భారీ తుఫానులు వచ్చే సమయంలో నిర్మానుష్యమైన ప్రాంతాల్లోనో, పొలాల్లోనో పిడుగులు పడతాయని అనుకుంటాం. కానీ పిడుగులు ఎక్కడైనా పడొచ్చు. మనం ఇంట్లో ఉన్న సమయంలో కూడా వచ్చి మన నెత్తినే పడొచ్చు. సరిగ్గా ఇలాంటి ఘటనే యూకేలో వెలుగు చూసింది. ఆక్స్ఫర్డ్షైర్ ప్రాంతంలో నివశించే ఎయిడెన్ రోవన్ తన ఇంటి లివింగ్ రూంలో కూర్చొని ప్లే స్టేషన్ గేమ్స్ ఆడుకుంటున్నాడు.
సడెన్గా ఏమైందో తెలియదు కానీ.. అతనికి కొంత దూరంలో పెద్ద చప్పుడు వినిపించింది. అదే సమయంలో తన శరీరం అంతా బరువెక్కుతున్న భావన కలిగింది. దీంతో అక్కడే కుప్పకూలిపోయిన అతన్ని కుటుబ సభ్యులు గమనించి, వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ అతనికి రకరకాల పరీక్షలు చేసిన వైద్యులు.. రోవన్పై పిడుగు పడిందని తేల్చారు. అయితే అతను ఇంట్లో ఉన్నాడని చెప్పడంతో.. అతనిపై పిడుగు ఎలా పడి ఉండొచ్చో వివరించారు.
లివింగ్ రూం సోఫాలో కూర్చొని గేమ్ ఆడుతుండగా.. బయట భారీగా ఉరుములు, మెరుపులు వస్తున్నాయని రోవన్ వెల్లడించాడు. అప్పుడే సడెన్గా చాలా పెద్ద చప్పుడు వినిపించిందని, కాసేపటికే శరీరమంతా బరువెక్కిందని, అదే టైంలో ఒళ్లంతా బాగా వేడెక్కినట్లు అనిపించిందని డాక్టర్లకు చెప్పాడు. అతని కుడిచేతిపై కాలిన గాయాలు కూడా అవడం గమనార్హం. బయట నీళ్లపై పడిన పిడుగు అక్కడి నుంచి రిఫ్లెక్ట్ అయ్యి, కిటికీ గుండా లోపలకు వచ్చి అతనికి తగిలినట్లు డాక్టర్లు భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆ కుటుంబానికి కూడా చెప్పారు.