అచ్చంపేట, జనవరి 16: నల్లమల కొండల్లో ఆదిదంపతుల కల్యాణం కనులపండువగా జరిగింది. శ్రీశైలానికి ఉత్తరద్వారంగా ప్రసిద్ధిగాంచిన ఉమామహేశ్వరం క్షేత్రంలో స్వామి కల్యాణం ఆదివారం తెల్లవారుజామున వైభవంగా కొనసాగింది. కొండపై గర్భగుడిలోని స్వామివార్లను పల్లకీ సేవలో పాపనాశనం వద్ద గంగాజలం తెచ్చి ఉత్సవ మూర్తులను కొండ కిందకు భోగమహేశ్వరం కల్యాణ మండపంలో స్వామివార్ల దివ్య కల్యాణోత్సవాన్ని జరిపించారు. అచ్చంపేట, పదర, మన్ననూర్, అమ్రాబాద్, పెనిమిళ్ల, రంగాపూర్, ఉప్పునుంతల నుంచి తెల్లవారుజాము వరకు ప్రభోత్సవాలు ఉమామహేశ్వరం కొండకు చేరుకున్నాయి. ప్రభోత్సవాలు చేరుకున్న తర్వాత కల్యాణ వేడుకలు ప్రారంభించారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ప్రభుత్వం తరఫున పట్టువస్ర్తాలు సమర్పించారు. పార్వతీ,పరమేశ్వరుల కల్యాణాన్ని తిలకించేందుకు భక్తులు తెల్లవారుజామునే తరలివచ్చారు. ఆలయ చైర్మన్ కందూరి సుధాకర్, ఈవో శ్రీనివాసాశర్మ ఆధ్వర్యంలో కల్యాణానికి అన్ని ఏర్పాట్లు చేశారు. కౌన్సిలర్ గోపిశెట్టి శివ ఇంటి నుంచి వీరభద్రసేవ నిర్వహించారు. భక్తిశ్రద్ధలతో నందికోళ్ల సేవ, నృత్యాలు చేసి ఆకట్టుకున్నారు. అచ్చంపేటలో ప్రభ ఊరేగింపు వైభవంగా సాగింది. భ్రమరాంబ ఆలయ అధ్యక్షుడు నల్లపు శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం ఉత్సవమూర్తులను ప్రత్యేక వాహనంలో ఊరేగించారు.
అచ్చంపేట సస్యశ్యామలం కావాలి ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
అచ్చంపేట ప్రాంతానికి సాగునీరు తీసుకొచ్చే విధంగా, కరోనాలాంటి మహమ్మారి మళ్లీ ధరిచేరకుండా, అలాంటి రోగాలు రాకుండా కాపాడాలని భగవంతుడిని కోరినట్లు విప్ గువ్వల బాలరాజు అన్నారు. కల్యాణోత్సవంలో పాల్గొనడం మహాభాగ్యంగా భావిస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంలో ఆలయాల అభివృద్ధి గొప్పగా జరుగుతుందన్నారు. ఉమామహేశ్వరంలో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన సందర్భంగా విప్ గువ్వల ఉమామహేశ్వరంలో స్వామివార్లను దర్శించుకున్నారు. గర్భగుడిలో స్వామివారికి అభిషేకం, అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. ఆదివారం గవ్యాంత, వాస్తుహోమం, రుద్రాభిషేకం, నీలలోహితము, నీరాజనము, మంత్రపుష్పము, తీర్థప్రసాద పూజలు నిర్వహించారు.