e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, October 21, 2021
Home News Victory of Lord Venkateshwara swamy : వేంకటేశ్వర విజయం

Victory of Lord Venkateshwara swamy : వేంకటేశ్వర విజయం

తిరుమలగిరి దేవుడు.. సిరుల సింగార రాయడు. ఆనందనిలయ ప్రాంగణం సాక్షాత్తు శ్రీలక్ష్మి మెట్టిల్లు. ప్రధాన ద్వారానికి ఇరువైపులా కొలువైన శంఖనిధి, పద్మనిధి.. అనంతుడి అపార సంపదలకు సర్వ రక్షకులైనదేవతలు. ఎందరో నరపతులు వేంకటపతికి సకలాభరణాలు సమర్పించి శరణాగతిని చాటుకొన్నారు. అధికార మదంతో ఆలయ సంపదలకు ఆశపడి దాడికి యత్నించిన దుర్మార్గులూ ఉన్నారు. దశావతారాలెత్తి దశకంఠాది రాక్షసులను సంహరించిన స్వామికి.. కలికాలపు నులి పురుగులొక లెక్కా?

క్రీ.శ 1543.
గోవా.
పోర్చుగీసు పాలన కేంద్రం.

మార్టిం అఫోన్సో ఉన్నతాసనం మీద కూర్చుని ఉన్నాడు. ఎదురుగా సైనికాధికారి, నౌకాదళ అధినేత. అఫోన్సో తిరుగులేని వ్యూహకర్త. యుద్ధ విద్యల్లో ఆరితేరినవాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ నౌకలను నడిపించడంలో దిట్ట. అతడి అసుర దృష్టి తిరుమల సంపద మీద పడింది. పల్లవరాణి సామవై నుంచి తెలుగు భోజుడు కృష్ణరాయల వరకూ.. నరపతులూ, గజపతులూ స్వామివారికి సమర్పించిన ధనకనక వస్తువాహనాలనూ; వజ్రవైడూర్యాది మణిమాణిక్యాలనూ కొల్లగొట్టాలన్న దురాశ ప్రబలింది.
ఎక్కడో ఏడుకొండల మీద ఉన్న గుడి. చుట్టూ దుర్గమమైన అడవి. ఇరుకిరుకు కాలిబాట. ఆలయ రక్షణ వ్యవస్థా అంతంత మాత్రమే. వెళ్లడం కష్టమే. కానీ, సంపదలను చేజిక్కించుకోవడం మహా సులభం. అందులోనూ అది బ్రహ్మోత్సవాల సమయం. భక్తులనూ దోచుకోవచ్చు. ఆ దురాశతోనే, ‘తిరుమల దోపిడి’కి అనుమతి కోరుతూ సర్కారుకు లేఖ రాశాడు అఫోన్సో. పక్షం రోజుల్లోనే పాలకుల నుంచి వర్తమానం అందింది.

- Advertisement -

మీ ఆలోచన అద్భుతం. వెంటనే ఏర్పాట్లు చేసుకోండి. తిరుమల సంపదను స్వాధీనం చేసుకోవాలన్నది మా చిరకాల వాంఛ.
ఇట్లు
ఫిలిప్‌-3
(పోర్చుగల్‌తో కూడిన స్పెయిన్‌ పాలకుడు)

..ఒకటికి పదిసార్లు చదువుకున్నాడు. మరుక్షణమే వ్యూహం సిద్ధమైంది. నాలుగు వందల గుర్రాలను, రెండువేల మంది సైనికులను సమాయత్తం చేశాడు. తిరుమల అంటేనే లక్ష్మీనివాసం. సంపదలకు కొదవేం ఉంటుంది? ఆ అపార ధనరాశిని తరలించడానికి రెండువందలమంది బానిసలను సమకూర్చుకున్నాడు. దాడి వివరాలను పరమ రహస్యంగా ఉంచాడు. ఒకరిద్దరు ఉన్నతాధికారులకు మాత్రమే ఆ విషయం తెలుసు. అతికొద్దిమంది కీలక అధికారులు నౌకామార్గంలో వెళ్తారు. ముందుగా పులికాట్‌ చేరుకొని, అక్కడి నుంచి ససైన్యంగా తిరుమల బయల్దేరుతారు. ఇదీ ప్రణాళిక. అనుకున్న సమయానికి నౌకలు కదిలాయి. భూమార్గంలో కాల్బలమూ పయనమైంది.

అంతలోనే.. వాతావరణంలో అనూహ్యమైన మార్పులు. సంద్రంలో ఉప్పెనలు. కరుణా సముద్రుడిపై దాడికి తెగించిన ముష్కరులను చూసి, సముద్రుడి గుండె రగిలిపోయిందేమో! అయినా, సాక్షాత్తు సముద్రరాజ తనయ శ్రీలక్ష్మి. అల్లుడి ఆస్తులపై కన్నేస్తే మామకు కోపం రాకుండా ఉంటుందా? అలలు ఆకాశమంత ఎత్తున ఎగిసిపడ్డాయి. నింగి నిప్పులు చెరిగింది. ఉరుములు, మెరుపులు! పోర్చుగీసువారి ఓడలు.. వణికిపోయాయి, ఊగిపోయాయి. ప్రాణాలు దక్కించుకోవడానికి ‘నెడున్‌తీవు’ దీవిలో తలదాచుకొన్నాడు అఫోన్సో.
రోజులూ వారాలూ గడిచిపోతున్నాయి. పరిస్థితిలో మార్పు లేదు. అంటువ్యాధులు ప్రబలాయి. ఒకటిరెండు మరణాలూ సంభవించాయి. ‘మా వల్ల కాదు. ఏదో దైవశక్తి మమ్మల్ని హెచ్చరిస్తున్న భావన కలుగుతున్నది. వెనక్కి వెళ్లిపోదాం. లేదంటే, మా దారి మేం చూసుకుంటాం’ అంటూ హెచ్చరించారు అనుచరులు. అంతలోనే, ఓ గూఢచారి కొరీయ అనే పోర్చుగీసు యాత్రికుడు రాసిన లేఖను అఫోన్సో చేతిలో పెట్టాడు.
‘మీరు తిరుమల మీద దాడికి తెగ బడుతున్నట్టు తెలిసింది. పెద్ద తప్పు చేస్తున్నారు. మహామహా రాక్షసులను తుదముట్టించిన స్వామికి మీరెంత? మీ సైన్యమెంత? తరిమికొట్టడానికి ఏ విజయనగర సైన్యమో రావాల్సిన పన్లేదు. బ్రహ్మోత్సవాలకు వచ్చిన భక్త జనం చాలు’
-ఇదీ ఆ లేఖ సారాంశం. కొరీయ శ్రీనివాసుడి పరమభక్తుడు. క్రీ.శ.1534లో తాను స్వామివారిని దర్శించుకున్నట్టు తన ఆత్మకథలో రాసుకొన్నాడు. దేవదేవుడి మహిమలనూ కొనియాడాడు.
ఒకవైపు ప్రకృతి ప్రకోపం. మరోవైపు అనుచరుల అసమ్మతి. అనుకున్నది సాధించలేక, అసమర్థ అధికారి అన్న ముద్రను భరించలేక.. అఫోన్సోకు మతి భ్రమించినట్టు సమాచారం.

క్రీ.శ 1543.
తిరుమల.

బ్రహ్మాండనాయకుడి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుదండెల పైనేగీ దేవుడిదే తొలినాడు.. సిరుల రెండవనాడు శేషుని మీద.. మురిపేన మూడోనాడు ముత్యాల పందిరికింద.. రోజుకో వాహనమెక్కి.. మూడులోకాల రేడు మాడవీధుల్లో ఊరేగుతున్నాడు.. చిరుదరహాసుడై, చిద్విలాసుడై.

ముస్లిం పాలకుల హయాంలోనూ, ఆంగ్లేయుల పాలనలోనూ తిరుమల సంపదను కాజేసే కుట్రలు చాలానే జరిగాయి. ఫ్రెంచివారూ విఫల యత్నం చేశారు. ఫాలనేత్రానల ప్రబల విద్యుల్లతా కేలీ విహారుడైన ఉగ్ర శ్రీనివాసుడి ఆగ్రహ జ్వాలలకు ఆ శత్రుమూకలు నశించిపోయాయి. బల్వంత్‌రాయ్‌ అనే మరాఠా పాలకుడు కూడా అలిపిరి వరకూ వచ్చి ఆగిపోయాడు. మనసు మార్చుకొని కాలినడకన ఏడుకొండలెక్కి, కోనేటి రాయడిని దర్శించుకున్నాడు. సైన్యాన్నంతా అక్కడే వదిలిపెట్టి..
‘ఎక్కడి మానుష జన్మంబెత్తిన ఫలమేమున్నది నిక్కము నిన్నే నమ్మితి చిత్తంబికనూ’అంటూ ఆధ్యాత్మిక సాధనకు అడవుల బాట పట్టాడు. 1630 నాటి, డచ్‌ ఉద్యోగి అబ్రహాం రొగేరియన్‌ డైరీ ప్రకారం.. ఓ స్థానిక పాలకుడు నవరత్న ఖచితమైన
శ్రీనివాసుడి కిరీటాన్ని సొంతం చేసుకోవాలని కలలుగన్నాడు. ‘నా విష్ణుః పృథ్వీ పతిః అంటారు కాబట్టి, శ్రీనివాసుడి కంటే మీరే గొప్ప. అంత అందమైన కిరీటం రాతి బొమ్మకు ఎందుకు? రారాజు ధరించడమే న్యాయం’ అని ఓ సలహాదారుడు ఆ పాలకుడికి అన్యాయమైన సలహా ఇచ్చాడు. కిరీటాన్ని తమకు అప్పగించాలంటూ ఆలయ అధికారులకు ఆదేశాలూ వెళ్లాయి. అంతలోనే, ఆ సలహాదారు ఏదో ప్రమాదంలో మరణించాడు. కొంతకాలానికి, రాజు కూడా అనారోగ్యం పాలై ప్రాణాలు విడిచాడు. తనకు పద్మనాభాచార్యుడనే పండితుడు ఈ విషయం చెప్పినట్టు అబ్రహాం రాసుకొన్నాడు. ఇది ఆరవీడు పాలకుడు పెద వేంకటపతి కాలం నాటి సంఘటన అయి ఉండవచ్చని చరిత్రకారుల అభిప్రాయం.

దేవదేవుడి దివ్యాభరణాలను ఆశించి భంగపడ్డవారంతా చరిత్రహీనులుగా మిగిలిపోయారు. ‘నీ పాదములే మాకు నిధినిధానములు’ అనుకొన్న పల్లవరాణిని మాత్రం ప్రతి బ్రహ్మోత్సవాలకూ తలచుకొంటాం. శ్రీనివాసప్రభుదాసానుదాసుడినని ప్రకటించుకొన్న కృష్ణరాయలు తెలుగు భోజుడన్న కీర్తిని సంపాదించుకొన్నాడు. ఆయన మూర్తికి ఆనందనిలయ ఆవరణలో చోటు దక్కింది.
అన్నమాచార్యుడు ఎంత గొప్పగా చెప్పాడు.. ఎదురేది యిక మాకు యెందు చూసినను నీ పదములివి రెండు సంపదలు సౌఖ్యములు!

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement