష్ట్రంలోని జైళ్ల శాఖకు రెండు అవార్డులు లభించాయి. బెస్ట్‌ సెంట్రల్‌ ప్రిజన్‌ కేటగిరీలో సెంట్రల్‌ ప్రిజన్స్‌ హైదరాబాద్‌, బెస్ట్‌ ఓపెన్‌ ఎయిర్‌ ప్రిజన్స్‌ కేటగిరీలో చర్లపల్లి ప్రిజనర్స్‌లకు ఈ అవార్డులు దక్కాయి. తమిళనాడులోని వెల్లూరులోని అకాడమీ ఆఫ్‌ ప్రిజన్స్‌ అండ్‌ కరెక్షనల్‌ అడ్మినిస్ట్రేషన్‌ (ఏపీసీఏ) ప్రకటించిన ఈ అవార్డులను జనవరి 12న అందజేశారు.


రైజీనా డైలాగ్‌ సదస్సు

భారత్‌ ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న అంతర్జాతీయ సదస్సు ‘రైజీనా డైలాగ్‌' న్యూఢిల్లీలో జనవరి 14న ప్రారంభమైంది. ప్రపంచ దేశాల కీలక నేతలు పాల్గొన్న ఈ సదస్సులో ఇరాన్‌-అమెరికాల మధ్య ఉద్రిక్తత, ఆఫ్ఘనిస్థాన్‌లో శాంతి, వాతావరణ మార్పు ఇలా ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లపై చర్చించారు. 


72వ సైనిక దినోత్సవం

ఢిల్లీ కంటోన్మెంట్‌లోని కరియప్ప పరేడ్‌ గ్రౌండ్‌లో 72వ సైనిక దినోత్సవ వేడుకలను సైనిక దళాధిపతి మనోజ్‌ ముకుంద్‌ నరవణే జనవరి 15న ప్రారంభించారు. 1949లో నాటి చివరి బ్రిటిష్‌ సైనిక కమాండర్‌ జనరల్‌ ఫ్రాన్సిస్‌ బుచర్‌ నుంచి కేఎం కరియప్ప 1949 జనవరి 15న బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ప్రతి ఏడాది ఈ తేదీన సైనిక దినోత్సవం నిర్వహిస్తున్నారు.


నావికాదళ విన్యాసాలు

భారతదేశం-జపాన్‌ సంయుక్తంగా నావికాదళ విన్యాసాలు జనవరి 16న సహ్యోగ్‌-కైజిన్‌ పేరుతో తమిళనాడులో నిర్వహించారు.

వజ్ర యుద్ధట్యాంక్‌

51వ కే-9 వజ్ర-టీ యుద్ధట్యాంకును రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గుజరాత్‌లోని హజీరాలో జనవరి 16న ప్రారంభించారు. ఎల్‌ అండ్‌ టీ సాయుధ వ్యవస్థల కాంప్లెక్స్‌లో ప్రారంభించిన ఈ యుద్ధట్యాంకు 43 కి.మీ. దూర లక్ష్యాన్ని ఒకేసారి 47 కిలోల బాంబులు కురిపింగలదు. 

చెక్‌బుక్‌కు సరస్వతీ సమ్మాన్‌

సింధీ భాషా పుస్తకం ‘చెక్‌బుక్‌' 2019కు గాను సరస్వతీ సమ్మాన్‌ పురస్కారానికి జనవరి 17న ఎంపికైంది. ఈ పుస్తకాన్ని ప్రముఖ రచయిత వాసుదేవ్‌ మోహి 2012లో రచించారు. కేకే బిర్లా ఫౌండేషన్‌ 1991 నుంచి వివిధ భారతీయ భాషల్లో ఉత్తమ రచనలకు ఏటా ఈ అవార్డులను అందజేస్తుంది. ఈ అవార్డు కింద రచయితకు రూ.15 లక్షల నగదు, ప్రశంసాపత్రం, జ్ఞాపికను ప్రదానం చేస్తారు.

కే-4 క్షిపణి పరీక్ష విజయవంతం

జలాంతర్గాముల నుంచి ప్రయోగించే కే-4 బాలిస్టిక్‌ క్షిపణిని డీఆర్‌డీవో అధికారులు జనవరి 19న విశాఖ తీరానికి సుదూర ప్రాంతం నుంచి విజయవంతంగా ప్రయోగించారు. సముద్రంలో ఉండే జలాంర్గామి నుంచి ఈ క్షిపణిని ప్రయోగించగా 3,500 కి.మీ. దూరంలోని లక్ష్యాలను ఛేదించింది. డీఆర్‌డీవో పూర్తి స్వదేశీ సాంకేతిక పరిజ్ఞానంతో దీన్ని అభివృద్ధి చేసింది. ఇది రెండున్నర టన్నుల ఆయుధాలను మోసుకెళ్లగలదు.


చైనాలో ప్రమాదకర కరోనా వైరస్‌

చైనాలో ప్రమాదకర ‘నావల్‌ కరోనా’ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని అక్కడి ప్రభుత్వం జనవరి 11న ప్రకటించింది. ఈ వైరస్‌ వ్యాప్తికి వుహాన్‌ నగరం కేంద్రంగా ఉందని భావిస్తున్నారు. 2002-03 మధ్య వ్యాపించిన ‘సార్స్‌ (సివియర్‌ ఆక్యూట్‌ రెస్పిరేటరీ సిండ్రోమ్‌)’ సూక్ష్మజీవి జాతికి చెందిన వైరస్‌ ఇది.