శుక్రవారం 29 మే 2020
Nipuna-education - Jan 22, 2020 , 00:15:04

సాధనమున పనులు సమకూరు..

సాధనమున పనులు సమకూరు..
  • సాధనమున పనులు సమకూరు..

నాగ శ్రీకృష్ణ ప్రణీత్‌ సీఏ ఫైనల్‌ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకర్‌
దేశంలోని అత్యంత కఠినమైన పరీక్షల్లో సీఏ ఒకటి. సీఏ ఫైనల్‌లో మంచి ర్యాంకు సాధించాలనేది కామర్స్‌ కెరీర్‌ ఎంచుకున్న ప్రతి విద్యార్థి కల. ఇంతటి కఠినమైన పరీక్షల్లో ఏకంగా దేశంలోనే మొదటిర్యాంకు సాధించాడు తెలుగు విద్యార్థి నాగ శ్రీకృష్ణ ప్రణీత్‌. ఇష్టపడి చదివితే ఎంతటి కష్టమైన పని అయినా పాదాక్రాంతం అవుతుందని నిరూపించాడు. గొప్ప లక్ష్యాన్ని సాధించాలంటే గొప్ప ప్రణాళికతోపాటు మార్గదర్శనం చేసేవాళ్లు కూడా సమున్నత లక్ష్యం సాధనాధక్షులై ఉండాలంటున్న ప్రణీత్‌ తాను సీఏ ఫైనల్‌కు సిద్ధమైన తీరు, అందుకోసం తాను వేసుకున్న ప్రణాళిక గురించి నిపుణతో ముచ్చటించారు. ఆ వివరాలు మీకోసం..

కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో కామర్స్‌ సబ్జెక్టుపై ఆసక్తి పెంచుకున్న నేను సీఏ చదవాలన్న లక్ష్యంతో ఇంటర్‌లో మాస్టర్‌మైండ్స్‌ సంస్థలో ఎంఈసీ గ్రూప్‌లో చేరాను. ఉన్నత లక్ష్యం చేరుకోవాలంటే ఉత్తమ సంస్థలో చేరాలన్న సంకల్పంతో ఆ సంస్థలో చేరాను. ఇంటర్‌ ఎంఈసీతోపాటు సీఏసీపీటీ కూడా చదివాను. సీఏ సీపీటీలో 200 మార్కులకుగాను 156 మార్కులు సాధించాను. తర్వాత సీఏ - ఐపీసీసీలో 414 మార్కులు సాధించాను. ప్రస్తుతం సీఏ ఫైనల్‌లో మొదటి ప్రయత్నంలోనే ఆలిండియా మొదటి ర్యాంకు సాధించటం ఆనందంగా ఉంది.

సీఏ కోర్సు చదవాలని నిర్ణయించుకొని కాలేజీలో చేరినప్పుడే నాకు ఆ కోర్సులోని సాధకబాధకాలన్నింటినీ మా లెక్చరర్స్‌ వివరంగా చెప్పారు. దాంతో కోర్సు పూర్తిచేయటానికి సరైన ప్రణాళిక వేసుకొనేందుకు నాకు అవగాహన ఏర్పడింది. సీఏ- ఐపీసీసీ వరకు మాస్టర్‌మైండ్స్‌లో చదివిన నేను, ఫైనల్స్‌ మాత్రం మా ప్రిన్సిపాల్‌ తుమ్మల రామ్మోహన్‌ సర్‌ గైడెన్స్‌లో చదివాను. ఫైనల్‌కు ప్రిపేర్‌ అయ్యే సమయంలో కచ్చితమైన షెడ్యూల్‌ ప్రిపేర్‌ చేసుకున్నాను. మొదటి రోజు నుంచి చివరి రోజు వరకు ఏ రోజు ఏది చదవాలో టైమ్‌టేబుల్‌ వేసుకున్నాను. రోజుకు 15 గంటలు చదివాను. షార్ట్‌నోట్స్‌ ప్రిపేర్‌ చేసుకున్నాను. ఈ నోట్స్‌ వల్ల రివిజన్‌ సులభం అవుతుంది.

సీఏ ఫైనల్‌ కోసం మాక్‌టెస్టులు రాశాను. సీఏకు సంబంధించిన నాణ్యమైన వెబ్‌సైట్స్‌లో ఒకదానిని ఎంపికచేసుకొని టెస్టులు రాశాను. వాటితోపాటు మాస్టర్‌మైండ్స్‌ వారు నిర్వహించే మాక్‌టెస్టులు కూడా రాశాను. ఈ టెస్టులు నా ప్రిపరేషన్‌కు ఎంతగానో ఉపయోగపడ్డాయి. మాక్‌టెస్టులు రాయటంవల్ల అసలైన పరీక్షలో సమయపాలన ఎలా చేసుకోవాలి, ప్రజెంటేషన్‌ను ఎలా మెరుగుపర్చుకోవాలి అన్న విషయాలు తెలుస్తాయి.

నా ప్రిపరేషన్‌లో 15 గంటలు ఏకబిగిన చదవకుండా మధ్యమధ్యలో విశ్రాంతి తీసుకొనేవాడిని.
సీఏ ఫైనల్‌లో 500కు పైగా మార్కులు సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. నిర్ధేశించుకున్న లక్ష్యాన్ని సాధించాను.

ఇష్టంతో చదవాలి

సీఏ చదవాలనుకొనేవారు ముందుగా ఆ కోర్సుపై ఇష్టం పెంచుకోవాలి. కష్టంగా అస్సలు చదువకూడదు. ఇష్టపడి చదివితే తప్పకుండా కోర్సు పూర్తిచేయవచ్చు. ఇతరులు ఫెయిల్‌ అయ్యారని, మధ్యలోనే వదిలేశారని మనం భయపడాల్సిన పనిలేదు.
చదువంటే కేవలం ఐఐటీ, మెడిసిన్‌లు మాత్రమే కాదు. వీటికి మించిన సంతృప్తి, సంపాదన సీఏ ద్వారా పొందవచ్చు. సీఏకు సమాజంలో ఉన్న గౌరవప్రతిష్ఠలు కూడా నేను ఆ కోర్సు చదవటానికి ఒక కారణం.
ఐఐటీలో చదువు కోసం పెట్టే కష్టాన్ని సీఏ కోసం వెచ్చించగలిగితే ఈ కోర్సును సులభంగా పూర్తిచేయవచ్చు. అలాగే చాలా తక్కువ ఖర్చుతో ఈ కోర్సు పూర్తిచేయవచ్చు.
సీఏలో మూడేండ్ల ప్రాక్టికల్‌ ట్రైనింగ్‌ పూర్తిచేయాల్సి ఉంటుంది. పుస్తకాల్లో చదివినది ఎలా ఆచరణలో పెట్టాలి అనేది ఈ ప్రాక్టికల్‌ ద్వారా తెలుస్తుంది.
ఐఐటీ విద్యార్థులకంటే సీఏలకే మంచి అవకాశాలు ఉన్నాయని నా అభిప్రాయం.

సాధన ముఖ్యం

సీఏ ఫైనల్‌ మొదటి ప్రయత్నంలోనే పూర్తిచేయాలంటే ప్రణాళికాబద్ధంగా షార్ట్‌ నోట్స్‌ సిద్ధం చేసుకోవాలి. మాక్‌ టెస్టులు రాయాలి. కనీసం రెండుసార్లు సబ్జెక్టులు మొత్తం రివిజన్‌ చేయాలి. మంచి పేరున్నవారు రాసిన పుస్తకాలు, ఏసీ ఇన్‌స్టిట్యూట్‌ మెటీరియల్‌, కోచింగ్‌ సంస్థ ఇచ్చే మెటీరియల్‌గానీ ఎంపిక చేసుకొని చదవాలి.
సీఏ విద్యార్థులు ఎంత హార్డ్‌వర్క్‌ చేస్తే అంతమంచి ఫలితాలు సాధించవచ్చని నా అభిప్రాయం. ఈ కోర్సులో ఫెయిల్‌ అవుతున్నారంటే ప్రిపరేషన్‌లో ఎక్కడో లోపం ఉందని అర్థం. అర్థం చేసుకొని నిబద్ధతతో చదివితే పూర్తిచేయటం అసాధ్యమేమీ కాదు.


logo