ల్యాప్‌టాప్.. ప్రపంచంలో ఎక్కువగా ఉపయోగించే ఎలక్ట్రానిక్ పరికరాల్లో ఒకటి. దీనిని వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఉపయోగిస్తుంటాం. ఫోన్లు, గేమింగ్ కన్సోల్‌ల మాదిరిగా కాకుండా ల్యాప్‌టాప్ ఎక్కువ లైఫ్ ఇస్తుంటుంది. అందుకే దీనితో వినియోగదారులకు అటాచ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. తమ అభిమాన పరికరం పాడైపోయినప్పుడు చాలా బాధపడుతుంటారు. ఇలాంటి ఘటనే ఒకరికి ఎదురైంది. తన ల్యాప్‌టాప్ పాడైపోగా సదరు వ్యక్తి చాలా బాధపడ్డాడు. దానికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ప్రయత్నించాడు. ఈ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.
టిక్ టాకర్ జెన్, అకా @కింగ్జెన్ వాడుతున్న ల్యాప్‌టాప్ పాడైపోయింది. అతడు దాన్ని బయటపడేసేందుకు ఇష్టపడలేదు. దాన్ని తీసుకొని ఫ్యునరల్ హోంకు తీసుకెళ్లాడు. అంత్యక్రియలకు ఏర్పాటు చేయగలరా? అని రిసెప్షన్లో ఉన్న మహిళను అడిగాడు. ఆమె డెడ్ బాడీ ఎక్కడ? అని అటూ ఇటూ చూసింది. అయితే, తన ల్యాప్‌టాప్ చనిపోయిందని ఆ వ్యక్తి చెప్పగానే మహిళ షాక్ అయింది. ఈ వీడియో ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. టిక్‌టాక్‌లో ఈ వీడియోను 2 మిలియన్లకు పైగా మంది వీక్షించారు. పరికరాలతో మనుషులకున్న ప్రేమను చూపించేందుకే ఈ వీడియో చేసినట్లు సదరు వ్యక్తి వెల్లడించాడు.