గురువారం 04 జూన్ 2020
Nipuna-education - Jan 15, 2020 , 00:38:04

మధ్యయుగ నిర్మాణాలు ఇండో-ఇస్లామిక్ వాస్తుశైలి

మధ్యయుగ నిర్మాణాలు ఇండో-ఇస్లామిక్ వాస్తుశైలి

 మొగలుల రాకతో ఘనమైన పర్షియన్ శైలి భారతదేశంలో ప్రవేశించింది. విశాలమైన ప్రాంగణాలు, బాల్కనీలు, పెద్దపెద్ద గుమ్మటాలు, భవనాల చుట్టూ ఎత్తయిన మినార్లు ఈ శైలిలో ముఖ్య లక్షణాలు. మొగల్ వంశ స్థాపకుడైన బాబర్ తన సమాధిని కాబూల్ నిర్మించుకున్నాడు. 


- ఢిల్లీలో హుమాయున్ భార్య అయిన సలీమాబేగం నిర్మించిన సమాధి అసలైన మొగల్ సాంప్రదాయానికి చెందిన మొదటి కట్టడంగా పేర్కొనవచ్చు. 


- ఘనమైన మొగలుల వాస్తుశైలికి అక్బర్ పునాదులు వేశాడు. ఆగ్రాలో ఆయన ఎర్రకోట నిర్మాణాన్ని పూర్తిచేశాడు. కోటలోపల అక్బరీ మహల్, బీర్బల్ మహల్ వంటి నిర్మాణాలు చేపట్టాడు. తన శైలిలో అక్బర్ ఎక్కువగా హిందూ, బౌద్ధం, రాజపుత్ర శైలులను మిళితం చేశాడు. పూర్తిగా అక్బర్ దృక్పథాన్ని అనుసరించి ఫతేపూర్ సిక్రీలో నిర్మాణాలు చేపట్టారు. మతపరంగా తన ఆధ్మాత్మిక గురువైన షేక్ చిష్దీ దర్గాను, జామా మసీదును అక్బర్ ఫతేపూర్ సిక్రీలో నిర్మించాడు. 


- మత ప్రమేయంలేని లౌకికపరమైన కట్టడాలుగా బులంద్ దర్వాజాను ఫతేపూర్ సిక్రీ ప్రవేశ ద్వారంగా నిర్మించాడు. గుజరాత్ తాను సాధించిన విజయానికి గుర్తుగా ఈ నిర్మాణాన్ని చేపట్టాడు. ఇందులో పర్షియా సాంకేతిక పరిజ్ఞానమైన హాఫ్ పర్పుల్ డోమ్ ఉపయోగించాడు. జోదాబాయ్ మహల్, మరియా మహల్, నిర్మాణాలు చేపట్టా డు. తన మహల్ నిర్మాణంలో అక్బర్ ఎక్కువగా బౌద్ధ స్థూపాల నిర్మాణాలతో ప్రభావితుడయ్యాడు. 


- జహంగీర్ కాలంలో వాస్తు శైలిలో ముఖ్యమైన మార్పులు చోటుచేసుకున్నాయి. 

- వాస్తు శైలిలో ఇస్లామిక్ శైలి లక్షణాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. 

- మొదటిసారిగా మెజాయిక్ పనితనంతో కూడిన పీట్రడుర్రా అనే సాంకేతిక పరిజ్ఞానం ప్రవేశపెట్టారు. 

- తెల్ల పాలరాయి వాడకం ప్రారంభమైంది.


-  జహంగీర్ తన తండ్రి అక్బర్ సమాధిని ఆగ్రా సమీపంలో సికింద్రా వద్ద నిర్మించాడు. నూర్జహాన్ బైరాన్ కొడుకైన అబ్దుల్ రహీంఖాన్ సమాధిని ఢిల్లీలో, తన తండ్రి ఇతమిద్ ఉద్దౌలా సమాధిని ఆగ్రాలో, జహంగీర్ సమాధిని లాహోర్ నిర్మించాడు. ఇతమిద్ ఉద్దౌలా సమాధి నిర్మాణంలో కొత్త సాంకేతిక పరిజ్ఞానం పీట్రడుర్రా మొదటిసారిగా వాడారు. ఈ నిర్మాణమే తాజ్ నిర్మాణానికి ఆధారమైంది.


- ఘనమైన మొగలుల వాస్తుశైలి షాజాహాన్ కాలంలో అత్యున్నత స్థాయికి చేరింది. షాజాహాన్ గొప్ప నిర్మాతగా పేరుగాంచాడు. ఇతని హయాంలో వాస్తు శైలిలో ముఖ్యమైన మార్పులు..

- తెల్ల పాలరాయి వాడకం విస్తృతమైంది

- అందమైన ఫ్లోరల్ డిజైన్ ఉపయోగించారు. 

- వాస్తు శైలి పూర్తిగా ఇస్లాం సాంప్రదాయాలనే ప్రచురించింది. 


- ఆగ్రాలో షాజాహాన్ ఖాస్ పీష్ మహల్, అంగూలీ బాగ్, మోతీ మసీదు నిర్మించాడు. ప్రపంచ అద్భుతాలలో ఒకటైన తాజ్ తన రాణి ముంతాజ్ సమాధిగా నిర్మించాడు. షాజాహాన్ ప్రధాన శిల్పి ఉస్తా-ఇజాఖాన్ ఆధ్వర్యంలో 22 ఏండ్లపాటు నిర్మాణం సాగింది. దీనికోసం ఉపయోగించిన పాలరాయి మకరాన (రాజస్థాన్) నుంచి సేకరించారు. 


- ఢిల్లీలో షాజాహాన్ ఎర్రకోటను నిర్మించాడు. కోట లోపల దివాన్-ఎ-ఆమ్, దివాన్-ఎ-ఖాన్, రంగమహల్ ముఖ్యమైన కట్టడాలుగా నిర్మించాడు. రంగమహల్ ఫ్లోరల్ డిజైన్లకు ప్రసిద్ధి గాంచింది. అమీర్ ఖుస్రో తన వాక్యాలైన ‘ప్రపంచంలో అత్యంత అందమైన ప్రదేశం ఇదని దివాన్-ఎ-ఖాస్ ముద్రించి ఉంది.  దేశంలోనే అతిపెద్దదైన జామా మసీదును ఢిల్లీలో నిర్మించాడు. 


- ఔరంగజేబు కాలంలో ఘనమైన వాస్తు శైలి ఆదరణ కోల్పోయింది. సనాతనవాది, నిరాడంబరుడైన ఔరంగజేబు కట్టడాల నిర్మాణాన్ని వ్యతిరేకించాడు. తన రాణి రహవూద్-దురానీ కోసం ఔరంగాబాద్ తాజ్ పోలిన కట్టడం బీబీకా మక్బారా నిర్మించాడు. చివరకు తానుకూడా ఔరంగాబాద్ సమాధి చేయబడ్డాడు. 


ప్ర. మొగలుల కాలంనాటి సంగీత విశేషాలను వివరించండి. 

జ. వాస్తవానికి ఇస్లాం సంగీతాన్ని అంగీకరించకపోయినప్పటికీ టర్కులు భారతదేశంలో తమ రాజ్యాన్ని ఏర్పర్చే కాలంనాటికి సంగీతం ఒక కళగా అభివృద్ధి చెందింది. ముస్లింలు తమ సంగీత సాంప్రదాయంతోపాటు సారంగి, షహనాయ్, రహాబ్ అనే కొత్త వాయిద్యాలను ప్రవేశపెట్టారు. స్థానిక సంగీత సాంప్రదాయాలతో పాటు వాయిద్యాలైన నాదస్వరం, మృదంగం, ఘటములను గ్రహించారు. ఫలితంగా మిశ్రమ సాంప్రదాయాలతో కూడిన హిందుస్థానీ సంగీతం అభివృద్ధి చెందింది. 


- హిందుస్థానీ సంగీతంలో ప్రధాన సంగీత ప్రక్రియలు నాలుగు. అవి.. 

1. దృవద్ అంటే విషాద సంగీతం  

2. ఖయాల్ అంటే ఆశువుగా గీతాన్ని సమకూర్చి ఆలపించడం

3. టుమ్రీ అంటే సంభాషణల రూపంలోని పాటలు

4. టప్పాలు అంటే ఎడారుల్లో ఒంటెలు నడిపేవారు పాడే జానపద గీతాలు


- హిందుస్థానీ సంగీతంలో అమీర్ ఖుస్రో గొప్ప విద్వాంసుడు. తనదైన కొత్త రాగాలు సనమ్, గోరా, ఐమన్ ప్రవేశపెట్టాడు. కొత్త వాయిద్యాలైన తబలా, సితార్ భక్తి సంగీతం ఖవాలిని ప్రవేశపెట్టాడు. 


- ప్రాంతీయ రాజవంశాలైన మాల్వా ఖిల్జీలు, జాన్ షాకీలు హిందుస్థానీ సంగీతాన్ని ఆదరించారు. మాల్వా పాలకుడైన బాజ్ బహదూర్, అతని భార్య రూపమతి సంగీతంలో గొప్ప విద్వాంసులు. జాన్ పాలకులైన హుస్సేన్ షా ఖయాల్ రూపకాన్ని ప్రవేశపెట్టాడు. 


- మొగలుల కాలంలో హిందుస్థానీ సంగీతం గొప్ప ఆదరణకు నోచుకున్నది. అబుల్ ఫజల్ ప్రకారం అక్బర్ కొలువులో 27 మంది గొప్ప సంగీత విద్వాంసులు ఉండేవారు. వీరిలో ప్రముఖుడు మియాన్ తాన్ దీపక్, దర్బారీ, మేఘ ముల్లార్ రాగాలను ఆలపించడంలో తాన్ నిష్ణాతుడు. ఇలాంటి విద్వాంసుడు గత వందేండ్లలో లేడని, వంద ఏండ్ల తర్వాత కూడా రాబోడని అబుల్ ఫజల్ వ్యాఖ్యానించాడు. 


- మొగలు చక్రవర్తులు వ్యక్తిగతంగా సంగీతంలో గొప్ప అభిరుచిని కనబరిచారు. అక్బర్ స్వయంగా డ్రమ్స్ వాయించడంలో ప్రవేశం ఉన్నది. జహంగీర్ మొగల్ చక్రవర్తుల్లో కెల్లా ఎక్కువ గీతాలు రచించాడు. షాజాహాన్ గొప్ప సంగీత విద్వాంసుడు. ముఖ్యంగా ద్రుపద్ రాగాన్ని ఆలపించడంలో గొప్ప ప్రవేశం ఉన్నవాడు. ఔరంగజేబు పాలకుడిగా సంగీతాన్ని నిషేధించినప్పటికీ వ్యక్తిగతంగా వీణా వాయిద్యంలో ప్రవేశం ఉన్నది. హిందుస్థానీ సంగీతం మొగలుల అనంతరం స్వదేశీ సంస్థానాదీశుల ఆదరణలో కొనసాగింది.  


ప్ర. ఇండో-ఇస్లామిక్ వాస్తుశైలిని వివరించండి? 

జ. దేశంలో ప్రవేశించకముందే ఇస్లాం తనదైన ప్రత్యేక శైలిని రూపొందించుకుంది. దీన్ని గుమ్మటాలు, కమాన్ శైలి అని వ్యవహరించారు. పెద్ద పెద్ద గుమ్మటాలు, కమాన్ ఎటువంటి అలంకరణలేని నిరాడంబరమైన నిర్మాణాలు ఇస్లామిక్ శైలి ఇతర ముఖ్యలక్షణాలు. 


- భారతదేశంలోకి ప్రవేశించిన అనంతరం ఇస్లాం స్వదేశీ హిందూ శైలిలోని కొన్ని ముఖ్య లక్షణాలను గ్రహించింది. ముఖ్యంగా భవనాలపై కలశాలను ప్రతిష్టించడం, అలంకార ప్రాయమైన పద్మం, స్వస్తిక్ వంటి గుర్తులను వాడటం వంటి లక్షణాలను గ్రహించింది. ఫలితంగా ఇండో-ఇస్లామిక్ అనే మిశ్రమ వాస్తుశైలి అభివృద్ధి చెందింది.


- ఇండో-ఇస్లామిక్ వాస్తు శైలి రెండు దశల్లో అభివృద్ధి చెందింది. ముస్లింల ప్రధాన రాజధానులైన ఢిల్లీ, ఆగ్రా, ఫతేపూర్ సిక్రీలో అభివృద్ధి చెందిన శైలి సామ్రాజ్యవాద శైలిగాను, బెంగాల్, జాన్ మాల్వా, గుజరాత్, బహుమనీ సామ్రాజ్యంలో అభివృద్ధి చెందిన శైలి ప్రాంతీయ శైలిగా అభివృద్ధి చెందింది. 


- సామ్రాజ్యవాద శైలి ఢిల్లీ సుల్తానులు, మొగల్ చక్రవర్తుల స్వీయ పరిరక్షణలో వారి అభిరుచులకు తగ్గట్టుగా పరిణితి చెందింది ఢిల్లీ సుల్తాన్లలో తొలి పాలక వంశమైన బానిస వంశం స్వచ్ఛమైన ఇస్లామిక్ శైలిని అనుసరించి నిరాడంబరత్వంతో కూడిన కట్టడాల నిర్మాణాలను చేపట్టారు. కుతుబుద్దీన్ ఐబక్ స్వచ్ఛమైన ఇస్లామిక్ శైలిలో మొదటి మసీదైన కువ్వత్ ఉల్ ఇస్లామ్ ఢిల్లీలో నిర్మించాడు. సుల్తాన్ దర్శనమివ్వడానికి అనువైన ‘అర్హదిన్ కా జోప్రా’ను అజ్మీర్ నిర్మించాడు. దేశంలో ఇస్లాం విజయం సాధించినందుకు గుర్తుగా కుతుబ్ నిర్మాణం చేపట్టాడు. ఇల్ ఈ నిర్మాణాన్ని పూర్తిచేసి గొప్ప సూఫీ యోగి అయిన కుతుబుద్దీన్ భక్తియార్ ఖాకీకి అంకితమిచ్చాడు. 


- ఖిల్జీల కాలంలో వాస్తుపరంగా నిరాడంబరత్వం పోయి ఆడంబరత్వం చోటు చేసుకుంది. ముఖ్యంగా అల్లావుద్దీన్ ఖిల్జీ తన ప్రతిష్టకు తగినరీతిలో నిర్మాణాలు చేపట్టాడు. కుతుబ్ మినార్ ప్రవేశద్వారమైన అలయ్ దర్వాజలో ఇస్లామిక్ సాంప్రదాయానికి విరుద్ధమైన అలంకరణ, చక్కటి నగిషీ కనిపిస్తుంది. అదేవిధంగా ఢిల్లీలో సిరి అనే పట్టణ నిర్మాణాన్ని, హౌజ్ ఏ అలయ్, ఖాదనా మసీదుల నిర్మాణాలు చేపట్టాడు. 


- తుగ్లక్ కాలంలో ఆర్థిక వ్యవస్థ పటిష్టంగా లేకపోవడంతో నాసిరకమైన గోధుమరంగు రాయి విరివిగా వినియోగించారు. మందం ఎక్కువగా ఉన్న ఏటవాలు గోడల నిర్మాణం ప్రారంభమైంది. గియాసుద్దీన్ తుగ్లక్ తుగ్లకాబాద్ పట్టణాన్ని నిర్మించగా, మహ్మద్ బిన్ తుగ్లక్ గంగానది ఒడ్డున స్వర్గ ద్వారమును నిర్మించాడు. గొప్ప నిర్మాతైన ఫిరోజ్ తుగ్లక్ ఢిల్లీలో ఫిరోజ్ షా కోట్ల, హౌజ్ ఖాస్ నిర్మించాడు. 1200 ఉద్యానవనాలతో ఢిల్లీని అందంగా తీర్చిదిద్దాడు. ఫిరోజ్ ఫతేపూర్, ఫతేబాద్, జాన్ అనే పట్టణాలను నిర్మించాడు. 


- వాస్తు శైలిలో ముఖ్యమైన లక్షణాలన్నీ లోడీల కాలంలో ప్రవేశపెట్టారు. రెండు గుమ్మటాల నిర్మాణాలు, ఎత్తయిన నిర్మాణాలు, కోణాకృతి, అష్టభుజి నిర్మాణాలు, ఉద్యానవనాల మధ్య నిర్మాణాలు లోడీలతో ప్రారంభమయ్యాయి. సికిందర్ లోడీ ఆగ్రాలో నిర్మించిన జమాత్ ఖానా మసీదు లోడీల శైలికి ప్రధాన నిదర్శనం. logo