ఖలీల్‌వాడి, జూన్ 9: కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన యూరియా యాప్‌తో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ‘యాప్ పోవాలె.. కేసీఆర్ బాపు రావాలె’ అని ప్రజలు, రైతులు కోరుకుంటున్నారని తెలిపారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాలులో మంగళవారం రూరల్ నియోజకవర్గ బీఆర్ఎస్ సభ్యత్వ నమోదు సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి వేములతోపాటు బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు ఉమ్మడి జిల్లా ఇన్చార్జి వీజీ గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, బిగాల గణేశ్‌గుప్తా, జీవన్‌రెడ్డి, హన్మంత్ షిండే, జాజాల సురేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వేముల మాట్లాడుతూ.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులు ఒక్క ఫోన్ కాల్‌తో తమకు కావాల్సిన యూరియా బస్తాలను నేరుగా పొలాల వద్దకే ఆటోల్లో తెప్పించుకునే సులభతరమైన సౌకర్యం ఉండేదని గుర్తుచేశారు.
కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన యాప్‌తో రైతులు యూరియా కోసం నానా అవస్థలు పడుతున్నారని ఆవేదన చెందారు. ఈ యాప్‌తో ఒక రైతుకు కేవలం నాలుగు బస్తాల కన్నా ఎక్కువ యూరియా లభించడం లేదని, ఐదెకరాల రైతుకు 20 బస్తాల యూరియా కావాలంటే నాలుగు ప్రాంతాలకు తిరగాల్సిన దుస్థితి ఏర్పడిందని అన్నారు. ఈ యాప్ విధానం దేశంలోనే అత్యుత్తమైనదని మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు చేస్తున్న ప్రకటనలను ఆయన తీవ్రంగా ఖండించారు. మంత్రి తుమ్మల ఒకసారి గ్రామీణ ప్రాంతాలకు వచ్చి రైతులను అడిగితే ఈ యాప్ విధానం ‘బెస్ట్’ కాదని, అది కేవలం ‘వేస్ట్’ అని తేలుతుందని చెప్పారు. యూరియా కొరతతో రైతుల కడుపు మండుతున్నదని, తక్షణమే ఈ యాప్ విధానాన్ని రద్దు చేసి పాత పద్ధతిని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వ హయాంలో రైతులకు నాణ్యమైన 24 గంటల ఉచిత విద్యుత్తు లభించేదని, మోటర్లు కాలిపోయే సమస్యే ఉండేది కాదని వేముల తెలిపారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్తు సరఫరా కేవలం 6 నుంచి 11 గంటలకే పరిమితమైందని ఆగ్రహం వ్యక్తంచేశారు. వ్యవసాయానికి 3 గంటల విద్యుత్తు చాలని కాంగ్రెస్ నేత కోదండరెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తంచేశారు. 3 గంటల కరెంట్ ఇస్తే పొలంలోని చివరి మడికి కూడా నీరందదని తెలిపారు. మూడు గంటల కరెంట్‌తో వ్యవసాయం సాధ్యమని భావిస్తే సీఎం రేవంత్‌రెడ్డి, కోదండరెడ్డి స్వయంగా ఇక్కడికి వచ్చి పొలాలు పారించి చూపించాలని డిమాండ్ చేశారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిరంతర విద్యుత్తు ఇస్తున్నామని అబద్ధాలు చెబుతున్నారని, నేడు పొలాల వద్ద కరెంట్ రెండు,మూడు సార్లు కట్ అవుతుండటంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు తోడు దొంగల్లా మారి తెలంగాణ రైతాంగం నడ్డి విరుస్తున్నాయని వేముల మండిపడ్డారు. రైతులకు ఇచ్చే ఉచిత విద్యుత్తు కనెక్షన్లు, మిషన్ భగీరథ, లిఫ్ట్ ఇరిగేషన్ కనెక్షన్లను కలిపి ప్రత్యేక డిస్కమ్ ఏర్పాటు వెనుక పెద్ద కుట్ర ఉన్నదని ఆరోపించారు. ప్రధాని మోదీ ప్రతిపాదించిన విద్యుత్తు సంస్కరణలు, మోటర్లకు మీటర్లు పెట్టే విధానానికి సీఎం రేవంత్‌రెడ్డి లొంగిపోయారని విమర్శించారు. రాష్ట్రంలో రహదారుల అభివృద్ధి పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం దోపిడీకి తెర లేపిందని దుయ్యబట్టారు. సీఎం రేవంత్‌రెడ్డి హైడ్రా కూల్చివేతలను హిట్లర్ నియంత పాలనతో ఇరాన్ యుద్ధంతో పోల్చుతున్నారని మండిపడ్డారు. హిట్లర్‌కు పట్టిన గతే రేవంత్‌కు పడుతుందని హెచ్చరించారు.