e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, September 18, 2021
Home ఎడ్యుకేషన్ & కెరీర్‌ ఇన్నోవేషన్‌ అంబాసిడర్స్‌ అంటే ఎవరు?

ఇన్నోవేషన్‌ అంబాసిడర్స్‌ అంటే ఎవరు?

 1. ఇటీవల అమెరికా మూడు దేశాలతో కలిపి మరో క్వాడ్‌ కూటమిని ఏర్పాటు చేసింది. అందులో భాగం కాని దేశం? (డి)
  ఎ) ఆఫ్ఘనిస్థాన్‌ బి) పాకిస్థాన్‌
  సి) ఉజ్బెకిస్థాన్‌ డి) సౌదీ అరేబియా
  వివరణ: పాకిస్థాన్‌, ఆఫ్ఘనిస్థాన్‌, ఉజ్బెకిస్థాన్‌లతో కలిసి అమెరికా మరో క్వాడ్‌ కూటమిని ఏర్పాటు చేసింది. ఇప్పటికే భారత్‌, అమెరికా, జపాన్‌, ఆస్ట్రేలియాలతో కలిసి ఒక కూటమి ఉంది. హిందూ మహాసముద్రంలో చైనా ఆధిపత్యాన్ని అడ్డుకోవడానికి ఈ కూటమి యత్నిస్తుంది. అలాగే చైనా తలపెట్టిన బెల్ట్‌ అండ్‌ రోడ్‌ ఇనీషియేటివ్‌ను దీటుగా ఎదుర్కోవడానికి మరో కూటమిని ఏర్పాటు చేసినట్లు పరిశీలకులు భావిస్తున్నారు.
 2. ఇన్నోవేషన్‌ అంబాసిడర్స్‌ అంటే ఎవరు? (బి)
  ఎ) ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న భారత
  క్రీడాకారులు
  బి) సృజనాత్మకత బోధనలో శిక్షణ
  పొందనున్న ఉపాధ్యాయులు
  సి) కరోనా జాగ్రత్తలు చెబుతున్న
  క్రీడా స్టార్‌లు
  డి) ఎవరూకాదు
  వివరణ: సృజనాత్మకత, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌, డిజైన్‌ ఆలోచన తదితర అంశాల్లో 50,000 మంది ఉపాధ్యాయులకు శిక్షణ ఇవ్వడానికి స్కూల్‌ ఇన్నోవేషన్‌ అంబాసిడర్‌ ట్రెయినింగ్‌ ప్రోగ్రామ్‌ను ప్రారంభించారు. ఇందులో శిక్షణ పొందే ఉపాధ్యాయులను ఇన్నోవేషన్‌ అంబాసిడర్స్‌ లేదా సృజనాత్మకత రాయబారులు అంటారు. విద్యా మంత్రిత్వ శాఖలోని ఇన్నోవేషన్‌ సెల్‌, సీబీఎస్‌ఈ, ఏఐసీటీఈ, గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ సంయుక్తంగా దీనిని ప్రారంభించాయి. గిరిజన ప్రాంత విద్యార్థులకు సృజనాత్మకత, ఆలోచన పెరిగేలా బోధన ఇందులో ఉంటుంది.
 3. భారత శిక్షాస్మృతిలోని 124-ఎ సెక్షన్‌ దేనికి సంబంధించింది? (సి)
  ఎ) కారుణ్య మరణాలకు సంబంధించిన చట్టం
  బి) సుప్రీంకోర్ట్‌ జారీచేసే వివిధ రిట్లకు సంబంధించిన సెక్షన్‌
  సి) రాజద్రోహాన్ని ప్రస్తావించిన సెక్షన్‌
  డి) న్యాయ వ్యవస్థ క్రియాశీలతను ప్రస్తావించిన సెక్షన్‌
  వివరణ: భారత శిక్షాస్మృతిలోని 124-ఎ సెక్షన్‌ రాజద్రోహాన్ని ప్రస్తావిస్తుంది. మాటల ద్వారా లేదా రాతల ద్వారా లేక సంకేతాల ద్వారా లేదా ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా ఎవరైనా చట్టబద్ధంగా ఎన్నికయిన ప్రభుత్వంపై అసంతృప్తిని పోగుచేసినా, రెచ్చగొట్టినా, ధిక్కరించినా, శతృత్వ భావన కలిగించినా లేక అందుకు ప్రయత్నించినా అది రాజద్రోహంగా చెబుతుంది. అయితే స్వాతంత్య్ర ఉద్యమాన్ని అణచివేయడానికి బ్రిటిష్‌ పాలకులు తెచ్చిన రాజద్రోహ చట్టం అవసరం ఇంకా ఏముందని ఇటీవల సుప్రీంకోర్ట్‌ ప్రశ్నించింది.
 4. జస్టిస్‌ రోహిణి నేతృత్వంలోని కమిషన్‌ గడువును ఇటీవల పొడిగించారు. ఇది దేనికి సంబంధించింది? (బి)
  ఎ) భావ ప్రకటన స్వేచ్ఛా పరిశీలన
  బి) ఓబీసీల వర్గీకరణ
  సి) అగ్రవర్ణాల పేదలకు రిజర్వేషన్‌ కల్పించడం
  డి) మత మార్పిడులకు సంబంధించింది
  వివరణ: వెనుకబడిన తరగతుల వర్గీకరణకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 340 ప్రకారం ఏర్పాటు చేసిన కమిటీ కాలపరిమితిని కేంద్ర క్యాబినెట్‌ పొడిగించింది. ఈ కమిటీకి జస్టిస్‌ రోహిణి నేతృత్వం వహిస్తున్నారు. ఓబీసీల వర్గీకరణను 2015లో నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ బ్యాక్‌వర్డ్‌ క్లాసెస్‌ ప్రతిపాదించింది. తర్వాత 2017 అక్టోబర్‌లో రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆర్టికల్‌ 340 ప్రకారం ఈ కమిషన్‌ను ఏర్పాటు చేశారు.
 5. కిసాన్‌ సారథి ఇటీవల వార్తల్లో నిలిచింది. దీనివల్ల రైతులకు ఉపయోగం ఏంటి? (ఎ)
  ఎ) రైతులకు సాంకేతిక సాయం
  బి) కొత్త వ్యవసాయ చట్టాల నుంచి రైతులకు విముక్తి
  సి) రైతులకు కల్పించే బీమా సౌకర్యం
  డి) విజ్ఞానం కోసం వివిధ దేశాలకు రైతుల పర్యటన
  వివరణ: రైతులకు సరైన సమయంలో సరైన సమాచారాన్ని ఇచ్చేందుకు కిసాన్‌ సారథి అనే డిజిటల్‌ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించారు. దీనిని వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖతో పాటు ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు కలిసి సంయుక్తంగా అందుబాటులోకి తెచ్చాయి. సుదూర ప్రాంతాల్లో ఉన్న రైతులు కూడా సాంకేతిక సాయాన్ని అందుకోవచ్చు. కృషి విజ్ఞాన్‌ కేంద్రాల్లో ఉన్న శాస్త్రవేత్తలతో రైతులు వ్యక్తిగతంగా సంభాషించి సలహాలు తీసుకోవచ్చు.
 6. దేశంలో తొలి రేషన్‌ ఏటీఎం ఏ రాష్ట్రంలో ప్రారంభించారు? (సి)
  ఎ) పంజాబ్‌ బి) కేరళ
  సి) హర్యానా డి) సిక్కిం
  వివరణ: దేశంలోనే తొలి రేషన్‌ ఏటీఎం హర్యానాలో గురుగ్రామ్‌లోని ఫరూక్‌నగర్‌లో ఏర్పాటు చేశారు. ఈ ఏటీఎం నుంచి 5-7 నిమిషాల్లో 70 కేజీల బియ్యం, గోధుమలు, చిరుధాన్యాలు విడుదలవుతాయి. బయోమెట్రిక్‌ వ్యవస్థ ఆధారంగా పనిచేస్తుంది. టచ్‌స్క్రీన్‌ ద్వారా లబ్ధిదారుడు ఆధార్‌ లేదా రేషన్‌ ఖాతా నంబరును పొందుపరచాలి. బయోమెట్రిక్‌ ధ్రువీకరణ జరగగానే, వారికి ఎంత ధాన్యం లభిస్తుందో లెక్కించి సంచుల్లో నింపేస్తుంది. వీటి ఏర్పాటుతో రేషన్‌ దుకాణాల్లో తూనికలు, కొలతల అక్రమాలకు తెరపడుతుంది.
 7. గంటకు ఆరు వందల కిలోమీటర్ల వేగంతో వెళ్లే రైళ్లను ఇటీవల ఏ దేశంలో విజయవంతంగా ప్రయోగించారు? (డి)
  ఎ) జపాన్‌ బి) సింగపూర్‌
  సి) దక్షిణ కొరియా డి) చైనా
  వివరణ: గంటకు 600 కిలోమీటర్ల వేగంతో వెళ్లే అత్యాధునిక మాగ్లెవ్‌ రైలును చైనా జూలై 20న ఆవిష్కరించింది. ప్రపంచంలో అత్యంత వేగంగా ప్రయాణించే రైలు ఇదే. అక్టోబర్‌ 2016లో మాగ్వే అనే రైలు ప్రాజెక్టును ప్రారంభించారు. అందులో భాగమే ఇది. అయస్కాంత-వాయుస్తంభన ప్రొటోటైప్‌ రైలుగా దీనిని చెప్తారు. గతేడాది జూన్‌లో ప్రయోగ పరీక్షలు విజయవంతమయ్యాయి. ఇందులో పది బోగీలు ఉంటాయి. ఒక్కో దానిలో 100 మంది ప్రయాణించవచ్చు.
 8. యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా నుంచి లివర్‌పూల్‌ అనే నగరాన్ని తొలగించడానికి కారణం? (బి)
  ఎ) యునెస్కో నుంచి బ్రిటిష్‌ నిష్క్రమించడం
  బి) లివర్‌పూల్‌ చుట్టూ అతిగా జరుగుతున్న
  అభివృద్ధి
  సి) ఈ నగరానికి గత చరిత్ర ఆనవాళ్లు లేకపోవడం
  డి) ఏదీకాదు
  వివరణ: ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితా నుంచి లివర్‌పూల్‌ను తొలగించారు. ఈ మేరకు యునెస్కో నిర్ణయం తీసుకుంది. ఐక్యరాజ్య సమితికి అనుబంధంగా ఉండే యునెస్కో ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ కేంద్రంగా పనిచేస్తుంది. లివర్‌పూల్‌ను ఈ జాబితా నుంచి తొలగించడానికి కారణం ఆ నగరం చుట్టూ అతిగా జరుగుతున్న అభివృద్ధి. ఆకాశ హర్మ్యాలతో సహా కొత్తగా భారీ ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్మాణానికి ప్రణాళికలు కూడా రూపొందిస్తున్నారు. వీటివల్ల చారిత్రాత్మక ఓడరేవు నగరానికి సరిదిద్దలేని నష్టం కలుగనుందని యునెస్కో భావించింది. గతంలో ఒమన్‌, జర్మనీలకు చెందిన రెండింటిని ఇలాగే తొలగించారు.
 9. భూ వినియోగానికి సంబంధించి పూర్తి డిజిటల్‌ డేటాను రూపొందించిన తొలి ఖండం? (సి)
  ఎ) ఉత్తర అమెరికా బి) యూరప్‌
  సి) ఆఫ్రికా డి) ఆస్ట్రేలియా
  వివరణ: భూమి వినియోగం, వినియోగమార్పునకు సంబంధించి పూర్తి డేటాను ఆఫ్రికాలో సేకరించారు. ఈ ఘనత సాధించిన తొలి ఖండం ఇదే. డేటా ఫర్‌ ది ఎన్విరాన్‌మెంట్‌, అగ్రికల్చర్‌ ల్యాండ్‌ ఇనిషియేటివ్‌ అనే కార్యక్రమం అమలులో భాగంగా ఈ సేకరణ పూర్తయింది. ఆఫ్రికన్‌ యూనియన్‌ దీనిని ప్రారంభించగా రోమ్‌ కేంద్రంగా పనిచేసే ఆహార వ్యవసాయ సంస్థ సహకరించింది.
 10. కింది వాటిలో సరైనది? (ఎ)
  1. పెగాసస్‌ అనేది ఒక స్పైవేర్‌
  2. పెగాసస్‌ అనేది ఫోన్‌లోకి చేరే ఒక హార్డ్‌వేర్‌
  3. ఇది ఇజ్రాయెల్‌లోని ఒక సంస్థకు చెందింది
  4. ఇది రష్యాలోని ఒక సంస్థకు చెందింది
   ఎ) 1, 3 బి) 1, 4 సి) 2, 3 డి) 2, 4
   వివరణ: పెగాసస్‌ అనేది స్పైవేర్‌ దీని సాయంతో కొందరు కేంద్ర మంత్రులు, ప్రతిపక్ష నేతలు, జర్నలిస్ట్‌ల ఫోన్లు హ్యాకింగ్‌కు గురయినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇది ఒక స్పైవేర్‌. దీనిని ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో అనే సంస్థ అభివృద్ధి చేసింది. నిఘా కార్యకలాపాల కోసం ఈ స్పైవేర్‌ను పలు ప్రభుత్వాలు, ప్రభుత్వ ఆధీనంలో పనిచేసే సంస్థలకు విక్రయిస్తూ ఉంటుంది. క్రిమినల్స్‌, ఉగ్రవాదులను పట్టుకోడానికి ప్రభుత్వాలు ఈ స్పైవేర్‌ను వినియోగిస్తాయి. 2016లో తొలిసారి ఇది వెలుగులోకి వచ్చింది.
 11. రాష్ర్టాల పరిధిలోని అంశాలపై సవరణలు చేసే అధికారానికి సంబంధించి ఇటీవల సుప్రీంకోర్ట్‌ ఇచ్చిన తీర్పు? (బి)
  ఎ) పార్లమెంట్‌కు సర్వాధికారాలు ఉంటాయి. రాష్ర్టాల పరిధిలోని అంశాలను ఎలాగైనా సవరించొచ్చు
  బి) రాష్ర్టాల పరిధిలోని అంశాల్లో కేంద్రం ఏకపక్షంగా చట్టాలు చేయరాదు
  సి) రాష్ట్రపతి అంగీకరిస్తే రాష్ర్టాల పరిధిలోని అంశాలపై చట్టాలు చేసుకోవచ్చు
  డి) ఏదీకాదు
  వివరణ: రాజ్యాంగ సవరణలు, సహకార సంఘాల నిర్వహణ అంశానికి సంబంధించి సుప్రీంకోర్ట్‌ ఇటీవల కీలకమైన తీర్పును వెలువరించింది. రాష్ట్ర పరిధిలో ఉన్న అంశాలపై ఏకపక్షంగా చేసే చట్టాలు చెల్లుబాటు కాబోవని తెలిపింది. 2004 నుంచి 2014 వరకు అధికారంలో ఉన్న యూపీఏ ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన 97వ రాజ్యాంగ సవరణ తీరును సర్వోన్నత న్యాయస్థానం తప్పుపట్టింది. రాష్ర్టాల పరిధిలో ఉన్న సహకార సంఘాల నిర్వహణ నిబంధనల్లో ఏకపక్షంగా సవరణలు చేయడాన్ని రద్దు చేస్తూ గుజరాత్‌ హైకోర్ట్‌ 2013లో ఇచ్చిన తీర్పును తాజాగా సుప్రీంకోర్ట్‌ సమర్థించింది.
 12. నోయిడాకు సంబంధించి కింది వాటిలో సరైనవి? (సి)
  1. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ను నోయిడాలో ఏర్పాటు చేస్తున్నారు
  2. దేశంలో తొలిసారిగా డ్రైవర్లు లేకుండా ఉండే పోడ్‌ ట్యాక్సీలను నోయిడాలో ప్రవేశపెడతారు
   ఎ) 1 బి) 2 సి) 1, 2 డి) ఏదీకాదు
   వివరణ: ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హెరిటేజ్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. భారత సంస్కృతిపై ఉన్నత విద్యను దీనిద్వారా ప్రోత్సహిస్తారు. ఈ తరహా విద్యావ్యవస్థ దేశంలోనే మొదటిది. అలాగే దేశంలో తొలిసారిగా డ్రైవర్లు లేకుండా ఉండే పోడ్‌ ట్యాక్సీలను నోయిడాలో ప్రవేశపెట్టనున్నారు. స్థానికంగా ఉన్న ఇంటర్నేషనల్‌ గ్రీన్‌ఫీల్డ్‌ ఎయిర్‌పోర్ట్‌ నుంచి నోయిడా ఫిలింసిటీల మధ్య ఇవి ప్రయాణిస్తాయి. నలుగురు నుంచి ఆరుగురు ఇందులో ప్రయాణించేందుకు వీలుంటుంది.
 13. బాలికల కోసం బాలికలే నిర్వహించే తొలి పంచాయతీని ఏ రాష్ట్రంలో ఎన్నుకున్నారు? (డి)
  ఎ) కేరళ బి) పశ్చిమబెంగాల్‌
  సి) మణిపూర్‌ డి) గుజరాత్‌
  వివరణ: దేశంలో తొలి బాలిక పంచాయతీ ఎన్నికలను గుజరాత్‌లోని కునారియా గ్రామంలో నిర్వహించారు. 10 నుంచి 21 సంవత్సరాల బాలికలు ఇందులో పోటీ చేశారు. 400 మంది తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. చిన్నారుల్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఈ తరహా వ్యవస్థను దేశంలోనే తొలిసారిగా అందుబాటులోకి తెచ్చారు. ఈ పంచాయతీని బాలికల కోసం, బాలికలే నిర్వహిస్తారు. భారతి గర్వ అనే బాలిక తొలిసారి సర్పంచ్‌గా ఎన్నికయ్యింది.
 14. ‘ఫిట్‌ ఫర్‌ 55’ ఇటీవల వార్తల్లో నిలిచింది. ఇది ఏంటి? (బి)
  ఎ) 55 సంవత్సరాలు దాటినవాళ్లు కూడా దృఢత్వంతో ఉండేలా ప్రణాళిక
  బి) కార్బన్‌ ఉద్గారాలను తగ్గించే విధానం
  సి) 55 ఏళ్లు దాటిన వారికి ఉపయోగపడే కొత్త యాప్‌
  డి) 55 పైబడిన వాళ్లకు కొత్త యోగా తరగతులు
  వివరణ: కార్బన్‌ ఉద్గారాలను తగ్గించే ఉద్దేశంతో యూరోపియన్‌ యూనియన్‌ ‘ఫిట్‌ ఫర్‌ 55’ను ప్రారంభించింది. ఈ కూటమిలో మొత్తం 27 దేశాలు సభ్యత్వాన్ని కలిగి ఉన్నాయి. 2030 నాటికి 55% ఉద్గారాలను తగ్గించడమే ఫిట్‌ ఫర్‌ 55 ముఖ్య లక్ష్యం. ఇందులో భాగంగా 2035 నాటికి పెట్రోల్‌, డీజిల్‌ వాహనాల అమ్మకాలను నిలిపివేయాలని ప్రతిపాదించారు. శిలాజ ఇంధనాల స్థానంలో సుస్థిర, ప్రత్యామ్నాయ ఇంధనాల వైపునకు వెళ్లే దేశాలకు భారీగా ఆర్థిక ప్రోత్సాహకాలను ఇస్తారు.
 15. తెలంగాణలోని ఏ జిల్లాలో ఇటీవల కొత్త దుంప జాతి మొక్కను గుర్తించారు? (సి)
  ఎ) అదిలాబాద్‌ బి) నిర్మల్‌
  సి) వికారాబాద్‌ డి) నల్లగొండ
  వివరణ: వికారాబాద్‌ జిల్లాలోని అనంతగిరి కొండల్లో కొత్త దుంపజాతి మొక్కను గుర్తించారు. అపొసైనేసి కుటుంబానికి ఇది చెందింది. దీనికి ‘బ్రాచి స్టెల్మా అనంతగిరియన్స్‌’గా పేరుపెట్టారు. భారత్‌లో మొత్తం 38 రకాల మొక్కలు ఉండగా, అనంతగిరి కొండల్లో గుర్తించిన దుంపను 39వ రకంగా పేర్కొన్నారు.

వి. రాజేంద్ర శర్మ,ఫ్యాకల్టీ
9849212411

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana