నవీపేట,నవంబర్ 1: నవీపేట మండలం మిట్టాపూర్ శివారులో దారుణం చోటు చేసుకుంది. తల, చేయి లేని గుర్తు తెలియన మహిళ మృతదేహం లభ్యం కావడం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. మహిళను అతి కిరాతకంగా హతమార్చిన దుండుగులు మృతదేహాన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. తల, చేయి లేని వివస్త్రగా ఉన్న మహిళ మృతదేహాన్ని శనివారం ఉదయం చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషాద ఘటన వెలుగు చూసింది. నవీపేట మండలంలో పది రోజుల వ్యవధిలోనే ఇద్దరు మహిళలు దారుణంగా హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది.
రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ ఘటనతో స్థానికులతోపాటు పోలీసులు ఉలిక్కిపడ్డారు. సీపీ సాయి చైతన్య, ఏసీపీ రాజా వెంకటరెడ్డి, నిజామాబాద్ నార్త్ రూరల్ సీఐ శ్రీనివాస్ హుటాహుటిన ఇక్కడకు చేరుకుని వివరాలు ఆరా తీశారు. హంతకులను పట్టుకునేందుకు 12 ప్రత్యేక బృందాలను రంగంలోకి దించారు. అలాగే డాగ్‌స్కాడ్, క్లూస్ టీమ్‌ను రప్పించి ఆనవాళ్లు సేకరించేందుకు యత్నించగా ఫలితం లేకపోయింది. మరోవైపు కనిపించకుండా పోయిన మృతురాలి తల కోసం పోలీసులు డ్రోన్ సాయంతో అటవీ ప్రాంతంలో వెతికినా లభ్యం కాలేదు.
మృతురాలు ఎవరనేది గుర్తించడంపై పోలీసులు ప్రస్తుతానికి ప్రధానంగా దృష్టి సారించారు. బాధితురాలు ఎవరన్నది తెలిస్తే నిందితులను పట్టుకోవడం సులువవుతుందనే భావనతో ఈ దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. నిజామాబాద్ చుట్టుపక్కల జిల్లాలతో పాటు మహారాష్ట్ర సరిహద్దులోని పోలీసుస్టేషన్ల పరిధిలో మిస్సింగ్ అయిన మహిళల వివరాలు సేకరిస్తున్నారు. మృతురాలిని గుర్తిస్తే కేసును కొలిక్కి తేవడం తేలికవుతుందన్న భావనతో దర్యాప్తు ముమ్మరం చేశారు. మృతురాలి ఆనవాళ్లతో కూడిన పోస్టర్లను నవీపేట, బోధన్, ఆర్మూర్, నాందేడ్ తదితర ప్రాంతాల్లోని ప్రధాన కూడళ్లలో అతికించారు. మరోవైపు, వివాహేతర సంబంధమే మహిళ హత్యకు కారణమై ఉంటుందని పోలీసులు అనుమాస్తున్నారు. జీపీ సెక్రెటరీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు మృతదేహాన్ని జిల్లా దవాఖానకు తరలించారు.
పోలీసుల కథనం ప్రకారం.. 25 నుంచి 40 ఏండ్ల వయ స్సు ఉండే గుర్తు తెలియని మహిళ పట్ల దుండగులు కిరాతకంగా ప్రవర్తించినట్లు మృతదేహాన్ని చూస్తే తెలుస్తున్నది. వేరే ప్రాంతంలో ఆమెను వివస్త్రను చేసి అత్యాచారం చేసిన కిరాతకులు.. అనంతరం ఆమె ను చిత్రహింసలు పెట్టారు. శరీరం నుంచి తలను వేరు చేయడంతో పాటు కుడిచేయి మణికట్టు వరకు, ఎడమ చేతి వేళ్లను నరికేశారు. ఆయా శరీర భాగాలు లేకుండా ఉన్న మృతదేహాన్ని తీసుకొచ్చి మిట్టాపూర్ శివారులోని బాసర రహదారికి పక్కన తొగరి మల్లయ్య గుట్ట, బోప్ప సముద్రం వెళ్లే దారిలో గల మైదనంలో పడేశారు. గ్రామానికి చెందిన రైతు సతీశ్ శనివారం ఉదయం అటు వెళ్లగా వివస్త్రగా పడి ఉన్న మహిళ మృతదేహాన్ని గమనించి పోలీసులకు సమాచారమిచ్చారు.
నవీపేట మండలంలో పది రోజుల వ్యవధిలో ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురికావడం స్థానికంగా కలకలం రేపింది. గత నెల 23న మద్దెపల్లి గ్రామానికి చెందిన శ్యామల లక్ష్మి (43)ని దుండగులు నాగేపూర్ శివారులో హత్య చేశారు. అనంతరం మృతదేహంపై పోట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. ఈ ఉదంతం మరువక ముందే మరో మహిళ అతికిరాతకంగా హత్యకు గురైంది. గుర్తు తెలియని మహిళపై అత్యాచారం చేసి అతి కిరాతకంగా తల, చేతులు నరికి మిట్టాపూర్ శివారులో పడేసిన ఉదంతం బయటకు రావడంతో ప్రజలు ఉలిక్కి పడ్డారు. లక్ష్మిని హత్య చేసిన నిందితులను పోలీసులు పట్టుకోక ముందే, మరో మహిళ అతి కిరాతకంగా హతమవ్వడంతో పోలీసుల పనితీరుపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.