e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, October 22, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ ప్రపంచ పర్యాటక రోజుగా ఏ తేదీన నిర్వహిస్తారు?

ప్రపంచ పర్యాటక రోజుగా ఏ తేదీన నిర్వహిస్తారు?

 1. రాజకీయ పార్టీలను రాష్ట్ర లేదా జాతీయ స్థాయిగా గుర్తించే అధికారం ఎవరికి ఉంది? (డి)
  ఎ) పార్లమెంట్‌ బి) రాష్ట్రపతి
  సి) కేంద్ర క్యాబినెట్‌ డి) ఎన్నికల సంఘం
  వివరణ: రాజకీయ పక్షాలను జాతీయ లేదా ప్రాంతీయ పార్టీలుగా గుర్తించేది కేంద్ర ఎన్నికల సంఘం. ఇటీవల ఈ రాజ్యాంగ బద్ధ సంస్థ ఒక నివేదికను విడుదల చేసింది. దేశంలో గుర్తింపు లేని రాజకీయ పార్టీలు 2796 ఉన్నాయి. తెలుగు రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్ర సమితి, తెలుగు దేశం, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ, ఎంఐఎంలకు ప్రాంతీయ పార్టీలుగా గుర్తింపు ఉంది.
 2. ఎన్నికల సంఘం ప్రకారం ప్రస్తుతం దేశంలో ఎన్ని జాతీయ పార్టీలు ఉన్నాయి? (బి)
  ఎ) 7 బి) 8 సి) 6 డి) 9
  వివరణ: ప్రస్తుతం దేశంలో గుర్తింపు పొందిన జాతీయ పార్టీలు ఎనిమిది ఉన్నాయి. అవి.. భారతీయ జనతాపార్టీ, భారత జాతీయ కాంగ్రెస్‌, ఎన్సీపీ, బీఎస్పీ, సీపీఐ, సీపీఎం, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ, తృణమూల్‌ కాంగ్రెస్‌. సాధారణ లోక్‌సభ ఎన్నికల్లో పోలై చెల్లిన ఓట్లలో నాలుగు రాష్ర్టాల్లో 1/6వ వంతు ఓట్లను పొందిన పార్టీ అదే విధంగా కనీసం 4 స్థానాలను పొందిన పార్టీ లేదా కనీసం నాలుగు రాష్ర్టాల్లో ప్రాంతీయ పార్టీగా గుర్తింపు పొంది ఉన్నా లేదా లోక్‌సభ మొత్తం స్థానాల్లో కనీసం 2% సీట్లు (11 స్థానాలు) గెలుచుకొని ఉండాలి. ఈ అభ్యర్థులు కనీసం మూడు రాష్ర్టాల నుంచి ఎన్నిక కావాలి.
 3. భారత్‌ డిజిటల్‌ మిషన్‌తో ప్రయోజనం ఏంటి? (సి)
  1. అత్యుత్తమ వైద్య సేవలు పొందవచ్చు
  2. ప్రజల వైద్య ఖర్చులు తగ్గుతాయి
   ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
   వివరణ: దేశంలో ప్రతి పౌరుడికి డిజిటల్‌ గుర్తింపు కార్డ్‌ (ఐడి)ను ఇచ్చేందుకు ఆయుష్మాన్‌ భారత్‌ డిజిటల్‌ మిషన్‌ను ప్రధాని నరేంద్ర మోదీ సెప్టెంబర్‌ 27న ప్రారంభించారు. పౌరులు తమ ఆరోగ్య రికార్డులను భౌతిక రూపంలో భద్రపరుచుకోవాల్సిన అవసరం లేదు. డిజిటల్‌ రూపంలో ఉంటాయి. అత్యుత్తమ వైద్య సేవలు పొందడంతో పాటు మళ్లీమళ్లీ ఆరోగ్య పరీక్షలు చేసుకొనే ఇబ్బంది తప్పుతుంది. దీనివల్ల ఆ మేరకు డబ్బు ఆదా అవుతుంది. మధ్య తరగతి, దిగువ మధ్య తరగతి ప్రజలకు ఊరట లభిస్తుంది. 2020 ఆగస్ట్‌ 15న పైలట్‌ ప్రాజెక్ట్‌గా ఆరు కేంద్ర పాలిత ప్రాంతాల్లో అమలు చేశారు. అవి.. అండమాన్‌ నికోబార్‌ దీవులు, చండీగఢ్‌, దాద్రానగర్‌ హవేలీ, లఢక్‌, లక్షద్వీప్‌, పుదుచ్చేరి.
 4. ఏ దేశం చేరేందుకు షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌ అనుమతి ఇచ్చింది? (డి)
  ఎ) ఇరాక్‌ బి) సింగపూర్‌
  సి) బల్గేరియా డి) ఇరాన్‌
  వివరణ: 2005 నుంచి పరిశీలక షాంఘై కోఆపరేషన్‌ ఆర్గనైజేషన్‌లో పరిశీలక హోదాలో ఉన్న ఇరాన్‌ ఆ కూటమిలో చేరనుంది. ఈ మేరకు అనుమతి లభించింది. ఈ కూటమిలో ఇప్పటి వరకు ఎనిమిది దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. అవి.. భారత్‌, చైనా, రష్యా, తజకిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌, కజకిస్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌, పాకిస్థాన్‌. యురేషియా (యూరప్‌+ ఆసియా)కు చెందిన రాజకీయ, ఆర్థిక, భద్రతాపరమైన కూటమిగా దీనిని భావించవచ్చు. అయిదు దేశాలతో ఇది 1996లో ఏర్పాటయ్యింది. అవి.. చైనా, కజకిస్థాన్‌, కిర్గిజ్‌స్థాన్‌, రష్యా, తజకిస్థాన్‌. 2017లో భారత్‌, పాకిస్థాన్‌లు పూర్తి స్థాయి సభ్యత్వాన్ని పొందాయి.
 5. ఇటీవల ప్రారంభించిన ఈ-శ్రమ్‌ ఎవరికి ఉద్దేశించింది? (ఎ)
  ఎ) అసంఘటిత రంగ కార్మికులు
  బి) సంఘటిత రంగ కార్మికులు
  సి) నిరుద్యోగులు డి) ఎవరూ కాదు
  వివరణ: అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర ప్రభుత్వం ఈ-శ్రమ్‌ పోర్టల్‌ను ప్రారంభించింది. అందులో పేర్లు నమోదు చేసుకున్న వారికి రూ.2 లక్షల ప్రమాద బీమా, రూ.5 లక్షల ఆరోగ్య బీమా వర్తిస్తుంది. వీరికి రూ.3 వేల పింఛను కూడా లభిస్తుంది. ఈఎస్‌ఐ, పీఎఫ్‌ లేని కార్మికులు అంతా ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకుంటే వారికి సామాజిక భద్రతాపరమైన పథకాలను వర్తింపచేస్తారు. అర్చకులు, వంట చేసేవాళ్లు కూడా ఈ పోర్టల్‌లో పేరు నమోదు చేసుకొనే అవకాశం కూడా కల్పిస్తారు.
 6. కింది వాటిలో ఇటీవల ఏ ఉత్పత్తులకు జీఐ ట్యాగ్‌ దక్కింది? (సి)
  1. తీపి కీరదోస 2. జుడిమా
  2. సొజత్‌ మెహెందీ
   ఎ) 1, 2 బి) 2, 3
   సి) 1, 2, 3 డి) 1, 3
   వివరణ: నాగాలాండ్‌కు చెందిన తీపి కీరదోసతో పాటు అస్సాంలో బియ్యంతో తయారు చేసే జుడిమా, రాజస్థాన్‌లో సొజత్‌ మెహెందీ అనే గోరింటాకుకు భౌగోళిక గుర్తింపు లభించింది. నాగాలాండ్‌కు తీపి కీరదోస ఆ రాష్ట్రం నుంచి జీఐ ట్యాగ్‌ పొందిన నాలుగో ఉత్పత్తి. వ్యవసాయ ఉత్పత్తుల జాబితాలో మూడో స్థానంలో ఉంది. జుడిమా అనే బియ్యంతో ఇళ్లలోనే తయారు చేసే పదార్థానికి కూడా జీఐ ట్యాగ్‌ లభించింది. కిణ్వప్రక్రియతో దీనిని తయారు చేస్తారు. రాజస్థాన్‌లోని పలి జిల్లాలో తయారు చేసే సొజత్‌ గోరింటాకు జీఐ ట్యాగ్‌ దక్కించుకుంది.
 7. సీ-295 ఇటీవల వార్తల్లో నిలిచింది, ఇది ఏంటి? (బి)
  ఎ) వైరస్‌లో వచ్చిన కొత్త ఉత్పరివర్తనం
  బి) అధునాతన యుద్ధ విమానాలు
  సి) ముక్కు ద్వారా ఇచ్చే కరోనా వ్యాక్సిన్‌
  డి) ఏదీకాదు
  వివరణ: పర్వత ప్రాంతాలు, ప్రతికూల పరిస్థితులు ఉండే భూభాగాల్లోకి సులువుగా సైనికులు, సామగ్రిని చేరవేసేలా భారత వైమానిక దళ రవాణా సామర్థ్యం భారీగా మెరుగుపరిచేందుకు 56 అధునాతన సీ-295 విమానాలు ఇవ్వనున్నారు. ఈ విమానాలకుగాను రూ.21వేల కోట్లతో భారత రక్షణ శాఖ ఎయిర్‌బస్‌ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుంది. మొదట 16 విమానాలను ఎయిర్‌బస్‌ స్పెయిన్‌లోని తన కర్మాగారం నుంచి నేరుగా సరఫరా చేస్తుంది. మిగతా 40 లోహ విహంగాలను భారత్‌లో టాటా అడ్వాన్స్‌డ్‌ సిస్టమ్స్‌ ఉత్పత్తి చేస్తుంది. ఒప్పందం కుదిరిన నాటి నుంచి పదేళ్లలోపు అవి అందుతాయి. ఆవ్రో-748 లోహ విహంగాల స్థానంలో వీటిని ప్రవేశపెట్టనున్నారు
 8. ఆకాశ్‌ ప్రైమ్‌ అనేది? (ఎ)
  ఎ) భూతలం నుంచి గగన తలంలోకి వెళ్లే క్షిపణి
  బి) గగన తలం నుంచి భూ తలానికి వచ్చే క్షిపణి
  సి) భారత్‌ రూపొందించిన వేగవంతమైన కంప్యూటర్‌
  డి) ఆధునిక డ్రోన్‌ పరిజ్ఞానం
  వివరణ: స్వదేశీ పరిజ్ఞానంతో భారత్‌ రూపొందించిన ఆకాశ్‌ క్షిపణిలోని కొత్త వెర్షన్‌ను విజయవంతంగా ప్రయోగించారు. భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఈ అస్ర్తాన్ని ఒడిశాలోని చాందీపూర్‌లో ఉన్న ఇంటిగ్రేటెడ్‌ టెస్ట్‌ సెంటర్‌ (సమీకృత పరీక్ష కేంద్రం) నుంచి ప్రయోగించారు. ఆకాశ్‌ క్షిపణితో పోలిస్తే, ప్రైమ్‌ వెర్షన్‌లో దేశీయ పరిజ్ఞానంతో రూపొందిన యాక్టివ్‌ ఆర్‌ఎఫ్‌ సీకర్‌ ఉంది. లక్ష్య ఛేదనలో క్షిపణి కచ్చితత్వాన్ని ఇది మెరుగుపరిచింది. ఇంకా అనేక అంశాల్లో ఈ అస్ర్తాన్ని ఆధునీకరించారు. ఎత్తయిన ప్రాంతాల్లో ఉండే శీతల వాతావరణాన్ని కూడా ఇది సమర్థంగా తట్టుకొని పనితీరును చూపిస్తుంది.
 9. నీతి ఆయోగ్‌ విడుదల చేసిన నివేదిక ప్రకారం వ్యవసాయ పురోగతిలో తెలంగాణ ఎన్నో స్థానంలో ఉంది? (సి)
  ఎ) 1 బి) 2 సి) 3 డి) 4
  వివరణ: దేశంలో గత పదేండ్లలో వ్యవసాయ రంగ పురోగతిని విశ్లేషిస్తే కేవలం 11 రాష్ర్టాల్లోనే పరిస్థితి మెరుగ్గా ఉందని నీతి ఆయోగ్‌ అభిప్రాయపడింది. స్వాతంత్య్రం తర్వాత దేశ వ్యవసాయ రంగ పురోగతిపై రూపొందించిన విశ్లేషణ పత్రాన్ని నీతి ఆయోగ్‌ ఇటీవల విడుదల చేసింది. 2011-12 నుంచి 2019-20 మధ్య కాలంలో కేవలం 11 రాష్ర్టాల్లోనే 3% మించిన సగటు వృద్ధి రేటు నమోదయ్యింది. ఇందులో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌ నాలుగో స్థానంలో నిలిచింది.
 10. కొలను పెద్ద వెంకయ్య, కొలను రవీందర్‌లు ఇటీవల వార్తల్లో నిలిచారు. వీరు ఏ వృత్తికి సంబంధించిన వాళ్లు? (బి)
  ఎ) రైతులు బి) చేనేత కళాకారులు
  సి) సాఫ్ట్‌వేర్‌ రంగం డి) ఏదీకాదు
  వివరణ: పుట్టపాక తేలియా రుమాల్‌ డబుల్‌ ఇక్కత్‌ చీరకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. యాదాద్రి భువనగిరి జిల్లా పుట్టపాకకు చెందిన చేనేత కళాకారుడు కొలను పెద్ద వెంకయ్య, ఆయన కుమారుడు రవీందర్‌ పది నెలల పాటు శ్రమించి మగ్గంపై వేసిన ఈ చీర జాతీయ హస్తకళల పురస్కారానికి ఎంపికయ్యింది. చేనేత జౌళి మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో 2018 ఏడాదికిగాను 18 మందిని చేనేత కళాకారుల విభాగంలో ఎంపిక చేసింది. వారిలో తెలంగాణ నుంచి పుట్టపాకకు చెందిన తండ్రి, కుమారులు ఉన్నారు. నాణ్యమైన పత్తితో తయారయిన నూలును దీని తయారీలో వినియోగిస్తారు. కరక్కాయపొడి తదితర ప్రకృతి సిద్ధ పదార్థాలతో శుద్ధి చేసి టై అండ్‌ డై పద్ధతిలో డిజైన్లు రూపొందిస్తారు.
 11. ఇటీవల జీఎస్టీకి సంబంధించి హేతుబద్ధీకరణ, ఎగవేతల నిరోధం అనే అంశాలకు కమిటీలను నియమించారు. వీటికి నేతృత్వం వహిస్తున్న వాళ్లు? (డి)
  ఎ) నిర్మలా సీతారామన్‌, తార్‌ కిశోర్‌
  బి) అమిత్‌ మిశ్రా, అజిత్‌ పవార్‌
  సి) నిర్మలా సీతారామన్‌, బాలగోపాల్‌
  డి) బసవరాజ్‌ బొమ్మై, అజిత్‌ పవార్‌
  వివరణ: జీఎస్‌టీ రేట్లను, జీఎస్‌టీ మినహాయింపు ఉన్న వస్తువులపై సమీక్ష చేసేందుకు ఒక కమిటీ, అలాగే పన్ను ఎగవేతల నిరోధానికి మరో కమిటీని నియమించారు. మొదటి దానికి కర్నాటక రాష్ట్రముఖ్యమంత్రి బసవరాజ్‌ బొమ్మై నేతృత్వం వహిస్తారు. రెండు నెలల్లో ఇది తన నివేదికను ఇస్తుంది. ఈ కమిటీలో పశ్చిమబెంగాల్‌ ఆర్థిక మంత్రి అమిత్‌ మిశ్రా, కేరళ ఆర్థిక మంత్రి కేఎన్‌ బాలగోపాల్‌, బీహార్‌ ఉప ముఖ్యమంత్రి తార్‌ కిశోర్‌ ఉన్నారు. అలాగే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్‌ పవార్‌ నేతృత్వంలో ఎనిమిది మందితో మరో కమిటీని నియమించారు. పన్ను ఎగవేతకు గురి కాకుండా తీసుకోవాల్సిన చర్యలను ఇది సూచిస్తుంది.
 12. తెలంగాణలో ఇళ్ల స్థలాలపై మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటయ్యింది. దీనికి ఎవరు నేతృత్వం వహిస్తున్నారు? (సి)
  ఎ) హరీశ్‌ రావు బి) జగదీశ్‌ రెడ్డి
  సి) కేటీఆర్‌ డి) తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌
  వివరణ: తెలంగాణలో ఇళ్ల స్థలాల సమస్యలు, ఇతర అంశాల పరిష్కారం కోసం పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర ప్రభుత్వం ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. హరీశ్‌ రావు, శ్రీనివాస్‌ గౌడ్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌, ఎర్రబెల్లి దయాకర్‌ రావు, మల్లారెడ్డి, సబితా ఇంద్రారెడ్డి ఇందులో సభ్యులుగా ఉంటారు. అనుమతి లేని లే అవుట్లు, ప్లాట్లు-ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ, గ్రామ కంఠం సహా ఇండ్ల స్థలాలకు సంబంధించిన ఇతర అంశాలను ఉపసంఘం పరిశీలించి ప్రభుత్వానికి సిఫారసులు అందించనుంది.
 13. దేశంలో ప్రస్తుతం బ్లూ ఫాగ్‌ సర్టిఫికేషన్‌ను పొందిన బీచ్‌లు ఎన్ని ఉన్నాయి? (డి)
  ఎ) 7 బి) 8 సి) 9 డి) 10
  వివరణ: ఇటీవల తమిళనాడులోని కోవలం, పుదుచ్చేరిలోని ఈడెన్‌లు బ్లూ ఫాగ్‌ సర్టిఫికేషన్‌ను పొందాయి. దీంతో ఈ తరహా సర్టిఫికెట్లు పొందిన వాటి సంఖ్య భారత్‌లో 10కి చేరింది. ఈ సర్టిఫికేషన్‌ను డెన్మార్క్‌కు చెందిన ‘ఫౌండేషన్‌ ఫర్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఎడ్యుకేషన్‌’ అనే సంస్థ ఇస్తుంది. కొపెన్‌హెగెన్‌ కేంద్రంగా ఈ స్వచ్ఛంద సంస్థ పనిచేస్తుంది. గతంలో ఒకేసారి భారత్‌లోని ఎనిమిది బీచ్‌లకు ఈ గుర్తింపు లభించింది. పరిశుభ్రత ఆధారంగా ఈ సర్టిఫికేషన్‌ను ఇస్తారు.
 14. 2022లో శీతాకాల పారాలింపిక్‌ పోటీలు ఎక్కడ నిర్వహించనున్నారు? (ఎ)
  ఎ) బీజింగ్‌ బి) బ్రిస్బేన్‌
  సి) పారిస్‌ డి) నైరోబీ
  వివరణ: 2022లో శీతాకాల ఒలింపిక్స్‌, పారాలింపిక్స్‌లను చైనాలోని బీజింగ్‌లో నిర్వహించనున్నారు. దీని అధికారిక నినాదాన్ని ఇటీవల విడుదల చేశారు. ‘టుగెదర్‌ ఫర్‌ ఏ షేర్డ్‌ ఫ్యూచర్‌’ అనే నినాదంతో ఈ క్రీడలను నిర్వహిస్తారు. శీతాకాల ఒలింపిక్స్‌ 2022, ఫిబ్రవరి 4 నుంచి 20 వరకు, పారాలింపిక్స్‌ అదే సంవత్సరం మార్చి 4 నుంచి 13 వరకు ఉంటాయి.
 15. ప్రపంచ పర్యాటక రోజుగా ఏ తేదీన నిర్వహిస్తారు? (సి)
  ఎ) సెప్టెంబర్‌ 26 బి) సెప్టెంబర్‌ 28
  సి) సెప్టెంబర్‌ 27 డి) సెప్టెంబర్‌ 29
  వివరణ: ఏటా సెప్టెంబర్‌ 27ను ప్రపంచ పర్యాటక రోజుగా నిర్వహిస్తారు. స్పెయిన్‌లోని మాడ్రిడ్‌ కేంద్రంగా పనిచేసే ఐక్యరాజ్య సమితి ప్రపంచ పర్యాటక సంస్థ దీనిని 1980 నుంచి నిర్వహిస్తుంది. ఈ ఏడాది ఇతివృత్తం ‘సమ్మిళిత వృద్ధికి పర్యాటకం’. అలాగే సెప్టెంబర్‌ 26ను ప్రపంచ పర్యావరణ ఆరోగ్య రోజుగా, అణ్వాయుధాల నిర్మూలన రోజుగా నిర్వహిస్తారు. సెప్టెంబర్‌ 28ని ప్రపంచ ర్యాబిస్‌ రోజు, అలాగే సమాచార లభ్యత రోజుగా కూడా గుర్తించారు. సెప్టెంబర్‌ 29న ప్రపంచ హృదయ దినోత్సవంగా నిర్వహిస్తారు.

వి. రాజేంద్ర శర్మ
ఫ్యాకల్టీ ,98492124
11

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement