వరంగల్, సెప్టెంబర్ 29: గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో బతుకమ్మ సంబురాలు అంబరాన్నింటాయి. బల్దియా ఆధ్వర్యంలో గురువారం బతుకమ్మ వేడుకలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా బల్దియా ఇండోర్ స్టేడియం ఆవరణలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, మహిళా కార్పొరేటర్లు, ఉద్యోగులు ఉత్సహంగా పాల్గొన్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు అద్దం పట్టే బతుకమ్మ పాటలు పాడి మేయర్, కమిషనర్, కార్పొరేటర్లు సందడి చేశారు. బతుకమ్మ పాటలకు లయబద్ధంగా చప్పట్లు కొడుతూ కోలాటం ఆడారు. విద్యుత్ కాంతుల్లో కార్యాలయ ఆవరణ వెలిగిపోయింది.
తీరొక్క పూలతో బతుకమ్మలు పేర్చి..
బల్దియా ఆధ్వర్యంలో నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో మహిళా కార్పొరేటర్లు, ఉద్యోగులు ఉత్సహంగా, ఉల్లాసంగా గడిపారు. తంగేడు, గునుగు, చామంతి, బంతి పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలను తీసుకొని మేయర్ సుధారాణి, కమిషనర్ ప్రావీణ్య, కార్పొరేటర్లు వచ్చారు. అనంతరం ఇండోర్ స్టేడియం ఆవరణలో బతుకమ్మలను పెట్టి సంబురంగా ఆడిపాడారు. సుమారు రెండు గంటలపాటు జరిగిన సంబురాలు అంబురాన్నంటాయి. ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు అనే తేడా లేకుండా పాటలు పాడి.. ఆటలు ఆడి ఆనందంగా గడిపారు.
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ..
తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ వేడుకలు అని మేయర్ గుండు సుధారాణి అన్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ప్రజందరినీ ఏకం చేసిన పండుగ బతుకమ్మ అని గుర్తుచేశారు. ఈ వేడుకను సీఎం కేసీఆర్ రాష్ట్ర పండుగగా ప్రకటించి అధికారికంగా ఘనంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. బతుకమ్మ సంబురాలను విజయవంతం చేసిన కార్పొరేటర్లు, ఉద్యోగులకు కమిషనర్ ప్రావీణ్య కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం మేయర్, కమిషనర్ నగరంలోని మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ రిజ్వానా షమీమ్, కార్పొరేటర్లు దేవరకొండ విజయలక్ష్మి, గుండు చందన, షీబారాణి, పల్లం పద్మ, ముష్కమల్ల అరుణ, పోశాల పద్మ, నల్లా స్వరూపారాణి, ఈదురు అరుణ, బస్వరాజు శిరీష, చీకటి శారద, గుంటి రజిత, ఇమ్మడి లోహిత, బల్దియా కార్యదర్శి విజయలక్ష్మి, హెచ్‌వో ప్రిసిల్లా, జేఏవో సరిత, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు.
కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో..
వరంగల్‌చౌరస్తా: కాళోజీ హెల్త్ యూనివర్సిటీలో బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహించారు. యూనివర్సిటీ మహిళా ఉద్యోగులు బతుకమ్మను పేర్చి వేడుకలకు ఏర్పాట్లు చేశారు. వీసీ కరుణాకర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై మహిళలకు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ప్రకృతికి చిహ్నాలైన పూలను అమ్మ వారిగా కొలుస్తూ పూజలు చేసే సంస్కృతి ఒక్క తెలంగాణలోనే ఉందని ఆయన తెలిపారు. అనంతరం బతుకమ్మ ఆటపాటలతో మహిళా ఉద్యోగులు సందడి చేశారు. కార్యక్రమంలో కాళోజీ హెల్త్ యూనివర్సిటీ ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.