దిగ్గజాలకే దిగ్గజం.. రాకెట్ పట్టిన రారాజు.. చాంపియన్లకే చాంపియన్.. టెన్నిస్ మేరునగధీరుడు రోజర్ ఫెదరర్ సుదీర్ఘ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. గంటకు 230 కిలోమీటర్ల వేగంతో సర్వ్ చేస్తూ.. 24 ఏండ్ల పాటు కోర్టులో ప్రత్యర్థుల పాలిట సింహస్వప్నంలా నిలిచిన ఈ స్విట్జర్లాండ్ దిగ్గజం 41 ఏండ్ల వయసులో ప్రొఫెషనల్ టెన్నిస్‌కు రిటైర్మెంట్ చెప్పాడు. 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్.. 103 ఏటీపీ టూర్ టైటిల్స్.. రెండు ఒలింపిక్ పతకాలు.. ఇలా లెక్కకు మిక్కిలి ఘనతలు తన పేరిట రాసుకున్న ఫెదరర్.. లావెర్ కప్ తర్వాత కెరీర్‌కు స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించాడు. విశ్వవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన
ఆటగాడిగా గుర్తింపు సాధించిన ఫెదరర్ నిర్ణయంపై యావత్ క్రీడాలోకం స్పందించింది. భవిష్యత్తు మరింత బాగుండాలని ఆకాంక్షించింది!
లండన్: టెన్నిస్ దిగ్గజం రోజర్ ఫెదరర్ ప్రొఫెషనల్ కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. మోకాలి గాయంతో సతమతమవుతున్న ఫెదరర్ లావెర్ కప్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్‌కు దూరం కానున్నట్లు గురువారం వెల్లడించాడు. ఈ నెల 23 నుంచి లండన్ వేదికగా జరుగనున్న ఏటీపీ టోర్నీలో చివరిసారిగా బరిలోకి దిగనున్నట్లు పేర్కొన్నాడు. ఈ మేరకు సామాజిక మాధ్యమాల ద్వారా సుదీర్ఘ లేఖ పంచుకున్నాడు. తన కెరీర్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలిపిన రోజర్.. భవిష్యత్తులో మరికొన్ని రోజులు టెన్నిస్ ఆడే అవకాశం ఉన్నా.. ఏటీపీ, గ్రాండ్‌స్లామ్ పోటీల్లో బరిలోకి దిగనని స్పష్టం చేశాడు. టెన్నిస్ తనకు చాలా ఇచ్చిందన్న ఫెదరర్.. ప్రపంచంలో తనంత అదృష్టవంతుడు మరొకరు లేరని అభివర్ణించాడు. గ్రాండ్‌స్లామ్ విజయాలు, ఒలింపిక్ పతకాలు, కెరీర్లో ఎత్తు పల్లాలు, కుటుంబ సభ్యుల సహకారం, గాయాలు ఇలా ప్రతి ఒక్క అంశాన్ని చర్చించిన ఫెదరర్.. ఇన్నాళ్లు అండగా నిలిచిన అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపాడు. 1998లో ప్రొఫెషనల్ కెరీర్ ప్రారంభించిన 41 ఏండ్ల ఫెదరర్.. 24 ఏండ్ల సుదీర్ఘ కెరీర్లో లెక్కకు మిక్కిలి ఘనతలు సాధించాడు.
ఎనిమిది సార్లు వింబుల్డన్, ఆరుసార్లు ఆస్ట్రేలియా ఓపెన్, ఐదుసార్లు యూఎస్ ఓపెన్, ఒకసారి ఫ్రెంచ్ ఓపెన్.. ఇలా 20 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ ఖాతాలో వేసుకొని పురుషుల సింగిల్స్‌లో ఈ ఘనత సాధించిన తొలి ఆటగాడిగా చరిత్రకెక్కిన రోజర్.. గతేడాది వింబుల్డన్ తర్వాత కోర్టులో అడుగుపెట్టలేదు. ఐదు సీజన్ల పాటు ప్రపంచ నంబర్‌వన్ ర్యాంకర్‌గా కొనసాగిన ఫెదరర్.. మోకాలి గాయం తిరగబెట్టడం ఇక పునరాగమనం కష్టమని భావించి కెరీర్‌కు ఫుల్స్టాప్ పెడుతున్నట్లు ప్రకటించాడు. మహిళల సింగిల్స్‌లో రెండు దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగిన అమెరికా స్టార్ సెరెనా విలియమ్స్ కూడా దాదాపు కెరీర్‌ను ముగించగా.. ఇప్పుడా బాటలో మరో దిగ్గజం తరలి వెళ్లింది. ఓపెన్ ఎరాలో టెన్నిస్‌కు వన్నెతెచ్చిన స్టార్ ఆటగాడు రిటైర్మెంట్ ప్రకటించడంపై యావత్ క్రీడాలోకం స్పందించింది. రాబోయే తరాలకు అతడు ఆదర్శప్రాయుడని వేనోళ్ల శ్లాఘించింది.
ఫెదరర్ కెరీర్ విశేషాలు
పేరు: రోజర్ ఫెదరర్
దేశం: వాల్బెల్లా, స్విట్జర్లాండ్
పుట్టిన తేదీ: ఆగస్టు 8, 1981, బాసెల్
ఎత్తు: 6.1 అడుగులు
ప్రొఫెషనల్‌గా మారిన సంవత్సరం: 1998
ప్రైజ్‌మనీ: 13,05,94,339
యూఎస్ డాలర్లు
కెరీర్ టైటిళ్లు: 103 (ఓపెన్ ఎరాలో రెండో అత్యధిక విజయాలు)
టూర్ లెవెల్ విజయాలు: 1251
అత్యుత్తమ ర్యాంకింగ్: 1 (ఫిబ్రవరి 2, 2004)
బిజీంగ్ (2008): స్వర్ణం
లండన్ (2012): రజతం
డేవిస్ కప్: 2014
హాప్‌మన్ కప్: 2001, 2018,2019
టెన్నిస్ నాకు చాలా ఇచ్చింది. ఒక్కోటి గుర్తు చేసుకుంటూ పోతే ఎన్నో గొప్ప క్షణాలు, మరెన్నో మధురానుభూతులు మైదానంతో ముడిపడి ఉన్నాయి. బాల్‌బాయ్‌గా కెరీర్ ప్రారంభించినప్పుడు ఇక్కడి వరకు వస్తానని అనుకోలేదు. కలలో కూడా ఊహించని ఎత్తులకు చేరాననుకుంటున్నా. నా కెరీర్‌కు సహకరించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. నా కుటుంబ సభ్యులు, కోచ్‌లు, ప్రత్యర్థులు, ప్రపంచవ్యాప్త అభిమానులందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుతున్నా. గత కొన్నాళ్లుగా మోకాలి గాయం ఇబ్బంది పెడుతున్నది. దాన్ని అధిగమించి తిరిగి మైదానంలో అడుగుపెట్టగలనని అనుకున్నా.. వరుస సర్జరీల కారణంగా అది సాధ్యపడలేదు. అందుకే కెరీర్‌కు వీడ్కోలు పలుకుతున్నా. భవిష్యత్తులోనూ టెన్నిస్‌తో అనుబంధం కొనసాగిస్తా.
-రోజర్ ఫెదరర్
ఫెదరర్ గ్రాండ్‌స్లామ్ టైటిల్స్
టెన్నిస్‌కు వన్నెతెచ్చిన ఫెదరర్: మంత్రి కేటీఆర్
‘అద్భుతమైన ఆటతీరుతో అంతకుమించి హుందాతనంతో గత కొన్నేండ్లుగా టెన్నిస్‌కు వన్నె తీసుకొచ్చావు. అచ్చెరువొందే నైపుణ్యంతో ప్రపంచాన్ని అలరించిన రోజర్‌కు ప్రత్యేక కృతజ్ఞతలు. మీ సుదీర్ఘ అసమాన కెరీర్‌కు వీడ్కోలు వేళ శుభాకాంక్షలు
అలవాట్లు ఎప్పుడూ రిటైర్ కావు: సచిన్ టెండూల్కర్
ఫెదరర్ నీది అద్భుతమైన కెరీర్. నీ బ్రాండ్ టెన్నిస్‌తో మేము ప్రేమలో పడిపోయాం. నీ ఆట మాకు నెమ్మదిగా ఒక అలవాటుగా మారింది. అలవాట్లు ఎప్పుడూ రిటైర్ కావు, అవి మనలో భాగం. అద్భుతమైన క్షణాలను అందించినందుకు కృతజ్ఞతలు’
ప్రియ ప్రత్యర్థి: రఫెల్ నాదల్
‘డియర్ రోజర్ నా స్నేహితుడా, ప్రియ ప్రత్యర్థి. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదు. నాతో పాటు ప్రపంచంలోని క్రీడాభిమానులకు ఇది మంచి రోజు కాదు. ఇన్నేండ్లు నీతో కలిసి ఆడటం గర్వంగా భావిస్తున్నాను. కోర్టు లోపల, బయట నీతో ఎన్నో చిరస్మరణీయ అనుభవాలు ఉన్నాయి.