పాట్నా, అక్టోబర్ 29 : బీహార్ అసెంబ్లీ ఎన్నికల (Bihar Assembly Elections) ప్రచారం సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారం చేసేందుకు దయాల్పూర్ పంచాయతీని బుధవారం సందర్శించిన వైశాలికి చెందిన బీజేపీ (BJP) ఎమ్మెల్యే అవదేష్ సింగ్‌ని (Awadesh Singh) గ్రామస్థులు తరిమికొట్టారు. గత పదేళ్లలో ఒక్కసారి కూడా తమ గ్రామం మొహం చూడని ఎమ్మెల్యే ఇప్పుడు ఓట్ల కోసం వచ్చారని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేని కలుసుకోవడానికి ఆయన ఇంటికి వెళితే ఆయన బాడీగార్డు తమను తరిమివేశాడని వారు గుర్తు చేశారు. ఎమ్మెల్యేని కలుసుకోవడానికి అపాయింట్మెంట్ అడిగే ప్రజాప్రతినిధి తమకు అవసరం లేదని వారు తేల్చిచెప్పారు. స్థానికుల ఆగ్రహానికి బిత్తరపోయిన బీజేపీ ఎమ్మెల్యే అక్కడి నుంచి పలాయనం చిత్తగించారు.