హైదరాబాద్ : నగరి ఎమ్మెల్యే రోజా చేసిన పూజలు ఫలించాయి. సోమవారం కొత్తగా కొలువుదీరిన ఏపీ కేబినెట్లో రోజాకు స్థానం లభించింది. మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజా.. ఆనందంలో మునిగిపోయారు. ఈ సందర్భంగా రోజాకు వైసీపీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఆమె అభిమానులు శుభాకాంక్షలు తెలిపారు. అయితే రోజాకు ఏ శాఖ కేటాయిస్తారనే అంశంపై ఆసక్తికర చర్చ కొనసాగుతోంది. ఈ సాయంత్రం వరకు మంత్రులకు శాఖల కేటాయింపు జరగనుంది. ఈ అంశంపై కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం.
ముఖ్య విషయం ఏంటంటే.. రోజాకు హోం, విపత్తుల నిర్వహణ శాఖ కేటాయించినట్లు ఆమె వికిపీడియాలో నమోదైంది. ఆ పేజీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. అయితే వికీపీడియాలో ఎవరైనా మార్పులు చేసే అవకాశం ఉండటంతో కొంతమంది కావాలనే ఇలా చేసి ఉంటారని పలువురు అభిప్రాయపడుతున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత హోంశాఖ బాధ్యతలను మేకతోటి సుచరిత నిర్వర్తించారు. ఇప్పుడు కూడా హోంశాఖను మహిళలకే కేటాయిస్తారనే నమ్మకం ఏపీ ప్రజల్లో నెలకొంది. ఈ పరిణామాల నేపథ్యంలో రోజాకే హోంశాఖ కేటాయించొచ్చనే వార్తలు షికారు చేస్తున్నాయి. ఆ వార్తలకు సీఎం జగన్ మరికాసేపట్లో తెరదించే అవకాశం ఉంది.
ఇవాళ 25 మంది ఎమ్మెల్యేలు మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో మహిళలు నలుగురు ఉన్నారు. తానేటి వనిత (ఎస్సీ) కొవ్వూరు, కేవీ ఉషశ్రీచరణ్ (బీసీ) కళ్యాణదుర్గం, విడదల రజిని (బీసీ) చిలకలూరిపేట, ఆర్కే రోజా (ఓసీ) నగరి మంత్రులుగా ప్రమాణం చేశారు. ఈ నలుగురిలో హోంశాఖ ఎవరికి వరిస్తుందో వేచి చూడాల్సిందే. ఎవరెవరికి ఏ శాఖలు కేటాయిస్తారనేది ఆసక్తికరంగా మారింది.