ఏటూరునాగారం, జూన్ 29 : మారుమూల గిరిజన గ్రామాల్లోని విద్యార్థుల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఆంగ్ల మాధ్యమ విద్యకు శ్రీకారంచుట్టింది. ఇందులో భాగంగా గిరిజన సంక్షేమ శాఖ పరిధిలో ఉన్న ఆశ్రమ పాఠశాలల్లో ఈ విద్యాసంవత్సరం నుంచే ఇంగ్లిష్ మీడియంలో పాఠాలు బోధించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధమైంది. ములుగు జిల్లాలో 27, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఏడు పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం ప్రవేశపెట్టేందుకు ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, స్కూల్ అసిస్టెంట్లు, ఎస్జీటీలకు విడతలవారీగా రెండు సార్లు శిక్షణ కూడా ఇచ్చింది.
మరోసారి ఎనిమిది వారాల పాటు ఆన్లైన్, ఐదు రోజుల చొప్పున రెండు పర్యాయాలు నేరుగా శిక్షణ ఇచ్చేందుకు అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపగా, గిరి బడుల్లో ఆంగ్ల మాధ్యమంపై గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేస్తూ తల్లిదండ్రులకు అవగాహన కల్పిస్తున్నారు. ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా గిరిజన ఇంగ్లిషు మీడియం పాఠశాలలు ఉంటాయనే విషయాన్ని తల్లిదండ్రులకు తెలియచేస్తున్నారు. పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెంచేందుకు నిర్వహించిన బడిబాటను విజయవంతంగా కొనసాగిస్తున్నారు. జిల్లాలో బడిబాటలో 1,568మంది విద్యార్థులను బడిలో చేర్పించే లక్ష్యంతో ఇప్పటివరకు 805మంది చేర్పించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో 632 మంది విద్యార్థులను చేర్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ చొరవ తీసుకుని పాఠశాలల్లో మరమ్మతులు చేయించడం, టాయిలెట్స్ ఏర్పాటు, విద్యుత్ వెలుగులను అందించేలా చర్యలు తీసుకున్నారు.
ట్యాబ్, డిజిటల్ తరగతులు
పాఠశాలల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నారు. తాగునీటికి ఆర్వో ప్లాంట్లు ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలు కూడా అమర్చారు. ఈ స్కూల్లో డిజిటల్ క్లాస్‌లు, కంప్యూటర్ ల్యాబ్స్, ట్యాబ్‌లతో శిక్షణ అందిస్తున్నారు. ఇదిలా ఉండగా విద్యార్థులకు ఏడాదికి నాలుగు యూనిఫాంలు అందిస్తున్నారు. బెడ్షీట్లు, రెండు టవల్స్, పాఠ్యపుస్తకాలు, 25 లాంగ్ నోట్సు, మరో ఐదు నోటు బుక్స్ పంపిణీ చేస్తున్నారు. ఇక మూడు నుంచి ఏడో తరగతి విద్యార్థులకు రూ.950, ఎనిమిది నుంచి పదో తరగతి వరకు రూ.1100లను నెలకు మెనూ రూపంలో ప్రభుత్వం కేటాయిస్తుంది. ఇక బాలికలకు నెలకు రూ.175, బాలురకు రూ.150చొప్పున కాస్మోటిక్స్ చార్జీలు చెల్లిస్తున్నారు.
విద్యార్థులకు అదనపు సౌకర్యాలు
ఇక ఇంగ్లిషు మీడియం చదివే విద్యార్థులు ప్రత్యేక ఆకర్షణలో ఉండే విధంగా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందులో భాగంగా ఈ ఏడాది నుంచి ప్రతీ విద్యార్థికి గతంలో అందించే దుస్తులు, ఇతరత్రా వస్తువులతో పాటు రెండు రకాల షూలు నైట్‌డ్రెస్‌లు, స్లిప్పర్స్, స్కూల్ బ్యాగ్, షర్టు, టీ షర్టులు అందించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. ఇక గ్రామంలోని పాఠశాలల్లో విలేజ్ ఎడ్యుకేషన్ రిజిస్టర్ ఆధారంగా గ్రామంలో ఉన్న విద్యార్థుల సంఖ్య, ఏ విద్యార్థి ఏ పాఠశాలకు వెళ్తున్నాడో తెలుసుకొని ప్రైవేట్ పాఠశాలలకు వెళ్లే విద్యార్థుల తల్లిదండ్రులను కలిసి వారిని గిరిజన ఆశ్రమ పాఠశాలలో చేరేలా ఉపాధ్యాయులు అవగాహన కల్పిస్తున్నారు.
ఇంగ్లిష్ మీడియంలోకి 34 పాఠశాలలు
ములుగు జిల్లాలో 29 గిరిజన ఆశ్రమ పాఠశాలలు ఉండగా ఇందులో ఇప్పటికే మేడారం, కర్లపల్లిలో ఇంగ్లిష్ మీడియం నడుస్తున్నాయి. ఇక చిన్నబోయినపల్లి, ఆకులవారి ఘనపూర్, మల్యాల, ఏటూరునాగారం, చెల్పాక, ప్రాజెక్టునగర్, తుపాకులగూడెం, ఐలాపూర్, కన్నాయిగూడెం, కోమటిపల్లి, బ్రాహ్మణపల్లి, చుంచుపల్లి, జగ్గన్నపేట, రాయినిగూడెం, కొడిశాల, బయ్యక్కపేట, కాల్వపల్లి, ఊరట్టం, రంగాపూర్, తాడ్వాయి, రామాంజపూర్, బూరుగుపేట, చిరుతపల్లి, లక్ష్మీనగర్, చిరుతపల్లి-2, పెద్ద గొల్లగూడెం, పేరూరు పాఠశాలలను ఇంగ్లిష్ మీడియం పాఠశాలలుగా మార్చుతున్నారు. ఈ పాఠశాలల్లో 4,119మంది విద్యార్థులు చదువుతుండగా జిల్లాలోని ఎనిమిది హాస్టల్స్‌లో 575మంది విద్యార్థులు చదువుతున్నారు. ఇక జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరంలో ఇంగ్లిష్ మీడియం ఇప్పటికే ఉండగా భూపాలపల్లి, మేడిపల్లి, మహదేవ్పూర్, మాదారం, పెగడపల్లి, ముకునూరు, తాడిచర్ల ఆశ్రమ పాఠశాలలు ఇంగ్లీషు మీడియంగా మారనున్నాయి. వీటిల్లో 1173 మంది విద్యార్థులు, మూడు హాస్టల్స్‌లో 248మంది విద్యార్థులు చదువుతున్నారు.
కార్పొరేట్ తరహాలో విద్యాబోధన
గిరిజన పాఠశాల్లో మెరుగైన ఆంగ్ల బోధన జరుగుతుందని తల్లిదండ్రులకు నమ్మకం కలిగిస్తున్నాం. ప్రైవేట్ పాఠశాలల కంటే గిరిజన పాఠశాలలే మేలనే విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేస్తున్నాం. ఊరికి ఒక ఉపాధ్యాయుడిని నియమించి ఎన్రోల్ మెంట్ చేస్తున్నాం. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గిరిజన పాఠశాలలను తీర్చిదిద్దుతున్నాం. నాణ్యమైన విద్యనందించేందుకు ఉపాధ్యాయులకు ఇప్పటికే విడతలవారీగా శిక్షణ ఇచ్చాం. విద్యార్థుల ప్రమాణాలను గుర్తించేందుకు పరీక్షలు నిర్వహిస్తాం. పదో తరగతి వారికి స్టడీ మెటిరీయల్ ఇస్తున్నాం. విద్యతోనే జ్ఞానం పెరుగుతుందని తెలియచేస్తూ చదువులో రాణించేలా తయారుచేస్తున్నాం. ఈమేరకు గిరిజన పాఠశాలలను ఆదరించి సద్వినియోగం చేసుకోవాలి.
– పోచం, గిరిజన సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్