Hemoglobin | రక్త పరీక్షల్లో భాగంగా సీబీపీ (కంప్లీట్ బ్లడ్ పిక్చర్) అనే టెస్ట్ చేసినప్పుడు రిపోర్టులో మనకు హిమోగ్లోబిన్ లెవల్స్‌ను కూడా ఇస్తారు. హిమోగ్లోబిన్‌తోపాటు రక్త కణాలు సరైన స్థాయిలో ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఈ టెస్టు ద్వారా తెలుసుకుంటారు. అయితే రక్త కణాల గురించి అందరికీ తెలుసు. కానీ హిమోగ్లోబిన్ అంటే ఏమిటి, ఇది మన శరీరంలో ఎక్కడ ఉంటుంది, ఏం చేస్తుంది అన్న విషయాలు చాలా మందికి తెలియవు. హిమోగ్లోబిన్ అనేది ఒక రకమైన ప్రోటీన్. ఇది మన శరీరంలో ఎర్ర రక్త కణాల్లో ఉంటుంది. హిమోగ్లోబిన్ వల్లే ఎర్ర రక్త కణాలు ఆ రంగులో ఉంటాయి. హిమోగ్లోబిన్ అనేది మన ఊపిరితిత్తుల నుంచి ఆక్సిజన్‌ను శరీరంలోని కణాలకు చేరవేస్తుంది. శరీర కణాలలో ఉత్పత్తి అయ్యే కార్బన్ డయాక్సైడ్ను తిరిగి ఊపిరితిత్తులకు పంపిస్తుంది. దీంతో ఊపిరితిత్తుల ద్వారా కార్బన్ డయాక్సైడ్ ముక్కు నుంచి బయటకు వస్తుంది. ఇలా హిమోగ్లోబిన్ విధులను నిర్వహిస్తుంది. అయితే హిమోగ్లోబిన్ లోపించినా, తక్కువగా ఉన్నా మన శరీరం పలు లక్షణాలను, సంకేతాలను తెలియజేస్తుంది.
మన శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉంటే పలు రకాల జీవక్రియల నిర్వహణకు ఆటంకం ఏర్పడుతుంది. శరీర కణాలకు ఆక్సిజన్‌ను చేర వేసే పనికి ఆటంకం కలుగుతుంది. దీంతో కణాలకు ఆక్సిజన్ సరిగ్గా లభించదు. ఫలితంగా తీవ్రమైన అలసట, నీరసం ఉంటాయి. అలాగే ఛాతిలో నొప్పి వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఎదురవుతుంటాయి. తలనొప్పిగా ఉంటుంది. ఆకలిగా అనిపించదు. ఆహారం తినాలనిపించదు. ఇలా హిమోగ్లోబిన్ తక్కువగా ఉన్న వారిలో పలు లక్షణాలు, సమస్యలు కనిపిస్తాయి. అయితే ఈ లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా వెంటనే డాక్టర్‌ను కలిసి పరీక్షలు చేయించుకుని చికిత్స తీసుకోవాలి. హిమోగ్లోబిన్ తక్కువగా ఉంటే వైద్యులు మందులను ఇస్తారు. వాటిని క్రమం తప్పకుండా వాడాలి. అలాగే రోజు వారి ఆహారంలోనూ పలు మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి సులభంగా బయట పడవచ్చు.
శరీరంలో హిమోగ్లోబిన్ స్థాయిలు తక్కువగా ఉన్నవారు ఐరన్, విటమిన్ బి12 ఉండే ఆహారాలను తింటుంటే ఉపయోగం ఉంటుంది. దీని వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తి అవుతుంది. ఇది అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. ఐరన్ అధికంగా ఉండే పాలకూరను రోజూ తింటుంటే హిమోగ్లోబిన్ స్థాయిలను పెరిగేలా చేయవచ్చు. పాలకూర జ్యూస్‌ను రోజూ ఉదయం పరగడుపునే 30 ఎంఎల్ మోతాదులో తాగుతుంటే ఉపయోగం ఉంటుంది. దీని వల్ల ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. అలాగే రోగ నిరోధక శక్తి సైతం పెరుగుతుంది. దీంతో సీజనల్ వ్యాధులకు చెక్ పెట్టవచ్చు. అలాగే అవిసె గింజలు, గుమ్మడి విత్తనాలు, చియా సీడ్స్‌ను తింటున్నా ఫలితం ఉంటుంది. ఈ విత్తనాల్లో మెగ్నిషియం, ఐరన్, ఒమెగా 3 ఫ్యాటీ యాసిడ్లు అధికంగా ఉంటాయి. ఇవి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి. దీంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే హిమోగ్లోబిన్ స్థాయిలను సైతం పెరిగేలా చేస్తాయి.
శరీరంలో హిమోగ్లోబిన్ లెవల్స్ పెరిగేందుకు గాను బ్రోకలీ కూడా ఎంతో దోహదం చేస్తుంది. ఇందులో విటమిన్ సి అధికంగా ఉంటుంది. ఇది ఐరన్‌ను అధికంగా శోషించుకుంటుంది. దీని వల్ల హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. అలాగే బ్రోకలీలో ఫైబర్, ప్రోటీన్లు, క్యాల్షియం, సెలీనియం, మెగ్నిషియం వంటి పోషకాలు సైతం అధికంగా ఉంటాయి. ఇవన్నీ రక్తహీనతను తగ్గిస్తాయి. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరిగేలా చేస్తాయి. దీని వల్ల ఆరోగ్యంగా ఉంటారు. అలాగే ఎముకలు దృఢంగా మారి ఆరోగ్యంగా ఉంటాయి. డార్క్ చాకొలెట్లలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. అలాగే వీటి ద్వారా మెగ్నిషియం, ఐరన్లు కూడా లభిస్తాయి. వీటి వల్ల శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. హిమోగ్లోబిన్ స్థాయిలు పెరుగుతాయి. కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. బీపీ తగ్గుతుంది. ఇలా ఆయా ఆహారాలను తీసుకుంటే హిమోగ్లోబిన్ స్థాయిలను చాలా సులభంగా పెంచుకోవచ్చు. ఆరోగ్యంగా ఉండవచ్చు.