పెండ్లి బట్టలు జీవితాంతం దాచుకునే మధుర జ్ఞాపకాలు. అమ్మమ్మ చీర, తాతయ్య పంచె అనుబంధాలకు అమూల్యమైన గుర్తులు. వెలకట్టలేం. చిన్న చిరుగుపడినా తట్టుకోలేం! కానీ,పాతబడేకొద్దీ నిర్వహణ అవసరం. ఎప్పటికప్పుడు మడత పెడుతూ,పురుగూపుట్రా పట్టకుండా చూసుకోవాలి.ఆధునిక జీవితాల్లో అంత తీరిక ఎవరికి ఉంటుంది? అందులోనూ, కెరీర్ పరుగులో ప్రపంచమంతా చుట్టేయాల్సిన రోజులివి. ‘..వాటి పూచీ మాది. భద్రంగా దాచుకుంటాం. తీరిక దొరికినప్పుడో, అవసరం అయినప్పుడో ఒక్క క్లిక్ ఇవ్వండి. మేమే మీ చిరునామాకు పంపుతాం’ అంటున్నారు ఇ-వార్డ్రోబ్ వ్యవస్థాపకురాలు వైదేహి.
నేను పుట్టి పెరిగింది ముంబైలో. మాతృభాష మరాఠీ. ఇండస్ట్రియల్ సైకాలజీలో పీజీ చేశాను. తర్వాత హెచ్ఆర్లో పనిచేశాను. ఆ సమయంలోనే హైదరాబాద్ అబ్బాయిని పెండ్లి చేసుకున్నాను. అలా తెలుగువారి కోడలినయ్యాను. ఇంట్లో అంతా తెలుగు మాట్లాడతారు కాబట్టి, త్వరగానే భాష నేర్చుకున్నా. పెండ్లి తర్వాత కొన్నేండ్లు అమెరికాలో ఉన్నాం. అక్కడికి వెళ్తున్నప్పుడు, వేలకువేలు ఖర్చుపెట్టి కొన్న డ్రస్సులన్నింటినీ ముంబైలోని పుట్టింట్లో వదిలేసి వెళ్లాను. మధ్యలో రావడం కుదర్లేదు. తీరా వచ్చాక చూస్తే.. మెయింటెనెన్స్ సరిగ్గా లేకపోవడంతో ఖరీదైన పట్టుచీరలు, గాగ్రాలు పాడైపోయాయి. చాలా బాధేసింది. ఇష్టంగా కొన్న వస్తువులను జాగ్రత్తగా చూసుకోలేకపోతే ఇలాంటి చేదు అనుభవాలే ఎదురవుతాయి. మనం ఊళ్లో ఉన్నా లేకపోయినా.. మన వస్తువులను కనిపెట్టుకుని ఉండేవారు ఎవరైనా ఉంటే బాగుండని అనిపించింది. భారతదేశంలో స్థిరపడ్డాక ఆ ఆలోచనను నేనే అమలు చేశాను. ‘ఇ-వార్డ్రోబ్’ను స్థాపించాను.
ఇలా మొదలైంది..
గత రెండేండ్లుగా ఈ ఆలోచనపై పనిచేస్తున్నా. పూర్తి స్థాయిలో వ్యాపారం మాత్రం ఈ ఏడాది నుంచే మొదలు పెట్టాను. కస్టమర్లు తమ వస్తువులను మా దగ్గరికి పంపితే భద్రంగా దాచిపెడతాం. పికప్, డ్రాప్ సేవలు ఉచితంగా అందిస్తున్నాం. ఖరీదైన బట్టలు, ఆత్మీయుల జ్ఞాపకంగా దాచుకున్న చీరలు, పంచెలు, ఖరీదైన హ్యాండ్ బ్యాగులు, పర్సులు, షూ.. మొదలైన వస్తువులను మేం జాగ్రత్తగా చూసుకుంటాం. వాటిని తరచూ వాడరు కాబట్టి, ఇంట్లో ఏ మూలకో పడేస్తుంటారు. మా దగ్గర ఉంచితే మధ్యమధ్యలో శుభ్రంచేస్తూ నాణ్యత దెబ్బ తినకుండా కాపాడతాం.
పూర్తి బాధ్యత మాదే..
కస్టమర్లకు చెందిన బట్టలు మా దగ్గరికి రాగానే, వాటిని ముందుగా శానిటైజ్ చేస్తాం. మా దగ్గర ఉష్ణోగ్రత, తేమ నియంత్రించే సౌలభ్యం ఉంటుంది. ఎప్పటికప్పుడు బట్టలను ఇస్త్రీ చేసి ర్యాక్స్‌లో పెడతాం. అవసరాన్ని బట్టి డ్రై క్లీనింగ్ కూడా చేస్తాం. ఒక్కో కస్టమర్ పంపిన వస్తువులను ఫొటో తీసి, వెబ్సైట్లో ప్రత్యేక కేటగిరీలు క్రియేట్ చేస్తాం. ఏదైనా పార్టీ లేదా ఫంక్షన్‌కు వెళ్తున్నప్పుడు.. మా వర్చువల్ డ్యాష్‌బోర్డ్‌పై కనిపించే వాటిలోంచి నచ్చిన డ్రస్సును ఎంచుకోవచ్చు. తక్షణం మా డెలివరీ బాయ్ తీసుకెళ్లి కస్టమర్‌కు అందిస్తారు. భద్రతకు ఢోకా లేకుండా ఇరవై నాలుగు గంటలూ సెక్యూరిటీ ఏర్పాటు చేశాం. ఇప్పటివరకు ఒక్క నెగెటివ్ ఫీడ్‌బ్యాక్ కూడా రాలేదు. మా వెబ్సైట్లో మూడు, ఆరు నెలలు, ఏడాది చొప్పున సబ్స్క్రిప్షన్ ప్లాన్లు ఉన్నాయి.
అందుబాటు ధరలో
వృత్తి ఉద్యోగాలతో బిజీగా ఉన్నవాళ్లు, దీర్ఘకాలం విదేశాలకు వెళ్తున్న వాళ్లు.. ఖరీదైన వస్తువులు పాడైపోతాయేమో అన్న భయంతో మమ్మల్ని ఆశ్రయిస్తున్నారు. కొందరు ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్‌కు వలస వస్తుంటారు. చిన్న ఇల్లు అద్దెకు తీసుకుంటారు. అన్ని సామాన్లనూ ఒకేచోట ఇరుకిరుకుగా పట్టించాల్సి వస్తుంది. దీనివల్ల వేలకు వేలు పెట్టి కొన్న వస్తువులు పాడైపోయే ఆస్కారం ఎక్కువ. ఇలాంటి సమస్యలకూ ఇ-వార్డ్రోబ్ పరిష్కారం చూపుతుంది. ఇప్పుడిప్పుడే స్థిరపడుతున్న ఫ్యాషన్ డిజైనర్లు, ఆన్లైన్లో దుస్తుల వ్యాపారం చేసేవాళ్లకు కూడా ఆసరాగా నిలుస్తున్నాం. చిన్న స్థాయిలో వ్యాపారం చేసుకునేవారు, ఖరీదైన ప్రాంతాల్లో స్టోర్ పెట్టలేరు. అలాంటివాళ్లు తాము డిజైన్ చేసిన డ్రస్సులను మా దగ్గర స్టోర్ చేసుకోవచ్చు. ఎవరైనా కస్టమర్ కొన్నప్పుడు, డిజైనర్లు ఆ విషయాన్ని తెలియజేస్తే.. ప్యాక్ చేసి పంపిస్తాం. ఈ సేవల కోసం మాకు వాళ్లు చెల్లించే మొత్తంతో పోలిస్తే బొటిక్, స్టోర్ కోసం పెట్టే ఖర్చు చాలా రెట్లు ఎక్కువ. కాబట్టే, మా ఇ-వార్డ్రోబ్ కాన్సెప్ట్‌ను అందరూ మెచ్చుకుంటున్నారు. ఆ ప్రోత్సాహమే నాకు కొండంత బలం.