ధర్మారం, మే 24: ప్రభుత్వం ధాన్యం కొనకుండా ఇబ్బందులకు గురిచేస్తూ రైతుల ప్రాణాలు తీస్తున్నదని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మండిపడ్డారు. ఆదివారం పెద్దపల్లి జిల్లా ధర్మారంలో కరీంనగర్ – రాయపట్నం రహదారిపై బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రాస్తారోకో చేపట్టారు. పార్టీ కార్యకర్తలు, రైతులు రోడ్డుమీద ధాన్యం పోసి నిరసన తెలిపారు. కొప్పుల మాట్లాడుతూ.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 15 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, ఇప్పటివరకు సగం కూడా కొనలేదని దుయ్యబట్టారు.
క్వింటాల్‌కు 7-8 కిలోల తరుగు తీస్తూ మోసం చేస్తున్నారని, ఫలితంగా ఒకో లారీ లోడ్‌కు రైతులు రూ.9 వేల దాకా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లక్ష్మణ్‌కుమార్ ప్రతి చిన్న విషయానికీ రైతులను పకదారి పట్టించి ఆందోళన చేశారని, ధాన్యం కటింగ్ చేసిన సొమ్ము ఏమవుతుందని పదే పదే ప్రశ్నించేవారని, మరి ఇప్పుడు కటింగ్ అవుతున్న సొమ్ము లక్ష్మణ్ కుమార్ జేబులోకి వెళ్తుందా? రైతులకు జవాబు చెప్పాలని డిమాండ్ చేశారు.