ఎలా ఉన్నారు? ఈ రోజు మీకోసం ఒక ఫ్రెండ్‌ను తీసుకొచ్చాం. తన వయసు చాలా చిన్నది. అయినా వార్తల్లో ఎక్కాడు. ఎలా అంటారా? వయసుకు మించిన జ్ఞాపకశక్తితో ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు సాధించాడు. పేరు విహాన్ కృష్ణ. మన హైదరాబాదే.
విహాన్ కృష్ణ కండలం హైదరాబాద్‌లోని బోధి పాఠశాలలో చదువుతున్నాడు. కిందటి ఏడాది విహాన్ జ్ఞాపక శక్తిని తల్లిదండ్రులు పరీక్షించారు. విహాన్ 12 సముద్ర జంతువులు, రంగులు, ఆకారాలు, 18 వాహనాలు, 16 పక్షులు, 23 శరీర భాగాలు, 24 కూరగాయలు, 37 పండ్లు, 42 జంతువులు.. ఇలా రకరకాల పేర్లను గుర్తుపట్టాడు. జెడ్ నుంచి ఏ వరకూ చదివి అబ్బురపరిచాడు. వారాల పేర్లు, తెలుగు నెల పేర్లు నోటికి చెప్పాడు. ఒకటి నుంచి వందల అంకెలు, మళ్లీ రివర్స్‌లో చెప్పి ఆశ్చర్యపరిచాడు. చూడకుండానే ఐదో ఎక్కం వరకూ వల్లించాడు. అలాగే ఎనిమిది తెలుగు శ్లోకాలు కూడా కంఠతా చేశాడు. దీంతో పాటు పలు జనరల్ నాలెడ్జి ప్రశ్నలకు కూడా జవాబులు చెప్పాడు. ఇదంతా, నాలుగేండ్లప్పుడే జరిగింది. ఈ ప్రతిభను ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ వాళ్లు ఇటీవలే ధృవీకరించారు. నాలుగేండ్ల వయసులోనే గొప్ప జ్ఞాపకశక్తిని ప్రదర్శించిన విహాన్‌కు తమ పుస్తకంలో చోటు కల్పించారు. విహాన్ జ్ఞాపక శక్తి సాధనకోసం తల్లి మాధురి, తండ్రి క్రిష్ణ సాయం చేశారు. సూపర్ కదా! చిన్న వయసులోనే ఎన్నో విషయాలను గుర్తుంచుకున్నాడు విహాన్. మీరు కూడా మెమరీ పవర్‌ను పెంచుకోవడానికి ప్రయత్నిస్తారు కదూ!