తెలంగాణలో పలుకుబడిలో ఉన్న పదం ‘లొట్టపీసు’. అంటే.. ఏమిలేదన్నట్టు! కాయ ఉండదు, గింజ ఉండదు, దేనికీ పనికిరాదు.. కాబట్టే, లొట్టపీసు అంటారు. చెరువులు, కుంటలు, నీరు నిల్వ ఉన్న ప్రాంతాల్లో పెరిగే మొక్కే లొట్టపీసు. దీన్ని ప్రాంతాలను బట్టి పాలసముద్రం, పిచ్చిచెట్టు, లొట్టపీసు, బేషరమ్, సముద్రపాల చెట్టు అంటారు. నీరు నిల్వ ఉంటే చాలు, ఎక్కడపడితే అక్కడ మొలిచి విపరీతంగా అల్లుకుపోతుంది. నిత్యజీవితంలో పెద్దగా ఉపయోగపడదు. మాచుపత్రి అనేది కూడా ఇలాగే ఉపయోగం లేకుండా పెరుగుతుంది. అందుకే వీటిని ‘పనికిమాలినవి’ అనే అర్థంలో వాడుతారు. ఎవ్వరికీ ఉపయోగంలేని పనులు చేస్తున్నా, కట్టడాలు నిర్మిస్తున్నా.. ‘ఆ ఏమున్నది ఆడ లొట్టపీసు మాసుపత్రి’ అని రెండిటిని కలిపి ప్రయోగిస్తారు. కానీ ఆయుర్వేదంలో, ప్రకృతి వ్యవసాయంలో లొట్టపీసు చెట్ల ఉపయోగాలు అనేకం. తేలు కుట్టిన చోట లొట్టపీసు చెట్ల పాలు పోస్తే విషానికి విరుగుడు. తామర వ్యాధికి, దోమల బెడద తగ్గించడానికి లొట్టపీసు పాలు, ఆకులు ఉపయోగిస్తారు.