దివ్య ఔషధం తాటి ముంజలు
చిన్న పిల్లలు, గర్భిణులకు పుష్కలంగా పోషకాలు
చర్మ వ్యాధులు, ట్యూమర్, బ్రెస్ట్ క్యాన్సర్ నివారణకు దోహదం
వరంగల్ చౌరస్తా, మార్చి 31: ఎండాకాలం వచ్చిందంటే అందరికీ గుర్తుకొచ్చేవి తాటి ముంజలు. వీటిని ఐస్ ఆపిల్ అని కూడా పిలుస్తుంటారు. తాటి ముంజల్లో ఉన్న పోషకాలు వడదెబ్బ నుంచి కాపాడడమే కాకుండా దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. ఎండ వేడి కారణంగా మనిషి శరీరంలోని తేమ చెమట రూపంలో బయటకు వెళ్లడంతో శరీర ఉష్ణోగ్రతలు ఎక్కువ అవుతుంటాయి. మనిషి వడదెబ్బకు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి సందర్భాల్లో తాటి ముంజలు ఆహారంగా తీసుకోవడం వల్ల శరీరంలో తేమ శాతం పెరిగి శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది.
అలసటను దూరం చేసి వడదెబ్బకు లోను కాకుండా చేస్తుంది. ఆహారపు అలవాట్లను నియంత్రించి బరువు తగ్గాలని ప్రయత్నించే వారికి సైతం ముంజలు మంచి ఔషధంగా పని చేస్తాయి. అంతేకాకుండా జీర్ణ వ్యవస్థ నిదానంగా జరుగుతుందని, మనిషికి శక్తిని సైతం అందజేస్తుందని వైద్యులు తెలియజేస్తున్నారు. చిన్న పిల్లల్లో అధికంగా కనిపించే చికెన్ ఫాక్స్ తగ్గించడంలో తాటి ముంజలు దోహదపడుతాయి. తాటి ముంజల్లో ఉండే పొటాషియం లివర్ సమస్యలను తగ్గించడంలో ప్రధానపాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా గర్భిణులకు మలబద్దకం, ఎసిడిటీ సమస్యలను తగ్గిస్తుంది. ముంజల్లోని పైటో కెమికల్స్, ఆంతోసినిస్ అనబడే పదార్థాలు మనిషి శరీరంలోని ట్యూమర్స్, బ్రెస్ట్‌క్యాన్సర్ కారక సెల్స్‌ను నివారించి కాన్సర్ బారిన పడకుండా చూస్తుంది. వేసవిలో చర్మ సౌందర్యాన్ని కాపాడడానికి చాలా ఉపయోగపడుతుంది. తాటి ముంజలను మధ్యలోకి చీల్చి చర్మానికి మర్థన చేయడం వల్ల శరీరంపై ఏర్పడే చెమటకాయలను సైతం నివారించవచ్చు.