ఇడ్లీ దినోత్సవం ఏడాదికోసారి మార్చి 30న వస్తుంది కానీ, సగటు దక్షిణాది కుటుంబాలకు మాత్రం ప్రతిరోజూ ఇడ్లీ దినోత్సవమే. విష్ణుచక్రంలా గుండ్రంగా, చందమామలా తెల్లగా, వెన్నముద్దలా మెత్తమెత్తగా ఉండే ఇడ్లీ.. ఫలహారాల్లో రారాజు. ఇడ్లీగారికి అల్లం చట్నీ ప్రధాన మంత్రి. కొబ్బరి చట్నీ సర్వ సైన్యాధ్యక్షుడు. వేడివేడి సాంబారు పట్టపురాణి. వడ ప్రియ నేస్తం. మొక్కల్లో వామన వృక్షాలు ఉన్నట్టు, మినియేచర్ రకం.. బటన్ ఇడ్లీ! కర్ణాటకలో ‘తట్టె ఇడీ’్ల పేరుతో పళ్లెమంత సైజులో కూడా చేస్తారు. మిగిలిపోయిన ఇడ్లీలకు మేకోవర్ చేసి ‘ఇడ్లీ మంచూరియా’ పేరుతో మాయ చేస్తారు గృహిణులు. ప్రపంచంలోని అత్యంత ఆరోగ్యవంతమైన పది వంటకాల్లో ఇడ్లీకూడా ఒకటని నిపుణులు తేల్చారు.
ఇడ్లీలద్వారా శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి. మినుపపప్పు, బియ్యం మిశ్రమంతో చేసే ఇడ్లీలో కొలెస్ట్రాల్ ఉండదు. దీంట్లో క్యాలరీలు కూడా తక్కువే. అందుకే చాలా మంది అల్పాహారంగా ఇడ్లీకే ఓటేస్తారు. ఒక ఇడ్లీలో దాదాపు 40 నుండి 60
క్యాలరీలు ఉంటాయి.
మినుప పప్పులోని ప్రొటీన్లు, బియ్యం రవ్వలోని పిండి
పదార్థాలు శరీరానికి శక్తినిస్తాయి. ఇడ్లీ తయారీలో రవ్వకు బదులుగా బ్రౌన్ రైస్ వాడితే పీచు పదార్థాలు, యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్లు లభిస్తాయి. ఇడ్లీలో పిండి పదార్థాలు ఉండటం వల్ల తేలికగా జీర్ణం అవుతాయి. ఇడ్లీతోపాటు పప్పు, గుడ్లు, బాదం, మొలకెత్తిన గింజలు తీసుకుంటే త్వరగా ఆకలేయదు.
ఇటీవల అనేక ధాన్యాలతో ఇడ్లీలు చేస్తున్నారు. బియ్యానికి ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాల్ని ఉపయోగిస్తున్నారు. మినుములు, కొర్రలు, రాగి వంటి వాటితో కూడా ఇడ్లీలను తయారు చేస్తున్నారు. వీటిలో ప్రొటీన్లు, పీచు పదార్థాలు, విటమిన్లు అపారం. అందరికీ ఇడ్లీ దినోత్సవ శుభాకాంక్షలు!