e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, April 14, 2021
Advertisement
Home News దేవభూమి ఎవరిదో?

దేవభూమి ఎవరిదో?

  • ఉన్న ఒక్క రాష్ర్టాన్ని నిలుపుకొనే యత్నాల్లో కామ్రేడ్లు
  • అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు గద్దెనెక్కిస్తాయని గంపెడాశ
  • నాయకత్వ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న కాంగ్రెస్‌ కూటమి
  • అధికార పక్షం వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో ఫెయిల్‌
  • ఉనికి కోసం బీజేపీ యత్నాలు.. రసవత్తరంగా కేరళ రాజకీయాలు

మరో మూడు వారాల్లో జరుగనున్న ఐదు రాష్ర్టాల అసెంబ్లీ ఎన్నికల్లో దేవభూమిగా పిలిచే కేరళకు ప్రత్యేక స్థానం ఉన్నది. గత నాలుగు దశాబ్దాల్లో ఆ రాష్ట్రంలోని రెండు ప్రధాన కూటముల్లో ఏ ఒక్కటీ వరుసగా రెండోసారి అధికారాన్ని చేపట్టింది లేదు. ఒకసారి వామపక్షాల నేతృత్వంలోని ఎల్డీఎఫ్‌ కూటమి విజయం సాధిస్తే, మరోసారి కాంగ్రెస్‌ నేతృత్వంలోని యూడీఎఫ్‌ కూటమి గెలుస్తూ వస్తున్నది. 2016లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌ కూటమి విజయ ఢంకా మోగించింది. ఆ లెక్కన ఈసారి యూడీఎఫ్‌ గెలువాలి. ఒకవేళ ఆ సాంప్రదాయాన్ని మారుస్తూ మళ్లీ ఎల్డీఎఫ్‌ కూటమినే విజయ శిఖరాలను అధిరోహిస్తే  ఆ గెలుపు చరిత్రగా నిలిచిపోతుంది.

కామ్రేడ్లకు జీవన్మరణ సమస్య

ఈ ఎన్నికలు కామ్రేడ్లకు జీవన్మరణ సమస్యగా చెప్పవచ్చు. కేరళలో మినహా దేశంలో మరే ఇతర రాష్ట్రంలో సీపీఎం అధికారంలో లేదు. పార్లమెంటు లో కూడా ప్రాతినిధ్యం తగ్గిపోయింది. కేరళను నిలబెట్టుకోగలిగితే వామపక్షాలకు అస్తిత్వం ఉన్నట్లు లెక్క. అందుకే ఈసారి ఎన్నికల్లో మళ్లీ గద్దెనెక్కాలని సీఎం పినరాయి విజయన్‌ తీవ్రంగా కృషి చేస్తున్నారు. నిఫా, కరోనా వైరస్‌, వరదలు వంటి విపత్తులను సమర్థమంతంగా ఎదుర్కోవడం, సంక్షేమ కార్యక్రమాల అమలు, పాలనలో వికేంద్రీకరణ వ్యవస్థ, స్థానిక సంస్థల పనితీరు, కరెంట్‌ కోతలు లేకుండా చేయడం వంటి అంశాలు ఎల్డీఎఫ్‌ను ప్రజలకు మరింత చేరువ చేశాయి. అవినీతి ఆరోపణలు, బంగారం స్మగ్లింగ్‌ వంటి కేసులు ఎల్డీఎఫ్‌ గెలుపును అంతగా ప్రభావం చేయకపోవచ్చని పలు సర్వేలు చెబుతున్నాయి. 

బీజేపీ పరిస్థితేంటి?

శబరిమల వివాదం, హిందూ ఓట్ల సంఘటితంతో కేరళలో తమ ఉనికిని చాటుకుందామని బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నది. 2011 అసెంబ్లీ ఎన్నికల్లో 6 శాతం ఓటు షేరు సాధించిన బీజేపీ.. 2016 నాటికి 15 శాతానికి పుంజుకున్నది. 2019 లోక్‌సభ ఎన్నికల్లో రాష్ట్రంలో ఒక్కసీటు కూడా గెలువనప్పటికీ 16 శాతం ఓటు షేరును సాధించడం విశేషం. ఈ క్రమంలోనే ‘మెట్రోమ్యాన్‌’గా గుర్తింపు పొందిన శ్రీధరన్‌ను పార్టీలో చేర్చుకున్నది. ఆయన రాక ఎన్నికల్లో లబ్ధి చేకూరుస్తుందని ఆశిస్తున్నది.

ఓటర్ల మనసు ఎటువైపు?

2016 అసెంబ్లీ ఎన్నికల్లో మొత్తం 140 స్థానాల్లో ఎల్డీఎఫ్‌ 91 సీట్లను గెలుచుకొని అధికారంలోకి వచ్చింది. యూడీఎఫ్‌కు 47 స్థానాలు లభించగా, ఎన్డీయేకు ఒక సీటు దక్కింది. మరో స్థానంలో స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. అయితే, 2019 లోక్‌సభ ఎన్నికల్లో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. మొత్తం 20 లోక్‌సభ స్థానాలలో యూడీఎఫ్‌ కూటమికి అనూహ్యంగా 19 స్థానాలు లభించగా, అధికార ఎల్డీఎఫ్‌ కేవలం ఒక స్థానంతోనే సరిపెట్టుకోవలసి వచ్చింది. ఈ ఎన్నికలతో ఇక వామపక్ష కూటమి పని అయిపోయిందనీ, రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్‌ గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు సహా అందరూ భావించారు. అయితే గతేడాది నిర్వహించిన స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎల్డీఎఫ్‌ సంచలన విజయాన్ని సాధించి అందర్నీ ఆశ్చర్యపరిచింది.

కాంగ్రెస్‌లో నాయకత్వ సంక్షోభం

జాతీయ స్థాయిలో క్రమంగా కోల్పోతున్న కాంగ్రెస్‌ ప్రాభవాన్ని కేరళ వేదికగా తిరిగి పునరుద్ధరించాలని ఆ పార్టీ అగ్రనేత రాహుల్‌గాంధీ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రంలో సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. అయితే నాయకత్వ సంక్షోభం యూడీఎఫ్‌ కూటమిని పట్టిపీడిస్తున్నది. మాజీ సీఎం ఊమెన్‌ చాందీకి ప్రజల్లో ఆదరాభిమానాలు ఉన్నప్పటికీ, ఆరోగ్య సమస్యలు ఆయన్ని తీవ్రంగా వేధిస్తున్నాయి. అధికార పక్షం అపజయాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లడంలో మరో నేత రమేశ్‌ చెన్నితల వెనుకబడే ఉన్నారు. కేరళలో 60 స్థానాలను ప్రభావితం చేయగల ముస్లిం, క్రైస్తవ ఓటర్లను ఆకర్షించడానికి యూడీఎఫ్‌ ప్రయత్నిస్తున్నది. అభ్యర్థుల జాబితాలో యువ నేతలకు ప్రాధాన్యతనిస్తున్నది.

Advertisement
దేవభూమి ఎవరిదో?

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement