Mukesh Ambani | రిలయన్స్ చైర్మన్ ముకేశ్ అంబానీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. అమెరికా రిటైల్ మేజర్ వాల్గ్రీన్స్ బూల్స్ అలయెన్స్ మంగళవారం సంచలన నిర్ణయం తీసుకున్నది. తమ ఫార్మా రిటైల్ బిజినెస్ సంస్థ `బూట్స్యూకే` విక్రయ ప్రతిపాదనను ఉపసంహరించుకున్నట్లు తెలిపింది. బూట్స్యూకేను కొనసాగించాలని నిర్ణయించుకున్నట్లు వాల్గ్రీన్స్ బూట్స్ అలయెన్స్ వెల్లడించింది. ఈ మేరకు బూట్స్ యూకే సంస్థను టేకోవర్ చేయడానికి ముకేశ్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ ఇండస్ట్రీస్ దాఖలు చేసిన బిడ్ను తిరస్కరించింది. దీనిపై రిలయన్స్ వర్గాలు స్పందిస్తూ.. విదేశాల్లో మంచి అవకాశాలు లభిస్తే, ఆయా సంస్థల కొనుగోలుపై దృష్టి సారిస్తామని పేర్కొన్నాయి.
అత్యధిక విలువ గల బూట్స్, నం.7 బ్యూటీ కంపెనీలను టేకోవర్ చేయడానికి థర్డ్ పార్టీ సరైన ఆఫర్ చేయలేదని వాల్గ్రీన్స్ బూట్స్ పేర్కొంది. సంస్థ వాటాదారుల ప్రయోజనార్థం ఈ రెండు బిజినెస్ల భవిష్యత్ వృద్ధి, లాభాలపై దృష్టి సారిస్తామని వివరించింది. ప్రస్తుతం సవాళ్లతో కూడిన పరిస్థితులు నెలకొనడంతో బూట్స్, నం.7 బ్యూటీ కంపెనీ స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్, వృద్ధి సాధిస్తున్న నేపథ్యంలో వీటిని తమ ఆధీనంలోనే ఉంచుకోవాలని వాల్గ్రీన్స్ తెలిపింది.
పశ్చిమ మార్కెట్లను మాంద్యం ముంచెత్తుతుందన్న భయాందోళనలను దృష్టిలో పెట్టుకుని బూట్స్ యూకేను టేకోవర్ చేయడానికి రిలయన్స్ కన్జర్వేటివ్ బిడ్ దాఖలు చేసింది. వాల్ గ్రీన్స్ ఏడు బిలియన్ల పౌండ్లు (8.54 బిలియన్ల డాలర్లు) బిడ్ కోరితే, రిలయన్స్ ఐదు బిలియన్ల పౌండ్ల (6.10 బిలియన్ల డాలర్లు) ఆఫర్ చేసింది. రిలయన్స్తోపాటు బ్రిటన్లోని ఈషా బ్రదర్స్, టీడీఆర్ క్యాపిటల్ ఆసక్తి చూపినా.. తర్వాత వెనక్కి తగ్గాయి.