దట్టమైన అటవీ ప్రాంతం.. ఎత్తయిన కొండలు, గుట్టలు.. పక్షుల కిలకిల సవ్వడులు.. వీటి మధ్య గలగల పారుతున్న గాయత్రి జలపాతం.. 350 అడుగుల ఎత్తు నుంచి జాలువారుతున్న జలతరంగాల అపురూప దృశ్యం.. ఈ జలధారలకు ఎదురొడ్డి సాహసీకులు చేసే విన్యాసాలు ఆకట్టుకోనున్నాయి. ఈ గాయత్రి జలపాతం ప్రపంచ సాహస క్రీడలకు వేదికకానుంది. ఆరేండ్ల క్రితం మొదటిసారి నిర్వహించగా.. ప్రస్తుతం రెండోసారి ఆతిథ్యం ఇవ్వబోతున్నది. తెలంగాణ అడ్వెంచర్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా.. భారత్‌తోపాటు ఇతర దేశాల నుంచి సాహసీకులు వస్తున్నరు. రెండు రోజులపాటు నిర్వహించనున్న వాటర్ రాపెల్లింగ్ ప్రపంచ పోటీలను వీక్షించడానికి ప్రకృతి ప్రేమికులు, పర్యాటకులు తరలిరానున్నారు.
ఇచ్చోడ, సెప్టెంబర్ 29 : ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలంలోని గుండివాగు గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో గల దట్టమైన అటవీ ప్రాంతంలో గాయత్రి జలపాతం ఉంది. పుష్కరకాలంగా తెలంగాణ అడ్వెంచర్ క్లబ్, ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లో సాహస క్రీడలు నిర్వహిస్తున్నారు. ఈ క్రీడలను మొట్ట మొదటిసారి 2016 సంవత్సరంలో గాయత్రి జలపాతం వద్ద నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన క్రీడల్లో భారత్‌తోపాటు పొరుగు దేశాల నుంచి సాహసీకులు తరలివచ్చారు. ఆరేండ్ల తర్వాత మళ్లీ ఇక్కడే పోటీలు నిర్వహిస్తున్నారు.
నాలుగు రోజులపాటు పోటీలు..
ఈసారి సాహస క్రీడల పోటీలను నాలుగు రోజులపాటు నిర్వహించనున్నారు. ఈ క్రీడలను తెలంగాణ రాష్ట్ర అడ్వెంచర్ క్లబ్ డైరెక్టర్ రంగారావ్ ఆధ్వర్యంలో నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు. వాస్తవానికి ఈ పోటీలు కేవలం రెండు రోజులు మాత్రమే. వారం రోజుల నుంచి వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల ప్రభావం వల్ల అదనంగా రెండు రోజులు పొడిగించారు. వాతావరణం అనుకూలిస్తే రెండు రో జుల్లో ముగించనున్నారు. ఒక వేళ వర్షం కురిస్తే ఆ మరుసటి రోజు క్రీడలను పెట్టనున్నారు.
జలవిన్యాసాలకు అనుకూలం
గాయత్రి జలపాతం వద్ద జలవిన్యాసాలకు వాతావరణం అనుకూలంగా ఉంది. ఇక్కడే సాహస క్రీడల పోటీలు నిర్వహిస్తున్నాం. అన్ని రకాల పోటీలు నిర్వహించడానికి జలపాతం అద్భుతంగా ఉంది. మన దేశంతోపాటు ఇతర దేశాల నుంచి యువతి, యువకులు పాల్గొంటారు. మేడిగూడ గిరిజన ఆశ్రమ పాఠశాలలో సహసీకులకు వసతిని ఏర్పాటు చేశాం. అక్కడి నుంచి ప్రత్యేక వాహనం ద్వారా జలపాతానికి తరలిస్తాం. వర్షం కురిస్తే రిజర్వ్ డే రోజు పోటీలు నిర్వహిస్తాం. పోటీలు ముగిసే వరకు ఇక్కడే ఉంటాం. ప్రణాళికాబద్ధంగా రాపెల్లింగ్ పోటీలు నిర్వహిస్తాం. కుంటాల జలపాతం కంటే గాయత్రి జలపాతం చాలా ఎత్తులో ఉంది.
– రంగారావ్, టీఎస్ అడ్వెంచర్ క్లబ్ డైరెక్టర్, హైదరాబాద్