జాతకాన్ని పాటించాలా? వాస్తును పాటించాలా? మనిషికి ఏది ముఖ్యం?
– బి. స్వామి
జ్యోతిషం అయినా, వాస్తు అయినా మనిషిని ఉన్నతికి తీసుకువెళ్లేవే! అంతేకానీ, చెప్పేవారికి డబ్బు సంపాదించిపెట్టడం వీటి లక్ష్యం కాదు. వ్యక్తి జాతకంలో ఉన్న దోషాలకు తప్పక నివారణ ఉంటుంది. అలాగే గృహ దోషాలకూ మార్గాలు – సూచనలు ఉంటాయి. కొన్నికొన్నిసార్లు వ్యక్తికి శుభ పరిణామాలు కలుగుతాయి. ఆ సమయంలో తెలియకుండా మంచి గృహంలోకి తనకు తానే మారిపోతాడు. మనిషి కర్మ జీవి. గత కర్మల ఫలాలు మనసును నడిపిస్తూ ఉంటాయి. తద్వారా ఫలితాలు వస్తాయి. కర్మలు.. స్వభావం ద్వారా నడుస్తాయి. స్వభావాలు పుట్టుకతో వస్తాయి. వీటికోసమే ఈ శాస్ర్తాలు ఉన్నాయి. వాస్తు తప్పక పాటించాలి. దీనివల్ల కాలంలో కొన్ని అవకతవకలు ఉన్నా.. మనిషి కూలిపోకుండా ఉంటాడు. అలానే జ్యోతిష సంబంధమైన పూజలు, శాంతులు కూడా చేయాలి. వైద్యంలో ఔషధం కావాలి. పథ్యమూ చేయాలి.. ఇదీ అంతే!
పెద్ద ఇల్లు కావాలని రెండు ఫ్లాట్లను (ఇండ్లను) కలిపేశాం. ఇది దోషమా? ఒకవేళ దోషమైతే.. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
– వి. సుజాత, ఎల్బీ నగర్
ఇల్లు పెద్దగా చేసుకోవడం తప్పేమీ కాదు. కానీ, పెద్ద ఇంటికోసం తప్పుల ఇంటిని కట్టొద్దు. మీరు పంపిన రెండు ఫ్లాట్లను చూశాను. మీ మొదటి ఇల్లు తూర్పు-పడమర పొడవు కలిగిన గృహం. దానికి దక్షిణంలో దక్షిణ-ఉత్తరం కలిగిన ఫ్లాట్‌ను కలిపారు. మొత్తం ఇంటిని చూసినప్పుడు ‘ఎల్’ ఆకారంగా వస్తున్నది. అపార్ట్మెంట్లలో ఏ ఫ్లాట్ ఆ ఫ్లాట్ లెక్కన స్వరూప స్వభావాలు ఉంటాయి. మీరు కలిపేసరికి మీ ఇంటికి ‘పెద్ద దోషం’ ఏర్పడింది. వెంటనే హాలు మధ్యలో రెండిటి ద్వారాన్ని మూసేయండి. వేరువేరుగా వాడండి. దక్షిణం బ్లాకును ‘యజమాని స్థానం’తో వాడుకోండి. ఉత్తరం పోర్షన్‌ను గెస్టులకు, పిల్లలకు వాడండి. అపార్టుమెంటులో కింద, పైన ఫ్లాట్లను కొంటే.. డూప్లెక్స్ ఇంటిగా శాస్త్రప్రకారం చక్కగా మార్చుకోవచ్చు.
మాది పడమర ఇల్లు. వాయవ్యంలోని కారు పార్కింగ్‌వైపు బెడ్ రూముకు డోర్ పెట్టొచ్చా? ఆఫీసు పెట్టుకోవడానికి పనికొస్తుందా!
– కె. అశోక్, ఉప్పల్
ఇంటికి బయటి ద్వారాలు – లోపలి ద్వారాలు ఉంటాయి. లోపలికి ఉండే వాటిని బయటికి, బయటి ద్వారాలను లోపలికి వెళ్లేలా పెట్టొద్దు. ఇంటి ఉనికి దెబ్బతినకుండా ద్వారాలను అమర్చాలి. మీ ఉద్దేశంలో కింద ఉన్న పోర్షన్ పడక గదిని ఆఫీసుగా వాడుకోవడం కోసం పశ్చిమ – వాయవ్యంలోకి గానీ, ఆ గదికి దక్షిణ – ఆగ్నేయంలోగానీ ద్వారం పెడితే.. అవి నీచ స్థానమైన ద్వారాలుగా మారుతాయి. తీవ్ర నష్టం కలుగుతుంది. మీరు కింది మాస్టర్ గదిని ఆఫీసుగా వాడుకోవచ్చు. అయితే ఇంటి పశ్చిమ – వాయవ్యంలోని కారు పార్కింగ్‌ను వెయిటింగ్ హాలుగా మార్చి, దానిలోంచి దక్షిణ – ఆగ్నేయం గుండా మాస్టర్ గదికి వెళ్లొచ్చు. ఇట్లా చేస్తే కారు పార్కింగ్‌ను తీసి గదిగా మార్చాలి. లేదా బెడ్ రూము నుంచి బయటికి (పార్కింగ్)లోకి ద్వారం పెట్టకుండా లోపలి నుంచి ఆఫీసు వాడండి. అవసరమైన విధంగా హాలు పార్టిషన్ చేసుకోండి. దీనివల్ల అంతా మంచే జరుగుతుంది.
వంకర స్థలాన్ని సరిచేస్తే మిగిలిన భాగాలను ఏం చేయాలి? మాకు ఆగ్నేయం పెరిగింది. దయచేసి మంచి సలహా ఇవ్వండి.
– ఏ. శ్రీదేవి, నల్లగొండ
ఇల్లు కట్టాల్సిన స్థలం ఎటువైపు అయినా పెరిగి ఉండే అవకాశం ఉంది. ‘సవ్యం’ అయితే కలుపుకొంటాం. అపసవ్యం అయితే వదులుకుంటాం. మిగిలిన స్థలం మనకు అవసరంలేనిదై.. పక్కవాళ్లకు ఉచ్ఛమైనదిగా ఉంటే, వారికి ఇవ్వడం మంచిది. కొందరు ఇవ్వడానికి ఇష్ట
పడరు. మీకు పెరిగిన ఆగ్నేయం మీ పక్కవారికి ఈశాన్యం అవుతుంది. అది వాళ్లకు మంచిది. లేదా ఇద్దరు కలిసి సగం – సగం తీసుకోవచ్చు. అంటే, మీ ఆగ్నేయంలో సగం వారికి, వారి వాయవ్యంలో సగం మీకు.. ఇలా చేస్తే ఇద్దరికీ ఎంతో కొంత స్థలం వస్తుంది. ఇద్దరి దోషమూ పోతుంది. లేకపోతే ఆ స్థలంలో చెట్లను పెంచుకోండి. అయితే, అందులోకి మీరు వెళ్లొద్దు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
Vasthu Shastra | ‘నాస్తిక వాదం’తో చూస్తే వాస్తు తప్పు అంటున్నారు. నిజమేనా?
వాస్తు ప్రకారం అక్వేరియం ఇంట్లో ఉండొచ్చా? ఎలాంటి ఫలితాలు కనిపిస్తాయి?
Vasthu Shastra | మాకు ఉత్తరం రోడ్డు ఉంది. ఖాళీ జాగాలో మొత్తం షాపులు కట్టుకోవచ్చా?
Vasthu Shastra | ఇంటి నిర్మాణానికి గుండ్రంగా ఉండే స్థలం పనికిరాదా?