విజయవాడ: ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ (YCP) నేతల అరెస్టుల పరంపర కొనసాగుతున్నది. గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించిన వారిలో ఒక్కొక్కరిని వివిధ కేసుల్లో కూటమి ప్రభుత్వం కటకటాల్లోకి (TDP Govt) పంపిస్తున్నది. తాజాగా వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్‌ను (Jogi Ramesh) ఎక్సైజ్ పోలీసులు అరెస్టు చేశారు. నకిలీ మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జోగి రమేశ్‌తోపాటు ఆయన సోదరుడు జోగి రాము, అనుచరుడు ఆరెపల్లి రామును అదుపులోకి తీసుకుని విజయవాడలోని సిట్ ఆఫీస్‌కు తరలించారు. నకిలీ మద్యం కేసులో ఏ1 నిందితుడు జనార్థన్‌రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా అరెస్టు చేసినట్లు తెలుస్తున్నది. దీంతో ఈ కేసులో అరెస్టుల సంఖ్య 20కి చేరింది. జోగి రమేశ్‌ను ఏ18గా చేర్చే అవకాశం ఉన్నది.
ఆదివారం ఉదయం 5 గంటలకు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేశ్ ఇంటికి ఎక్సైజ్ పోలీసులు చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో ఆయన ఇంటివద్ద పోలీసులు మోహరించడంతో, వైసీపీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడ హైడ్రామా నెలకొన్నది. రమేశ్‌తో చర్చించిన తర్వాత ఆయన నోటీసీలు ఇచ్చి అదుపులోకి తీసుకున్నారు.

కాగా, చంద్రబాబుది దుర్మార్గమైన పాలన అని, రాక్షసానందం పొందడానికే తనను అక్రమంగా అరెస్టు చేశారని జోగి రమేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. భార్య బిడ్డల సాక్షిగా చెబుతున్నా.. తాను ఎలాంటి తప్పూ చేయలేదన్నారు. అయినా నను అక్రమంగా అరెస్టు చేశారని విమర్శించారు. కాశీబుగ్గ తొక్కిసలాట ఘటనను డైవర్ట్ చేసే కుట్రలో భాగంగానే తన అరెస్టు అన్నారు.