న్యూఢిల్లీ : యువతుల వస్త్రధారణపై ఉత్తరాఖండ్ సీఎం తిరత్ సింగ్ రావత్ చేసిన వ్యాఖ్యలపై తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువ మొయిత్ర మండిపడ్డారు. మహిళలు చిరిగిన జీన్స్ ధరించి తమ మోకాళ్లను చూపడం పట్ల రావత్ విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే. మోకాళ్ల వద్ద చినిగిన జీన్స్‌ను ధరించి యువత తమను తాము సంపన్నులుగా భావిస్తూ పాశ్చాత్య పోకడలతో ప్రవరిస్తున్నారని రావత్ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. యువత రిప్ప్డ్ జీన్స్ కోసం మార్కెట్‌కు వెళుతున్నారని, అక్కడ అవి లభ్యం కాకుంటే కత్తెరలతో జీన్స్‌ను కట్ చేస్తున్నారని ఆయన వ్యాఖ్యానించారు.
రావత్ వ్యాఖ్యలను మహువ తప్పుపట్టారు. మహిళల దుస్తులపై రావత్ వ్యాఖ్యలు అభ్యంతరకరమని ఆక్షేపించారు. ఆయన సిగ్గూశరం లేని వ్యక్తని ఘాటుగా విమర్శించారు. సీఎం స్ధాయి వ్యక్తికి ఇలాంటి ప్రకటనలు తగవని నటి, రాజకీయ నేత జయా బచ్చన్ సైతం రావత్ వ్యాఖ్యలపై స్పందించారు. దుస్తుల ఆధారంగా ఎవరు ఎలాంటి వారో మీరే నిర్ణయిస్తున్నారు..ఇది సరైన తీరు కాదని, మహిళలపై నేరాలను ఇలాంటి వ్యాఖ్యలు ప్రేరేపిస్తాయని జయా బచన్ అన్నారు. రావత్ తక్షణమే చెప్పాలని ఆయన వ్యాఖ్యలు సిగ్గుచేటని ఉత్తరాఖండ్ కాంగ్రెస్ చీఫ్ ప్రీతం సింగ్ డిమాండ్ చేశారు.