వాషింగ్టన్: మంటలు అంటుకుని కాలిపోతున్న కారులో పెంపుడు కుక్క చిక్కుకున్నది. ఒక పోలీస్ అధికారి సాహసం చేసి దానిని కాపాడారు. నెటిజన్లకు హీరో అయ్యారు. అమెరికాలోని కొలరాడోలో ఈ ఘటన జరిగింది. జనవరి 22న డగ్లస్ కౌంటీలో ఒక కారుకు మంటలంటుకున్నాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చారు. అప్పటికే కారు నుంచి దట్టంగా పొగలు వస్తున్నాయి. అందులో తన కుక్క చిక్కుకున్నదని కారు నుంచి బయటపడిన యజమాని పోలీసులకు తెలిపాడు.
మైఖేల్ గ్రెగోరెక్ అనే పోలీస్ అధికారి వెంటనే స్పందించారు. తన వద్ద ఉన్న లాఠీతో కారు పక్కవైపు, వెనుక ఉన్న అద్దాన్ని పగులగొట్టారు. దీంతో పెంపుడు కుక్క హాంక్ తన ముఖాన్ని బయట పెట్టింది. దానిని బయటకు లాగేందుకు యజమాని ప్రయత్నించాడు. అయితే కారు నుంచి వస్తున్న పొగ వల్ల ఊపిరి ఆడక వెంటనే దూరంగా వెళ్లిపోయాడు.
కాగా, ఆ కుక్కను కాపాడేందుకు పోలీస్ అధికారి మైఖేల్ గ్రెగోరెక్ మరింతగా ప్రయత్నించారు. దాని వద్దకు వెళ్లి కొంత శ్రమించి కారు నుంచి బయటకు తీశారు. మంచు ఉన్న వైపు ఆ కుక్కను విడిచిపెట్టారు. కాగా, ఆయన బాడీ కెమేరాలో ఇదంతా రికార్డు అయ్యింది. దీంతో డగ్లస్ కౌంటీ పోలీసులు దీనిని తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
మరోవైపు ఈ వీడియో వైరల్ అయ్యింది. కాలుతున్న కారు నుంచి దట్టమైన పొగలు, విషవాయువులు వస్తున్నప్పటికీ సాహసించి అందులో ఉన్న కుక్కను కాపాడిన పోలీస్ అధికారి మైఖేల్పై నెటిజన్లు ప్రశంసలు కురిపించారు. అయితే కుక్క స్థానంలో ఎవరు ఉన్నప్పటికీ కాపాడటం తన కర్తవ్యమని ఆ పోలీస్ అధికారి పేర్కొన్నారు.