శుక్రవారం 05 జూన్ 2020
Nipuna-education - Jan 22, 2020 , 03:29:45

అన్ని పరీక్షలకూ కామన్‌..అర్థమెటిక్‌ - రీజనింగ్‌

అన్ని పరీక్షలకూ కామన్‌..అర్థమెటిక్‌ - రీజనింగ్‌

వివిధ పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులు అర్థమెటిక్‌ , రీజనింగ్‌లపై ఎక్కువ ఫోకస్‌ పెడుతుంటారు. ఎందుకంటే వీటిపై కరెక్టుగా మెదడుకు పని చెబితే  కచ్చితమైన జవాబు వస్తుంది కాబట్టి. దీంతో మార్కులు పెంచుకోడానికి ఉపయోగపడుతుంది. ఇలా కచ్చితమైన సమాధానాలతో మన సామర్థ్యాన్ని అంచనావేయగలిగే సెక్షన్లే ఈ అర్థమెటిక్‌, రీజనింగ్‌ ఎబిలిటీస్‌. 

ఈ అర్థమెటిక్‌, రీజనింగ్‌ ఎబిలిటీస్‌ దాదాపు ఐఏఎస్‌ నుంచి మొదలుకొని వీఆర్‌వో వంటి ప్రతి పోటీ పరీక్షల్లో ఈ సెక్షన్ల నుంచి ప్రశ్నలు వస్తుంటాయి. బ్యాంకు, పోలీస్‌ వంటి పోటీ పరీక్షల్లో 50 శాతం వరకు ఈ సెక్షన్ల నుంచే ప్రశ్నలు వస్తాయి. కాబట్టి అభ్యర్థులు అర్థమెటిక్‌, రీజనింగ్‌లలోని అన్ని చాప్టర్లపై పట్టు సాధించాలి. ఆ తర్వాత అభ్యర్థి రాసే పరీక్ష స్వరూపాన్ని బట్టి ప్రిపేరైతే సరిపోతుంది. బ్యాంకు పరీక్షలైతే ఓ పది చాప్టర్లు, ఇతర పరీక్షలైతే 15 చాప్టర్లపై పట్టు సాధించాలి. వీటికోసం ఆయా పరీక్షలకు సంబంధించిన గత ప్రశ్నపత్రాలు, మోడల్‌ పేపర్లను చదవాలి.

అభ్యర్థి తాను ప్రిపేరయ్యే పరీక్ష సిలబస్‌, పరీక్ష స్వరూపం, ప్రీవియస్‌ పేపర్లు, మోడల్‌ పేపర్ల వంటివాటిపై పూర్తి పట్టు సాధించాలి. అర్థమెటిక్‌, రీజనింగ్‌కు స్టాండర్డ్‌ బుక్స్‌ సేకరించి చదవాలి. ఇలా చేస్తే ప్రతి అంశంపై ఓ స్పష్టత ఏర్పడుతుంది.

ఇవి తెలుసుకోవాలి

ప్రతి పోటీ పరీక్షలో అర్థమెటిక్‌, ప్యూర్‌ మ్యాథ్స్‌, రీజనింగ్‌ల ప్రాముఖ్యం పెరుగుతుంది. ఇది అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని తెలుసుకోడానికి ఉపయోగపడుతుంది.

ఇందులో సమయ పాలన చాలా కీల కం. నిర్దేశిత సమయంలో ప్రశ్నలను సాల్వ్‌ చేయగలగాలి.

ప్రతి ప్రశ్నను 0.36 సెకన్లలో సాధించాలి.

పరీక్షను బట్టి ప్రశ్నలస్థాయిని అంచ నా వేయగలగాలి. ఇందుకు గత ప్రశ్నపత్రాలు ఉపయోగపడుతాయి.

నాన్‌ మ్యాథ్స్‌ అభ్యర్థులు క్యాలిక్యులేషన్స్‌, స్పీడ్‌ మ్యాథ్స్‌ చిట్కాలపై దృష్టిసారించాలి. బాడ్‌మాస్‌, షార్ట్‌కట్‌ రూల్స్‌ పాటించాలి.

బేసిక్స్‌ నుంచి అడ్వాన్స్‌డ్‌ లెవల్‌ ప్రశ్నలు బాగా సాధన చేయాలి.

అభ్యర్థి తమ సామర్థ్యాన్ని బట్టి తక్కువ సమయంలో ఎక్కువ మార్కులు తెచ్చుకునే చాప్టర్లపై దృష్టిసారించాలి.

అర్థమెటిక్‌, న్యూమరికల్‌ ఎబిలిటీస్‌లో ఎక్కాలు, సూత్రాలు వంటి వి బట్టీ పట్టాలి.

రీజనింగ్‌ కొత్త సబ్జెక్టు. ఇది డిగ్రీ వరకు విద్యార్థి దశలో ఎక్కడా కూడా తారసపడదు. కాబట్టి రీజనింగ్‌కు కావాల్సిన ఆల్ఫాబెట్స్‌, నంబర్స్‌, స్వేర్స్‌, క్యూబ్స్‌ వంటివి బట్టీ పడితే కొన్ని చాప్టర్లు ఈజీగా సాల్వ్‌ చేయవచ్చు.

రీజనింగ్‌లో వెర్బల్‌-నాన్‌ వెర్బల్‌ అంశాలపై పట్టుసాధించాలి. రీజనింగ్‌ ద్వారా అభ్యర్థి మేధాశక్తి, నిర్ణయాత్మక శక్తిని పరీక్షిస్తారు. అంటే తక్కువ సమయంలో సమస్యలు, సవాళ్లను ఎలా ఎందుర్కొంటారనే విషయాలను అంచనా వేయవచ్చు. 

అర్థమెటిక్‌, రీజనింగ్‌లకు కచ్చితమైన ప్రణాళిక, నిరంతర శ్రమతో మంచి మార్కులు సాధించవచ్చు. ఏయే పరీక్షలకు ఎలాంటి అంశాలు చదవాలి

యూపీఎస్సీ

ఐఏఎస్‌, ఐపీఎస్‌, ఐఆర్‌ఎస్‌ లాంటి ప్రతిష్ఠాత్మక పోస్టులకు యూపీఎస్సీ సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షలో ప్రిలిమినరీ దశలో సీ-శ్యాట్‌ (పేపర్‌-2)లో 50 శాతానికి గాను అర్థమెటిక్‌, రీజనింగ్‌ నుంచి ప్రామాణిక స్థాయి ప్రశ్నలు వస్తాయి. ఈ పరీక్ష కోసం నంబర్‌ సిరీస్‌, శాతాలు, యావరేజెస్‌, పార్ట్‌నర్‌షిప్‌, లాభ నష్టాలు, పట్టికలు, వెన్‌ డయాగ్రమ్స్‌, లైన్‌గ్రాఫ్‌లు, డీఐ వంటి ప్రశ్నలతోపాటు బ్లడ్‌ రిలేషన్స్‌, డైరెక్షన్స్‌, ర్యాంకింగ్‌, స్టేట్‌మెంట్‌, డెసిషన్‌ మేకింగ్‌ అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌, ప్రాబబిలిటీ, పెర్ముటేషన్స్‌-కాంబినేషన్స్‌ వంటివి ముఖ్యమైనవి. సీ-శ్యాట్‌లో ఇంగ్లిష్‌ నుంచి ప్యాసేజెస్‌ ఎక్కువగా వస్తాయి. అయితే పేపర్‌-1 కేవలం అర్హత పరీక్షే కాబట్టి ఇందులో సాధారణ అంశాలపై దృష్టిసారించాలి. 

ఎస్‌ఎస్‌సీ

కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించిన పోస్టులను స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ భర్తీ చేస్తుంది. దీనికి సంబంధించి ఇంటర్‌, డిగ్రీ పూర్తిచేసినవారు నాలుగు రకాల నోటిఫికేషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందులో 50 శాతం సిలబస్‌ అర్థమెటిక్‌, రీజనింగ్‌ నుంచే ఉంటుంది. ఈ పరీక్షలకు అన్ని చాప్టర్లపై పట్టు సాధించడం వల్ల మంచి స్కోర్‌ చేయవచ్చు. ఎస్‌ఎస్‌సీ సీజీఎల్‌లో ప్రాథమిక అంశాల కంటే ప్రామాణిక అంశాల నుంచే ఎక్కువ ప్రశ్నలు అడుగుతారు. 

రైల్వేలు

నాన్‌ టెక్నికల్‌ రైల్వే ఉద్యోగాలు, ఆర్‌పీఎఫ్‌ పరీక్షల్లో కూడా 50 శాతం ప్రశ్నలు అర్థమెటిక్‌, రీజనింగ్‌ ఎబిలిటీస్‌ నుంచి వస్తాయి. ఇందులో కూడా ఎస్‌ఎస్‌సీ ప్రశ్నపత్రం తరహాలో ఈ సెక్షన్ల నుంచి దాదాపు అన్ని చాప్టర్ల నుంచి 2 నుంచి 3 ప్రశ్నలు అడుగుతారు. కాబట్టి అభ్యర్థులు ప్రామాణిక పుస్తకాలు, గత ప్రశ్నపత్రాలు అధ్యయనం చేయడం వల్ల మంచి ఫలితాలు పొందవచ్చు. 

బ్యాంకింగ్‌ పరీక్షలు

బ్యాంకు పరీక్షల్లో అర్థమెటిక్‌, రీజనింగ్‌లే ప్రధాన సిలబస్‌. వీటినుంచి 60 శాతం మార్కులు వస్తాయి. అయితే బ్యాంకు పరీక్షలకు సన్నద్ధమయ్యేవారు 10 చాప్టర్లపై దృష్టి సారించాలి. అతిముఖ్యమైన చాప్టర్లు అంటే ఒకే అంశం నుంచి 4 నుంచి 5 ప్రశ్నలు వచ్చేవి. వీటిని గుర్తించి సమయానుకూలంగా ప్రిపేర్‌ అయితే బ్యాంక్‌ ఉద్యోగాలు సులభంగా సాధించవచ్చు. 

ఇందులో అర్థమెటిక్‌ నుంచి సింప్లిఫికేషన్స్‌, నంబర్‌సిరీస్‌, క్వాడ్రాటిక్‌ ఈక్వేషన్స్‌, డాటా ఇంటర్‌ప్రిటేషన్స్‌ వంటివి ప్రిలిమ్స్‌, మెయిన్స్‌లో వస్తాయి. 60 నుంచి 70 శాతం ప్రశ్నలు ఈ అంశాల నుంచి అడుగుతారు. 1 నుంచి 2 ప్రశ్నలు పర్సంటేజీ, యావరేజెస్‌, పార్టనర్‌షిప్‌, రేషియో, ప్రమోషన్స్‌, వడ్డీలు, లాభ, నష్టాలు వంటి చాప్టర్ల నుంచి వస్తాయి. 

రీజనింగ్‌ నుంచి పజిల్స్‌, సీటింగ్‌ అరేంజ్‌మెంట్స్‌, కోడింగ్‌-డికోడింగ్‌, డైరెక్షన్స్‌, బ్లడ్‌ రిలేషన్స్‌, సిలాజిసమ్స్‌, ఇన్‌పుట్‌-అవుట్‌పుట్‌, వెన్‌డయాగ్రమ్స్‌ వంటివి చదవాలి. 

బ్యాంక్‌, ఎస్‌ఎస్‌సీ పరీక్షల్లో పరీక్ష దశనుబట్టి ప్రశ్నల స్థాయి మారుతుంది. దీనికోసం సాధారణ స్థాయి నుంచి హెచ్చు స్థాయి ప్రశ్నల వరకు ప్రిపేరవ్వాలి. ప్రతిరోజు 6 నుంచి 8 గంటలు ఈ సెక్షన్లకు కేటాయించి అన్ని చాప్టర్లపై పట్టుసాధించాలి. 

ఎస్‌ఐ, పోలీస్‌ కానిస్టేబుల్‌

ఈ పరీక్షల్లో సగానికిపైగా అర్థమెటిక్‌, రీజనింగ్‌ నుంచే ప్రశ్నలు వస్తాయి. అయితే ఇవి రాష్ట్రస్థాయి పరీక్షలు కాబట్టి తెలుగులో కూడా ప్రశ్నపత్రం ఉంటుంది. దీంతో ఈ సెక్షన్లను సాధించడం కొంచెం సులభం. కాని పోటీ దృష్ట్యా కఠిన స్థాయి ప్రశ్నలు అభ్యర్థులను ఇబ్బంది పెట్టే అంశమని చెప్పవచ్చు. ఎస్‌ఐ, కానిస్టేబుల్‌ పరీక్షలకు ఈ విభాగాల్లో దాదాపు అన్ని చాప్టర్ల నుంచి అంశాలవారీగా ప్రశ్నలు వస్తున్నాయి.  

ఎక్కువ మార్కులు రావాలంటే ఆర్‌ఎస్‌ అగర్వాల్‌, M Tyra, ఆర్‌ గుప్తా వంటి పుస్తకాల్లో బిట్‌-టు-బిట్‌ ప్రాక్టీస్‌ చేయాలి. 

టీఎస్‌పీఎస్సీ

గ్రూప్‌-1, 2, 3, 4 పరీక్షల్లో కూడా అర్థమెటిక్‌, రీజనింగ్‌ సెక్షన్ల నుంచి 25-30 ప్రశ్నలు అడుగుతున్నారు. ఇవి తేలికపాటి అంశాలు, అధ్యాయాల నుంచి సాధారణ స్థాయి ప్రశ్నలే వస్తున్నాయి. జనరల్‌ స్టడీస్‌ మేధా శక్తిని పరీక్షిస్తే, అర్థమెటిక్‌, రీజనింగ్‌ నిర్ణయాత్మక శక్తిని పరీక్షిస్తుంది. కాబట్టి అభ్యర్థులు సమయానుకూలతలను బట్టి ప్రాక్టీస్‌ చేయడం వల్ల మంచి ఫలితాన్నిస్తుంది. 

చదవాల్సిన పుస్తకాలు

5 నుంచి 10వ తరగతి వరకు తెలుగు అకాడమీ బుక్స్‌- బేసిక్స్‌ కోసం

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌- ఆర్‌ఎస్‌ అగర్వాల్‌

క్విక్‌ అర్థమెటిక్‌- ఆశిష్‌ అగర్వాల్‌

ఆబ్జెక్టివ్‌ అర్థమెటిక్‌ (అరిహంత్‌ పబ్లికేషన్స్‌)- రాజేశ్‌ వర్మ 

క్వికర్‌ మ్యాథ్స్‌- ఎం టైరా

అర్థమెటిక్‌ ఫర్‌ ఎస్‌ఎస్‌ఎసీ- రాకేశ్‌ యాదవ్‌ 

వేదిక్‌ మ్యాథ్స్‌- ధవల్‌ భాటియా

అర్థమెటిక/రీజనింగ్‌ గైడ్‌- ఆర్‌ గుప్తా

అనలిటికల్‌ రీజనింగ్‌- ఎంకే పాండే

లాజికల్‌ రీజనింగ్‌/వెర్బల్‌ నాన్‌వెర్బల్‌ రీజనింగ్‌- ఆర్‌ఎస్‌ అగర్వాల్‌

లాజికల్‌ రీజనింగ్‌- అరుణ్‌ శర్మ


ఎలా ప్రిపేరవ్వాలి

అర్థమెటిక్‌, రీజనింగ్‌ సెక్షన్లు ప్రతి పోటీపరీక్షలో సాధారణంగా ఉండే విభాగాలు. కాబట్టి అభ్యర్థి సిలబస్‌ ఆధారంగా ఆయా చాప్టర్లపై దృష్టిపెడితే సరిపోతుంది. 

చాప్టర్ల వారీగా బిట్లు, మోడళ్లు ప్రాక్టీస్‌ చేయాలి. 

సొంతంగా నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకుని దాన్ని పరీక్షకు హారజయ్యేవరకు రివిజన్‌ చేయాలి. ఎన్ని పుస్తకాలు చదివినప్పటికీ సొంతంగా తయారుచేసుకున్న నోట్స్‌ పరీక్ష సమయంలో తోడ్పడుతుంది. 

ఎక్కాలు, సూత్రాలు, షార్ట్‌కట్‌ మెథడ్స్‌, స్పీడ్‌ మ్యాథ్స్‌ వంటివి ప్రాక్టీస్‌చేస్తే తప్ప పరీక్షలో సులభంగా చేయలేం. కాబట్టి స్పీడ్‌ మ్యాథ్స్‌ చిట్కాలు తెలుసుకోవాలి. 

వీలైనంతవరకు ఫార్ములా ఆధారిత ప్రశ్నలు ప్రాక్టీస్‌ చేయాలి. ఇది పరీక్ష రాసిన తర్వాత క్రాస్‌ చేక్‌చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. 

ప్రామాణిక పుస్తకాలతోపాటు ఏదైనా కోచింగ్‌సెంటర్‌ మెటీరియల్‌ని కూడా ఫాలో అవడం మంచిది. 

వీలైనంతవరకు టెస్ట్‌ పేపర్లు రాయడం, తప్పులను సరిదిద్దుకోవడం వంటివి చేయడం వల్ల మన సామర్థ్యం పెంచుకోవచ్చు. 


logo