Vaasthu Shastra | రోజూ ఇంట్లో హోమం చేయవచ్చా? లాభం ఏంటి? ఎలా చెయ్యాలి?
– సీహెచ్. కృష్ణకుమారి, మాచర్ల
అగ్నిహోత్రం.. స్త్రీ, పురుష లింగంభేదం లేకుండా ఎవరైనా చేసుకోవచ్చు. దీనికి కులం – మతం – జాతి అన్న భేదం లేదు. నిత్యం ఇంటి మధ్యలో ఉండే హాలులో కానీ, ఈశాన్యం గదిలో కానీ చేయవచ్చు. అంటే హాలుకు కలిసిన ఎల్ ఆకారపు డ్రాయింగ్ రూములో కూడా చేయవచ్చు. ఇంట్లో నిత్యం యజ్ఞం చాలా చిన్నదిగా ఉంటుంది. ఇందుకు యజ్ఞ పాత్ర వాడితే బాగుంటుంది. రాగితో చేసింది అయితే.. మరింత శక్తిమంతం. అయితే ఈ అగ్నిహోత్రాన్ని ముందుగా ఎలా చేయాలో గృహ యజమాని తెలుసుకొని (నేర్చుకుని) నిత్యం ఆచరించవచ్చు. మంత్రబద్ధంగా.. ఆవుపేడ పిడకలు, నెయ్యి, మొన విరగని బియ్యం తదితర అగ్ని సంచారాలను ఉపయోగించి హోమం చేయాల్సి ఉంటుంది. ప్రాచీన కాలం నుంచే ఈ ప్రక్రియ అమలులో ఉంది. నేటికీ కొందరు ఆచరిస్తున్నారు. అద్భుత ఫలితాలనూ పొందుతున్నారు. భారతీయతలోని గొప్పదనాన్ని అర్థంచేసుకుని విదేశీయులు కూడా నిత్యాగ్నిహోత్రులుగా మారుతున్నారు. అగ్నిహోత్రం ద్వారా వెలువడే పొగ, ధూళి గృహ వాతావరణాన్ని శుభ్రం చేస్తాయి. ముఖ్యంగా ఇంట్లో విషవాయువులు, విషపుక్రిములు అంతరించి పోతాయి. శక్తిపొర ఏర్పడుతుంది. యజ్ఞం చేయకముందు.. చేసిన తరువాత వాతావరణంలో వచ్చిన మార్పులపై పరిశోధన చేసినప్పుడు ఇంట్లో ఎన్నో మార్పులు గోచరించాయి. ఈ యజ్ఞ వాతావరణం వల్ల ఇంట్లోని ఆవరణం.. అణువిచ్ఛేద కారణంగా ఏర్పడే ప్రమాదాలను కూడా నిరోధిస్తుందని, ఎలోప్టిక్ పరికరంతో శాస్త్ర వేత్తలు నిర్ధారించారు. అగ్ని శక్తి అనంతం. ఈ విశ్వం పుట్టుకలోనే అగ్ని శక్తి మహాపాత్ర నిర్వహించిన సత్యం.. మన రుషులు ఏనాడో గుర్తించారు. అగ్ని వాడిన విధానాన్ని బట్టి.. అనేక చోట్ల అనేక విధాలుగా దాని శక్తి వెలువడుతుంది. అందుకే.. మన పెద్దలు పంచాగ్నులు, త్రేతాగ్నులు, దావాగ్ని, బడబాగ్ని, జఠరాగ్ని.. అని ఉదహరిస్తూ ఉంటారు. ఏదేమైనా, అగ్నిహోత్రం.. అద్భుత కార్యాచరణం.
తూర్పు సెంటర్లో ద్వారాన్ని వెనక్కి పెట్టొచ్చా? మాది ఇల్లు కాదు.. ఆఫీసు.
– బి. సోమయ్య, చేర్యాల
ఫాయర్ పేరుతో తూర్పు సింహద్వారం పెట్టి, ద్వారాన్ని వెనక్కి తీసుకొని ఇండ్లు, ఆఫీసులు కడుతున్నారు. దాన్ని ఒక అందంగా భావిస్తున్నారు. అలా కట్టేవన్నీ.. శూర్పణఖ ముఖ గృహాల్లాంటివే. ప్రధాన దిశలు అయిన తూర్పు మధ్యభాగం, ఈశాన్యాలు అయిన తూర్పు – ఉత్తర ఈశాన్యాలను కట్చేసి, ఈశాన్యంలో ఖాళీ ప్రదేశాన్ని ఏర్పాటు చేశామని అనుకోవడం.. అశాస్త్రీయం. ప్రకృతి నియమాలకు విరుద్ధం. జన్మగతంగా వచ్చే శారీరక బాధలు ఎలాగూ తప్పవు. అవి చాలవన్నట్టు ఇలా స్వయంకృత సమస్యలు తెచ్చి పెట్టుకోవడమే అవుతుంది. ఇంటికే కాదు.. ఆఫీసుకు, కమర్షియల్ కట్టడాలకూ ఇది పనికిరాదు.
మాకు తూర్పు వైపు రైల్వే ట్రాక్ లోతుగా వెళ్తుంది. అలా ఉండొచ్చా?
– ఎం. శ్రీదేవి, బల్కంపేట
రైల్వేట్రాక్ పక్కన, బస్స్టాండ్ పక్కన, విమానాశ్రయం పక్కన గృహాలు కట్టుకోవడం కమర్షియల్గా గొప్పగా అనిపించినా.. విపరీతమైన శబ్ద కాలుష్యాన్ని భరించాల్సి వస్తుంది. కొన్నిచోట్ల నిరంతరం రైళ్ల రాకపోకలు జరుగుతుంటాయి. ఆ రైళ్ల వేగానికి ఇండ్లు ప్రకంపనలు చెందుతాయి. ఆ ప్రభావం చిన్నపిల్లల మీద తప్పక ఉంటుంది. కొన్నిచోట్ల రైల్వేట్రాక్ కట్ట కూడా మన ఇంటి కంటే ఎత్తుగా ఉండవచ్చు. ట్రాక్ లోతుగా ఉన్నా, అది తూర్పు భాగమే అయినా.. దాని ప్రభావం ఆ ట్రాక్ పక్కన ఉండే ఇండ్లకూ ఉంటుంది. శాస్త్రం ప్రకారం కాలుష్యాలు ఉండేచోట మనుషులు నివసించరాదు.
తేనె తుట్టె కడితే కొన్ని రోజులు ఇల్లు వదిలిపెట్టాలా? చెప్పగలరు.
– పి. పద్మజ, చెన్నూరు
ఇంటికి తేనె తుట్టె కట్టినా. ఇంట్లోకి గబ్బిలం వచ్చిపోయినా.. నష్టమేం లేదు. భవిష్యత్తులో అలా జరగకుండా రక్షణ ఏర్పాటు చేసుకుంటే చాలు. ఇల్లు వదిలి పోవాల్సిన అవసరం లేదు. ఎత్తయిన బాల్కనీలకు, అడ్డు బీములకు తేనెటీగలు తుట్టెలను కట్టడం సహజం. ముఖ్యంగా మనుషుల సంచారం లేని ఎత్తయిన ప్రదేశాలను చూసి.. తుట్టెలను కడుతుంటాయి. మీరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా తీయించి, శుద్ధిచేసి.. ఇంటిని యథావిధిగా వాడుకోవచ్చు. ఇంట్లోకి గబ్బిలం వచ్చినా ఇంటిని శుభ్రం చేసుకొని వాడుకోవచ్చు. ఎవరో చెబితే మనం భయ పడాల్సిన అవసరంలేదు.
మీ ప్రశ్నలు పంపాల్సిన చిరునామా
‘బతుకమ్మ’, నమస్తే తెలంగాణ దినపత్రిక,
ఇంటి.నం: 8-2-603/1/7,8,9, కృష్ణాపురం.
రోడ్ నం: 10, బంజారాహిల్స్, హైదరాబాద్ – 500034.
– సుద్దాల సుధాకర్ తేజ
suddalavasthu@gmail.com
Cell: 7993467678
కోడలైనా, అల్లుడైనా కొత్తగా పెండ్లి చేసుకొని ఇంట్లోకి వస్తే, ఆ కుటుంబంలో ఏవైనా మార్పులు వస్తాయా?
మా వ్యవసాయ భూమిలో గోబర్ గ్యాస్ బావి ఉంది. అది ఉండొచ్చా, ఏ దిక్కులో ఉండాలి?