e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, May 6, 2021
Advertisement
Home News సమరానికి టీఆర్‌ఎస్‌ సై

సమరానికి టీఆర్‌ఎస్‌ సై

 • నాగార్జునసాగర్‌లో టీఆర్‌ఎస్‌ దూకుడు
 • పోలింగ్‌కు ముందే గుబాళిస్తున్న గులాబీ
 • బీసీల సాగర్‌లో గోదారంత అభిమానం
 • కేసీఆర్‌ పాలనకు అండగా నిలుస్తున్న బీసీలు, రైతులు
 • ఏ సీఎం మాత్రం ఇంతకన్నా ఎక్కువ చేస్తారంటూ ప్రచారం
 • అక్కున చేర్చుకుంటున్న ఉద్యోగులు
 • నేడో, రేపో అభ్యర్థి ప్రకటన.. బీసీకే టీఆర్‌ఎస్‌ టికెట్‌!
 • బరిలోకి దిగకముందే కాడెత్తేస్తున్న ప్రత్యర్థులు
 • జాడలేని కాంగ్రెస్‌కు ఓటేస్తే ఏం లాభమంటున్న జనం
 • గత ఎన్నికల్లో బీజేపీకి వచ్చింది 2,600 ఓట్లే!
 • పీఆర్సీపై ఉద్యోగుల హర్షాతిరేకం

నాగార్జునసాగర్‌లో ఎవరు గెలుస్తారు? ఓటర్ల నాడి ఎలా ఉంది? నామ్‌ కే వాస్తే జాతీయ పార్టీలు, టీఆర్‌ఎస్‌ మధ్య ఎలాంటి పోటీ నెలకొని ఉంది? ప్రజలు నినాదాలను నమ్ముతున్నారా? పనిని చూస్తున్నారా? రెండు ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ఘన విజయం సాధించిన తరుణంలో.. వచ్చే నెల 17న జరిగే సాగర్‌ ఉప ఎన్నిక కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రజలనాడి తెలుసుకొనేందుకు నమస్తే తెలంగాణ ప్రతినిధులు గత కొన్ని రోజులుగా క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించినపుడు, ఆసక్తికరమైన విషయాలు వెలుగుచూశాయి. నాగార్జునసాగర్‌లో ప్రస్తుతం నెలకొని ఉన్న వాస్తవ పరిస్థితిపై ‘నమస్తే తెలంగాణ’ అందిస్తున్న గ్రౌండ్‌ రిపోర్ట్‌.

నాగార్జునసాగర్‌ పోరుకు సై అంటున్నది. పోలింగ్‌కు ముందే టీఆర్‌ఎస్‌కు విజయసంకేతాలు అందుతున్నాయి. కృష్ణమ్మ తీరాన ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్ల ఆదరాభిమానం పరవళ్లు తొక్కుతున్నది. ఏ గ్రామానికి వెళ్లినా.. ఏ మండలానికి వెళ్లినా.. నినాదాలకు పరిమితమయ్యే నేతలు కాకుండా.. నిజమైన పనులు చేసే నేతలను గెలిపించుకొంటామని తీర్మానాలు చేస్తున్నారు. నియోజకవర్గంలో అధికంగా ఉన్న బీసీ ఓటర్లు.. నియోజకవర్గం తమ చేజారిపోవద్దని బలంగా కోరుకుంటున్నారు. రైతులు, ఉద్యోగులు టీఆర్‌ఎస్‌కు అండగా నిలుస్తామని తేల్చిచెప్తున్నారు. ప్రత్యర్థుల ప్రజాభిప్రాయ సేకరణల్లోనూ టీఆర్‌ఎస్‌ వైపే ప్రజానాడి స్పష్టంగా కనిపిస్తున్నది నామ్‌కే వాస్తే జాతీయ పార్టీలు.. టీఆర్‌ఎస్‌ మధ్య పోటీ నామమాత్రంగానే ఉంటుందని చెప్తున్నాయి.

నాగార్జునసాగర్‌ నుంచి నమస్తే తెలంగాణ నల్లగొండ ప్రతినిధి: నాగార్జునసాగర్‌ పోరు ఆసక్తికరంగా మారింది. ఇక్కడ బీసీ ఓటర్ల సంఖ్య ఎక్కువ. కారణాలేవైనా నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆ వర్గానికి ఎక్కువగా రాలేదు. తెలంగాణ వాదానికి ఆకర్షితుడై, సీపీఎం వైఖరిని ధిక్కరించిన నోముల నర్సింహయ్యకు టీఆర్‌ఎస్‌ టిక్కెట్టిచ్చి నిలబెట్టిన తర్వాతే సాగర్‌ బడుగుల చేజిక్కింది. తెలంగాణ ఆవిర్భావం తర్వాత జరిగిన తొలి ఎన్నికల్లో ఇక్కడి నుంచి కాంగ్రెస్‌ నేత జానారెడ్డి గెలుపొందగా, 2018 ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నర్సింహయ్య చేతిలో ఆయన పరాజయం పాలయ్యారు. ఇప్పుడు ఈ నియోజకవర్గంపై పట్టు నిలుపుకోవాలని, దీన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ చేజారనివ్వకూడదని బీసీలు పట్టుదలగా ఉన్నారు. ‘ఇప్పటికే మేం పలుమార్లు అవకాశం కోల్పోయాం. ఇప్పుడిక విడిచిపెట్టే సమస్యే లేదు. పార్టీలతో సంబంధం లేదు. ఎవరు మమ్మల్ని ఆదరిస్తే, వారికే ఓటేస్తాం’ అని బీసీలు ఘంటాపథంగా చెప్తున్నారు. గ్రామాలు, మండలాలవారీగా సమావేశాలు పెట్టుకొని మరీ బీసీ అభ్యర్థినే ఆదరించాలని తీర్మానాలు చేసుకొంటున్నారు. అందరి అనుమానాలు, అపోహలను పటాపంచలుచేస్తూ, రెండు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాలను ఇప్పటికే కైవసం చేసుకున్న టీఆర్‌ఎస్‌.. నాగార్జునసాగర్‌లో బీసీ అభ్యర్థినే నిలబెట్టాలని ఇప్పటికే సూత్రప్రాయ నిర్ణయం తీసుకున్నది. దివంగత నోముల నర్సింహయ్య కుమారుడు భగత్‌కు ఇవ్వాలా లేక మరొకరికా అన్నదానిపై అధిష్ఠానం తుది నిర్ణయం తీసుకోలేదు.

నేడో రేపో దీనిపై ప్రకటన వెలువడే అవకాశమున్నది. కాంగ్రెస్‌ చాలా ముందుగా తమ అభ్యర్థిని ప్రకటించినప్పటికీ, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఎవరో తేలనప్పటికీ, బీసీలు మాత్రం టీఆర్‌ఎస్‌కే తమ మద్దతు అని తీర్మానాలు చేస్తున్నారు. బీసీ సంఘాల్లోని ప్రముఖలు, గ్రామాల్లోని కులపెద్దలు మరోసారి టీఆర్‌ఎస్‌ నిలబెట్టే బీసీ అభ్యర్థినే గెలిపించుకొంటామన్న విశ్వాసాన్ని వ్యక్తంచేస్తున్నారు. సీఎం కేసీఆర్‌ ఇస్తున్న అవకాశాన్ని సద్వినియోగంచేసుకోవాలన్న సంకల్పంతో కనిపిస్తున్నారు. ఈసారి ఒకవేళ బీసీ అభ్యర్థి ఓడితే మళ్లీ ఎన్నాళ్లకో గానీ తమ గురించి ఆలోచించే వారుండరన్న భావనలో ఉన్నారు. సామాజిక న్యాయం కోసం పాటుపడుతున్న టీఆర్‌ఎస్‌.. బీసీ అభ్యర్థిని బరిలో నిలిపితే తప్పకుండా గెలిపించుకుంటామని గతంలో స్థానిక పొలిటికల్‌ జేఏసీ చైర్మన్‌గా వ్యవహరించిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు చింతల వెంకటేశ్వర్లు చెప్తున్నారు. బీసీ ఉపాధ్యాయ సంఘం నేత రాపోలు పరమేశ్‌ మాట్లాడుతూ 2018లో టీఆర్‌ఎస్‌ బీసీలకు టికెట్టు ఇస్తే సమిష్టిగా గెలిపించుకున్నామని, ఈసారి కూడా ప్రభుత్వానికి మద్దతుగా నిలుస్తామని చెప్పారు.

రంగంలోకి టీఆర్‌ఎస్‌ క్యాడర్
మరోవైపు టీఆర్‌ఎస్‌ యంత్రాంగం రంగంలోకి దిగిపోయింది. ప్రతి ఊర్లోనూ టీఆర్‌ఎస్‌ దళాలు పర్యటిస్తూ, అత్యధిక మెజారిటీ సాధించేందుకు ప్రయత్నిస్తున్నాయి. సాగర్‌లో మరే పార్టీకీ లేనంత పటిష్ఠ యంత్రాంగం టీఆర్‌ఎస్‌కే ఉన్నది. నియోజకవర్గ పరిధిలో గుర్రంపోడు, పెద్దవూర, తిరుమలగిరిసాగర్‌, హాలియా, నిడమనూరు, త్రిపురారం మండలాలు పూర్తిగా, మాడ్గులపల్లి మండలంలోని కొన్ని గ్రామాలు ఉన్నాయి. 2018 ఎన్నికల్లో ఒక త్రిపురారం మండలంలోనే 235 ఓట్లు కాంగ్రెస్‌కు అధికంగా వచ్చాయి. మిగతా మండలాల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్యకు స్పష్టమైన మెజారిటీ వచ్చింది. ఆ తర్వాత జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ మంచి విజయాలు సాధించింది. హాలియా, నందికొండ మున్సిపాలిటీలను ఏకపక్షంగా గెలిచింది.

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి రుచి
పూర్వపు చలకుర్తి, ప్రస్తుత నాగార్జునసాగర్‌ నుంచి ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ప్రాతినిధ్యం వహించిన జానారెడ్డి కీలక సమస్యలకు పరిష్కారం చూపలేకపోయారన్నది బలమైన ఆరోపణ. ఇదే అంశం గత ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల విజయానికి తోడ్పడిందన్నది వాస్తవం. స్వరాష్ట్రంలో కేసీఆర్‌ సీఎం అయ్యాకే ఇక్కడ అభివృద్ధికి దారులు పడ్డాయన్నది తిరుగులేని సత్యం. నోముల నర్సింహయ్య కృషికి సీఎం కేసీఆర్‌, కేటీఆర్‌ సంపూర్ణ సహకారానికి జిల్లా మంత్రి జగదీశ్‌రెడ్డి చొరవ తోడవడంతో దశాబ్దాలుగా స్థానిక పాలకమండలి లేని నాగార్జునసాగర్‌ నందికొండ మున్సిపాలిటీగా, మేజర్‌ పంచాయితీగా ఉన్న హాలియా మున్సిపాలిటీగా మారాయి. మారుమూల గిరిజన తండాలతో కూడిన తిరుమలగిరి(సాగర్‌) మండలాన్ని కొత్తగా ఏర్పాటుచేసి పాలనాసౌలభ్యాన్ని కల్పించారు. గిరిజనతండాలన్నీ పంచాయతీలుగా అవతరించాయి. అనుముల మండలంలో కాకతీయుల కాలం నాటి జాలుకాలువకు నాలుగు కోట్ల నిధులతో ఆధునీకరణ పనులను పూర్తిచేశారు. హాలియాలో మినీ స్టేడియం నిర్మాణానికి కృషి జరిగింది. త్రిపురారంలో సబ్‌మార్కెట్‌యార్డ్‌ను 84 లక్షల నిధులతో చేపట్టారు. రాజవరం మేజర్‌ కాలువను ఆధునీకరించి చివరి ఆయకట్టుకు నీరిస్తున్నారు. ‘గొల్లకుర్మలకు గొర్రెలు, మత్య్సకారులకు చేప పిల్లలు, సబ్సిడీపై వలలు, వాహనాలు వంటి వృత్తిదారుల సంక్షేమం ఎన్నడూ లేనంతగా టీఆర్‌ఎస్‌ పాలనలోనే జరిగింది. 24 గంటల ఉచిత విద్యుత్తు, రైతుబంధు, రైతుబీమా, రుణమాఫీ, పెన్షన్లు, కేసీఆర్‌ కిట్‌, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌ వంటి పథకాల లబ్ధిదారులు కూడా ఇంటికొక్కరు ఉన్నారు. ఇవన్నీ కండ్ల ముందు కనిపిస్తున్న అక్షర సత్యాలే’ అని గుర్రంపోడు యువకుడు చంద్రశేఖర్‌రెడ్డి విశ్లేషించారు. స్వరాష్ట్రంలోనే ఇవన్నీ సాధ్యమవుతున్నాయని, అలాంటి ప్రభుత్వానికి అండగా నిలవాల్సిన బాధ్యత సాగర్‌ ప్రజలపై ఉన్నదని ఆయన చెప్పారు.

రికార్డుకోసమేనా జానారెడ్డి పోటీ
‘ఇప్పటికీ ఏడుసార్లు గెలిపించారు.. ఇంకొక్కసారి గెలిపిస్తే రాష్ట్రంలోనే నాది ఎక్కువసార్లు గెలిచిన రికార్డు అవుతది. ఇంక మల్ల పోటీ కూడా చెయ్యను.. ఈ ఒక్కసారి గెలిపించండి’ అని జానారెడ్డి వేడుకొంటున్నారు. అత్యధిక కాలం మంత్రిగా కొనసాగినా.. చేశానని చెప్పుకోవడానికి అభివృద్ధి అంశాలు లేకపోవడం జానారెడ్డికి ఇబ్బందికరంగా మారింది. తాజాగా జానారెడ్డి గెలవడం వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదన్న చర్చ వినిపిస్తున్నది. కాంగ్రెస్‌ ఇప్పటికే కృశించిపోయింది. కేంద్రంలోకానీ, రాష్ట్రంలో కానీ అధికారంలో లేదు.. ఇప్పట్లో వచ్చే అవకాశం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో జానారెడ్డి గెలిచినా ఈ ప్రాంతానికి ప్రయోజనం ఉండదనేది ప్రజల్లో వ్యక్తమవుతున్న అభిప్రాయాలు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్‌ అభ్యర్థినే మరోసారి ఇక్కడ గెలిపించుకుంటే అభివృద్ధి కొనసాగుతుందని హాలియాకు చెందిన బసిరెడ్డి వెంకట్‌రెడ్డి అనే యువకుడు అంటున్నారు. నోముల నర్సింహయ్య రెండేండ్లే ఎమ్మెల్యేగా ఉన్నా సీఎం కేసీఆర్‌ సహకారంతో కీలక సమస్యలకు పరిష్కారాన్ని చూపే ప్రయత్నంచేశారు. విద్యుత్తు సబ్‌స్టేషన్లు, గురుకుల పాఠశాలలు, పాలిటెక్నిక్‌ కాలేజీ, కమలానెహ్రు దవాఖానలో అత్యాధునిక వైద్యసేవలు లభించాయని తిరుమలగిరికి చెందిన బాలునాయక్‌ చెప్పుకొచ్చారు. హుజూర్‌నగర్‌ ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ను గెలిపించుకున్నట్టే సాగర్‌లో కూడా టీఆర్‌ఎస్‌ గెలుపునే కోరుకుంటున్నామన్నారు. దీంతో ఇక్కడ జానారెడ్డి కలలు కంటున్నట్లుగా ఎనిమిదోసారి గెలిచి రికార్డు సాధించడం అసాధ్యమని తేలుతున్నది.

ముందస్తు అభిప్రాయాలూ టీఆర్‌ఎస్‌వైపే
నాగార్జునసాగర్‌లో ప్రజల అభిప్రాయం ఎటువైపు ఉన్నదన్న అంశంపై అన్ని పార్టీలూ వేర్వేరు ఏజెన్సీలతో ప్రజాభిప్రాయసేకరణ జరిపాయి. టీఆర్‌ఎస్‌ చేపట్టిన అభిప్రాయ సేకరణలో సాగర్‌ ప్రజలు అధికార పార్టీవైపు ఏకపక్షంగా మొగ్గు చూపుతున్నారని తెలిసింది. ఇతర పార్టీలు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణల్లోనూ 50-51 శాతం ప్రజలు టీఆర్‌ఎస్‌ వైపే మొగ్గుచూపుతున్నారని రావడంతో ఆయా పార్టీలు ఎన్నికలకు ముందే కాడి పారేశాయి. టీఆర్‌ఎస్‌తో పోలిస్తే జానారెడ్డి కనీసంగా 12 నుంచి 15 శాతం వెనుకబడి రెండోస్థానంలో కనిపిస్తున్నారు. మాలమహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెన్నమల్ల సత్యం స్పందిస్తూ.. జానారెడ్డి ఇన్నాళ్లు చేసిందేమీ లేదు, ఆ పార్టీ అక్కడా ఇక్కడా అధికారంలో లేదు. ఓటు కూడా వృథా అవుతుంది అబివృద్ధి జరగాలంటే మనమంతా టీఆర్‌ఎస్‌ వెంటే నిలవాలని అన్నారు.

ఖాళీ అయిన కాంగ్రెస్
అభ్యర్థి ఎవరన్నదానితో సంబంధం లేకుండా టీఆర్‌ఎస్‌ స్పష్టమైన ప్రణాళికతో ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నది. పార్టీ అధినేత ఆదేశాలమేరకు ఇప్పటికే పార్టీ నేతలతోపాటు శ్రేణులంతా క్షేత్రస్థాయిలో ప్రజల్లో తిరుగుతున్నారు. మండలాలవారీగా ఎమ్మెల్యేలు ఇంచార్జిలుగా వ్యవహరిస్తున్నారు. పదిరోజులుగా క్షేత్రస్థాయిలో ప్రచారం జరుగుతున్నది. ప్రచారంలో వివరిస్తున్న ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఎందరో ఆకర్షితులవుతున్నారు. పెద్ద సంఖ్యలో కాంగ్రెస్‌, బిజేపీ నుంచి నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. ఇతర పార్టీల్లో ఉండటం ద్వారా అభివృద్ధికి దూరంగా ఉన్నట్లేనని వీరు వ్యాఖ్యానిస్తున్నారు. జానారెడ్డి ఏడుసార్లు గెలువటంలో కీలకంగా ఉంటూ వచ్చిన ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు, ఆప్కాబ్‌ మాజీ చైర్మన్‌ ఎడవెల్లి విజయేందర్‌రెడ్డి, మాజీ ఎంపీపీ హన్మంతరావు, రైస్‌మిల్లర్‌ గార్లపాటి ధనమల్లయ్య, మాజీ ఎంపీపీ మర్ల చంద్రారెడ్డి, ప్రముఖ న్యాయవాది ఎంసీ కోటిరెడ్డి, ఎస్టీలో బలమైన నేత ఆంగోతు భగవాన్‌నాయక్‌ లాంటి కీలక నేతలతోపాటు చాలామంది టీఆర్‌ఎస్‌కు చేరుకున్నారు. ఏ విధంగా చూసినా టీఆర్‌ఎస్‌కే పూర్తి అనుకూల వాతావరణం కనిపిస్తున్నదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

పగటికలల్లో బీజేపీ
గత ఎన్నికల్లో 2,675 ఓట్లను మాత్రమే సాధించి నాలుగో స్థానానికి పరిమితమైన బీజేపీ.. ఇక్కడ ఈసారి ఏకంగా గెలుస్తామని ప్రగల్భాలు పలుకుతుండటం విచిత్రం. బీజేపీకి గ్రామాల్లో ఓటర్లను కలిసే కనీస యంత్రాంగం కూడా ఇక్కడలేదు. దీనికితోడు కేంద్ర ప్రభుత్వ నిర్వాకంతో అంతకంతకూ పెరుగుతున్న డీజిల్‌, పెట్రోల్‌ ధరలతో ప్రజలు మండిపోతున్నారు. ముఖ్యంగా సాగర్‌ ప్రాంతంలో ఎక్కవగా ట్రాక్టర్లు, వరికోత మిషన్లతోనే వ్యవసాయ పనులు జరుగుతుంటాయి. ఈ ధరల ప్రభావం రైతులపై అదనపు భారాన్ని మోపుతున్నది. మిగతా అన్ని రకాల ధరలు పెరుగుతుండటంతో వీరు సరిగ్గా ప్రజల్లోకి వెళ్ళే పరిస్థితి కూడా లేదు. ఈ వారంలోనే వచ్చిన శాసనమండలి ఎన్నికల ఫలితాలు కూడా ఆ పార్టీ పరిస్థితిని తేటతెల్లం చేశాయి. ఇక్కడ ఆ పార్టీ అభ్యర్థి ప్రేమేందర్‌రెడ్డి నాలుగోస్థానంలో నిలిచారు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లోనూ ఆ పార్టీ 2,639 ఓట్లతో డిపాజిట్‌ కోల్పోయింది. దీంతో బీజేపీని ఇక్కడ ఎన్నికల్లో లెక్కలోకే తీసుకొనే పరిస్థితి కనిపించడంలేదు.

గోదావరి జలాలు కృష్ణాలోకి


ఇదే సమయంలో మరో కీలక అంశంపై సీఎం కేసీఆర్‌ ప్రకటన చేశారు. ఎవరూ అడగకముందే రాష్ట్ర సమగ్రాభివృద్ధే లక్ష్యంగా గోదావరి, కృష్ణాజలాల అనుసంధానంపై హాలియాసభలో మాట్లాడారు. ‘కృష్ణానదిలో నీళ్లు తక్కువ. రెండేండ్లుగా దేవుడి దయతో నది పొంగిపొర్లుతున్నది. అన్ని సందర్భాల్లో నీళ్లు రావు. నేను చెప్పిన లిఫ్టు, ఎడమ కాలువ ఆయకట్టు ఎట్టి పరిస్థితిల్లో ఎండిపోవద్దు. నీళ్లు పారాలి, పంటలు పండాలంటే శాశ్వత పరిష్కారం కావాలి. అది కావాలంటే గోదావరి నీళ్లు కృష్ణాకు రావాలి. ఇప్పటికే సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లు తెచ్చి ఖమ్మం జిల్లాలోని పాలేరు రిజర్వాయర్‌ నింపుతున్నాం. అక్కడి నుంచి నల్లగొండ జిల్లాలోని పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌కు లిఫ్టు పెడితే ఇక నీళ్ల తండ్లాట ఉండదు. ఆ పనికోసం రూ.600 కోట్లతో అంచనాలు సిద్ధమయ్యాయి. దీన్ని కూడా తొందరలోనే శాంక్షన్‌ చేస్తాం’ అని కేసీఆర్‌ చేసిన ప్రకటనపై సాగర్‌తోపాటు మిర్యాలగూడ, హుజూర్‌నగర్‌, కోదాడ ప్రజలు, రైతాంగంలో మంచి స్పందన లభించింది.

ఇంత గొప్ప ఆలోచన చేసిన కేసీఆర్‌ ప్రభుత్వానికి మద్దతు తెలపాల్సిందేనని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన నాటినుంచే సాగర్‌ నుంచి ఎడమకాలువకు నిక్కచ్చిగా నీళ్లు వస్తున్నాయని అనుముల రైతు లింగారెడ్డి చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో టీఆర్‌ఎస్‌నే గెలిపించుకుంటామని స్పష్టంచేశారు. మరోసారి టీఆర్‌ఎస్‌కు పట్టం కడితేనే అభివృద్ధి జరుగుతుందనే భావన అంతటా వ్యక్తమవుతున్నది. నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీ, పైలాన్‌ కాలనీల్లోని ఎన్‌ఎస్పీ క్వార్టర్లను స్థానికులకే నిర్ణీత రుసుంతో కేటాయించేలా ఇప్పటికే ప్రతిపాదనలు ప్రభుత్వానికి వెళ్లాయి. దీనికి క్లియరెన్స్‌ రావాల్సి ఉన్నది. నాగార్జునసాగర్‌లో మిగిలి ఉన్న అన్ని సమస్యలకు పరిష్కారం చూపే దిశగా ప్రభుత్వం పనిచేస్తున్నదని, అండగా నిలుస్తామని హాజారిగూడెం ఆదర్శరైతు సంఘానికి చెందిన ఓబిలినేని హరిబాబు స్పష్టంచేశారు. ‘ఆరేండ్ల నుంచి రెండు పంటలు పండించుకున్నాం. మిగిలిన ఆయకట్టుకు ఎత్తిపోతలను సీఎం ఇచ్చిండు.. ఇంతకంటే రైతు సంక్షేమం కోసం ఆలోచించే వారెవరుంటారు?’ అని చల్మారెడ్డిగూడెంకు చెందిన జానపాటి వెంకన్న ప్రశ్నించారు. ఈసారి కచ్చితంగా టీఆర్‌ఎస్‌ను గెలిపించుకుని అభివృద్ధి ఫలాలు అందుకుంటామని తేల్చి చెప్పారు.

ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాల్లో సానుకూలత
నాగార్జునసాగర్‌ నియోజకవర్గంలో అన్ని విభాగాల ఉద్యోగ, ఉపాధ్యాయ, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగ్‌ ఉద్యోగులు, సిబ్బంది, అంగన్‌వాడీ, ఆశావర్కర్లు, గ్రామపంచాయితీ, మున్సిపల్‌ వర్కర్లు.. ఇలా అనేక విభాగాల్లో పనిచేసే వారంతా ప్రభుత్వంపై పూర్తి సానుకూలంగా ఉన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలోనే రాష్ట్రం సాధిస్తే, ధనిక రాష్ట్రంగానే మారుతుందని.. ఉద్యోగులు కాలర్‌ ఎగరేసుకునేలా జీతాలు పెంచుకోవచ్చని కేసీఆర్‌ చెప్పారు. నాటి మాట ప్రకారమే స్వరాష్ట్రంలో మొదట 43%, తాజాగా 30% ఫిట్‌మెంట్‌తో ఉద్యోగ, ఉపాధ్యాయవర్గాలకు భారీ బొనాంజా ప్రకటించారు. పదవీ విరమణ వయసు పెంపు, సీపీఎస్‌ ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్‌ స్కీం వంటి వరాలను కురిపించారు. వీటి ద్వారా ఈ నియోజకవర్గంలోనూ ఐదు నుంచి ఆరువేల మందికి లబ్ధి కలుగనున్నది. తమ బాగోగులు, సంక్షేమం గురించి ఆలోచించే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానికే మద్దతు ఉంటుందని నిడమనూరుకు చెందిన ఉపాధ్యాయుడు రవికుమార్‌ స్పష్టంచేశారు. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లోనూ 30% పీఆర్సీ ఇవ్వడం, పదవీ విరమణ వయసు 61 ఏండ్లకు పెంచడం.. చెప్పినట్టుగానే అసెంబ్లీలో ప్రకటించడం సీఎం కేసీఆర్‌కు ఉద్యోగుల పట్ల ఉన్న ప్రేమకు నిదర్శనమని ఉద్యోగి వెంకట్‌రెడ్డి చెప్పారు.

 • అభివృద్ధి కార్యక్రమాల్లో కీలకమైనవి
 • సాగర్‌లో పాలిటెక్నిక్‌, బీసీ రెసిడెన్షియల్‌ కాలేజీలు, హాలియాలో డిగ్రీ కాలేజీకి శంకుస్థాపన, నిడమనూరులో జూనియర్‌ సెషన్స్‌ కోర్టు ఏర్పాటు.
 • బీసీ బాలుర, బాలికల గురకులం, పెద్దవూరలో గిరిజన గురుకులం, మైనార్టీ గురుకులం, ఎస్సీ బాలికల గురుకులం.
 • తెలంగాణ లాంచీ స్టేషన్‌ ఏర్పాటు, లాంచీల కొనుగోలు, బుద్ధవనం, కమలా నెహ్రూ దవాఖానకు కొత్త భవనాలు, అధునాతన యంత్ర సామాగ్రి కల్పన.
 • సాగర్‌లో 33/11కేవీ సబ్‌స్టేషన్‌, పెద్దవూర, అనుముల, తిరుమలగిరిసాగర్‌ మండలాల్లో రెండుచొప్పున 33/11కేవీ సబ్‌స్టేషన్లు, త్రిపురారంలోనూ 33/11కేవీ సబ్‌స్టేషన్‌ మంజూరు.
 • మత్య్స కారులకు కృష్ణానదిలో కేజ్‌కల్చర్‌తో చేపల పెంపకం, 80 వేల ఎకరాలకు సాగునీరందంచే ఏఎమ్మార్పీ వరద కాల్వ ప్రారంభం. ఇతర సంక్షేమ కార్యక్రమాలు.

నేడో రేపో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ప్రకటన
నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికకు సంబంధించి అధికార టీఆర్‌ఎస్‌ ఒకటి రెండు రోజుల్లో అభ్యర్థిని ప్రకటించనున్నది. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ఇప్పటికే అభ్యర్థి ఎంపికకు సంబంధించిన పార్టీ నేతలతో చర్చలు జరిపారు. బీసీ నేతను అభ్యర్థిగా ఎంపికచేయాలని సీఎం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం.

బీసీ చైతన్యానికి ప్రతీక
నాగార్జునసాగర్‌లో బీసీ చైతన్యానికి కొదవలేదు. సాగర్‌లో ఇప్పటివరకు జానారెడ్డి రెండుసార్లు బీసీల చేతుల్లోనే పరాజయం పాలయ్యారు. 1994లో టీడీపీ అభ్యర్థి గుండెబోయిన రాంమూర్తియాదవ్‌ చేతిలో జానారెడ్డి నాలుగు వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. సాగర్‌ అభివృద్ధి టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమన్న నినాదంతో 2018లో నోముల నర్సింహయ్య పోటీచేసి జానారెడ్డిని ఓడించారు. సాగర్‌లో బీసీ ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. సామాజిక వర్గాలవారీగా చూస్తే లంబాడా(ఎస్టీ)ల తర్వాత అత్యధికంగా యాదవులున్నారు. నోముల మరణానంతరం జరుగుతున్న ఉప ఎన్నికలు కావడంతో బీసీలైతేనే ఇక్కడ జానారెడ్డికి సరైన పోటీ అని, బలమైన బీసీ అభ్యర్థికే టీఆర్‌ఎస్‌ టికెట్టు ఇవ్వాలన్న చర్చ ఇక్కడి సామాజికవర్గాల్లో బలంగా వినిపిస్తున్నది.

ఎత్తిపోతలతో సాగునీరు
పూర్తిగా వ్యవసాయాధారిత నాగార్జునసాగర్‌ నియోజకర్గపరిధిలో ఎగువ నుంచి సాగర్‌ ఎడమకాలువ, కిందనుంచి కృష్ణానది ప్రవహిస్తున్నప్పటికీ చాలా గ్రామాల్లో సాగునీరందని దుస్థితి. ప్రధానంగా తిరుమలగిరి సాగర్‌ మండలంలో నెల్లికల్లు, కుంకుడుచెట్టు తండా, జమ్మనకోట వంటి గ్రామాల్లో ఎత్తిపోతల పథకాలు మంజూరు చేయాలన్న డిమాండ్‌ దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉంది. నోముల నర్సింహయ్య ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లగా, వీటికి ఇటీవలే ఆమోదముద్ర పడింది. నెల్లికల్లు, కుంకుడుచెట్టు తండాల లిఫ్టులకు గత నెల 10న సీఎం కేసీఆర్‌ స్వయంగా వచ్చి శంకుస్థాపన చేశారు. ఇదే సందర్భంగా ఉమ్మడిజిల్లా పరిధిలో రూ.2395.68 కోట్ల వ్యయంతో 13 ఎత్తిపోతల పథకాలు, పలుచోట్ల ఆధునీకరణ పనులకు శంకుస్థాపన చేశారు.

బీసీలకు టికెట్‌ యోచన హర్షణీయం
నాగార్జునసాగర్‌ ఉప ఎన్నికలో బీసీలకు టికెట్‌ ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ యోచించడం అభినందనీయం. కాంగ్రెస్‌, బీజేపీ అగ్రకులాలకు మాత్రమే ప్రాధాన్యమిస్తుంటే.. టీఆర్‌ఎస్‌ సామాజిక న్యాయం పాటిస్తున్నది. ఈసారి కూడా టీఆర్‌ఎస్‌దే విజయం.

 • రాపోలు పరమేశ్‌, బీసీ టీచర్స్‌ యూనియన్‌ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు

మేమంతా టీఆర్‌ఎస్‌తోనే
మా అభ్యున్నతికి ఎంతో కృషిచేసిన సీఎం కేసీఆర్‌ వెంటే అందరం ఉంటాం. గతంలో పాలకులు చాలీచాలని జీతాలు ఇచ్చి అంగన్‌వాడీ టీచర్లు, ఆయాలతో వెట్టిచాకిరి చేయించారు. తెలంగాణ వచ్చాక అంగన్‌వాడీలకు రూ.4,200 ఉన్న జీతాలను సీఎం కేసీఆర్‌ ముందుగా రూ. 7 వేలకు, తర్వాత రూ.10,500కు పెంచారు.
-మనాది వనమ్మ, అంగన్‌వాడీ టీచర్స్‌ యూనియన్‌ నాయకురాలు

ఇది రైతు ప్రభుత్వం
రైతు సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పాలన సాగిస్తున్నారు. రైతుబంధు, రైతుబీమా, వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్తును ఇస్తున్నారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా పాలన అందిస్తున్న కేసీఆర్‌ వెంటే రైతులోకమంతా ఉన్నది. పండించిన ప్రతిగింజనూ కొనుగోలు చేసి రైతులను అదుకున్న ప్రభుత్వమిది.

 • ఓబిలినేని హరిబాబు, రైతు సంఘం నాయకుడు, హజారిగూడెం

కాంగ్రెస్‌, బీజేపీకి ఓటేస్తే వేస్టే..
సాగర్‌ ఉపఎన్నికల్లో ప్రజలంతా టీఆర్‌ఎస్‌ వైపే ఉన్నారు. ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌, బీజేపీకి ఓటేస్తే ఉపయోగం ఉండదు. హుజూర్‌నగర్‌ ఉప ఎన్నికల్లో అక్కడి ప్రజలు టీఆర్‌ఎస్‌కు ఓటేసి నియోజకవర్గ అభివృద్ధికి బాటలు వేసుకున్నారు. ఇప్పుడు సాగర్‌ నియోజకవర్గ ప్రజలు సైతం అదే ఆలోచన చేస్తున్నారు.

 • యన్నమల్ల సత్యం, మాల మహానాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు.

కేసీఆర్‌ వెంటే మేమంతా
పేద, బడుగు, మైనార్టీల సంక్షేమమే లక్ష్యంగా సీఎం కేసీఆర్‌ పాలస సాగుతున్నది. ఏ రాష్ట్రంలోనూ మైనార్టీలకు పండుగల సందర్భంగా దుస్తులు పంపిణీ చేసిన దాఖలాలు లేవు. నా కూతురు వివాహం చేస్తే కల్యాణలక్ష్మి కింద 1,00,116 అందజేశారు. నేను నా కుటుంబం ఈ రోజు ఆనందంగా జీవిస్తున్నామంటే కేసీఆరే కారణం.
-దుబ్బ డేవిడ్‌ రాజు, పాస్టర్స్‌ సంఘ నియోజకవర్గ గౌరవ అధ్యక్షుడు

టీఆర్‌ఎస్‌తోనే సామాజిక న్యాయం
2018 సాధారణ ఎన్నికల్లో సాగర్‌ నుంచి కాంగ్రెస్‌, బీజేపీ రెడ్డి సామాజికవర్గానికి టికెట్లు ఇస్తే.. టీఆర్‌ఎస్‌ యాదవ వర్గానికి చెందిన నోములకు కేటాయించింది. చైతన్యవంతులైన బీసీలు ఆయనను గెలిపించుకున్నారు. టీఆర్‌ఎస్‌తోనే సామాజిక న్యాయం సాధ్యమని నియోజకవర్గ ప్రజలంతా విశ్వసిస్తున్నారు.

 • చింతల వెంకటేశ్వర్లు, బీసీ సంఘం నాయకుడు, సాగర్‌ నియోజకవర్గం

ప్రభుత్వానికి అండగా ఉంటాం
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నది. ఏ ముఖ్యమంత్రి ఇవ్వని విధంగా సీఎం కేసీఆర్‌ పీఆర్సీ ఇచ్చారు. పదవీ విరమణ వయస్సును 61 ఏండ్లకు పెంచారు. బంగారు తెలంగాణ ఏర్పాటుకోసం పనిచేస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ వెంటే ప్రభుత్వ ఉద్యోగులందరం కలిసి నడుస్తాం.

 • నెమలి వెంకట్‌రెడ్డి, పీఆర్టీయూ మండల అధ్యక్షుడు, హాలియా
Advertisement
సమరానికి టీఆర్‌ఎస్‌ సై

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement