అమృత్సర్: పంజాబ్‌లోని ( Punjab ) పాటియాలా నగరంలో ఓ కారు డ్రైవర్ చేసిన పని స్థానికులను భయాందోళనకు గురిచేసింది. రెగ్యులర్ విధుల్లో భాగంగా శనివారం కూడా పాటియాలాలో పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తున్నారు. ఈ క్రమంలో అటుగా వస్తున్న ఓ కారును కానిస్టేబుల్ ఆపే ప్రయత్నం చేశాడు. అయితే కారు డ్రైవర్ ఆపకుండా కానిస్టేబుల్ మీదకు దూసుకొచ్చాడు. కానిస్టేబుల్ తప్పుకునేందుకు ప్రయత్నించినా అవకాశం ఇవ్వకుండా ఢీకొట్టి పారిపోయాడు.
ఈ ఘటనలో కానిస్టేబుల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. తోటి పోలీసులు ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఓ కారు డ్రైవర్ తనిఖీ నుంచి తప్పించుకునేందుకు తమ పోలీస్‌ను ఢీకొట్టి కారుతో పరారయ్యాడని, ప్రస్తుతం ఆ కారును ట్రేస్ చేసి నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని పాటియాలా డీఎస్పీ హేమంత్ శర్మ చెప్పారు. కేసుకు సంబంధించి తదుపరి విచారణ కొనసాగుతున్నదన్నారు.