వాహనదారులూ.. బహుపరాక్.. ట్రాఫిక్ పోలీసులు లేరు కదా అని.. నిబంధనలు ఉల్లంఘించకండి.. నిత్యం మూడో కన్ను మిమ్మల్నీ గమనిస్తూ..ఉంటుందని గ్రహించండి.. సమీకృత ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టం ద్వారా జంక్షన్ల వద్ద ఏర్పాటైన స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కెమెరాలు ఏ చిన్నతప్పు చేసినా వదలడం లేదు. అతిక్రమణను పసిగట్టి.. చలాన్లు జారీ చేస్తున్నది.
జంక్షన్ల వద్ద ఉండే స్టాప్‌లైన్ మీదకు సగం టైరు వచ్చినా, సిగ్నల్ పడిపోతుందని వేగంగా ప్రయాణించినా.. హెల్మెట్ ధరించకపోయినా, ఇంకా ఇతర ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తే.. వదిలేది లేదని స్మార్ట్ సిటీ ప్రాజెక్ట్ కెమెరాలు హెచ్చరిస్తున్నాయి. రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో తాజాగా ఏర్పాటైన ఈ సమీకృత ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ కెమెరాలతో రోజుకు 800 చలాన్లు పడుతున్నాయి.
సుమారు 24 జంక్షన్ల వద్ద..
కమిషనరేట్ పరిధిలోని వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉండే దాదాపు 24 జంక్షన్ల వద్ద 150కి పైగా అత్యాధునిక కెమెరాలను అమర్చారు. ఇవి తీసే ఫొటోలు, వీడియోలను భద్ర పర్చేందుకు ప్రత్యేక డేటా కేంద్రాన్ని నిర్వహిస్తున్నారు. ఓ ట్రాఫిక్ కమాండ్ కంట్రోల్‌ను కూడా అందుబాటులోకి తీసుకువచ్చారు. ఇందులో మూడు షిఫ్టుల్లో సిబ్బందిని ఏర్పాటు చేసి.. ప్రత్యక్షంగా ఉల్లంఘనలను వీక్షించడం లేదా రెండు మూడు రోజులకు సంబంధించిన దృశ్యాలను మరుసటి రోజు వీక్షించే విధంగా సాంకేతిక పరిజ్ఞానాన్ని పొందుపర్చుకున్నారు. పోలీసులు ఈ కెమెరాలు దించిన ఫొటోలు, వీడియోలను క్లిక్ చేస్తే చాలు..వాహనదారుల నంబర్ ప్లేట్ ఆధారంగా నేరుగా చలాన్ జారీ అయ్యి.. వాహనదారుడి ఫోన్‌కు సందేశం చేరుకుంటుంది. ఇలా వాహనదారుడి తప్పుల చిట్టా ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతుంది. ఈ కమాండ్ కంట్రోల్లో మొత్తం 24 జంక్షన్లలో రికాైర్డెన దృశ్యాలు దాదాపు 30 రోజుల పాటు భద్రంగా ఉంటాయి. సమీకృత ట్రాఫిక్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా నాలుగు నెలల్లో 10 రకాల ఉల్లంఘనలకు సంబంధించి మొత్తం 91241 వాహనదారులకు చలాన్లు జారీ చేసింది. వారి చిట్టాను భద్రపర్చింది. 24/7 పనిచేసే ఈ స్మార్ట్ కెమెరాలు.. మిస్టరీ కేసులను ఛేదించడంలోనూ తోడ్పడుతున్నాయి.
ఐటీఎంఎస్ కెమెరాలు ఇలా పట్టేశాయి..
సిగ్నల్ లైట్ జంపింగ్-267
స్టాప్ లైన్ జంపింగ్-4468
అతి వేగం-5723
హెల్మెట్ లేకుండా డ్రైవింగ్-22555
రాంగ్ రూట్ డ్రైవింగ్-56377
ట్రిపుల్ డ్రైవింగ్-488
సెల్‌ఫోన్ డ్రైవింగ్-115
నంబర్ ప్లేట్ దాచడం-910
ఉద్దేశపూర్వకంగా సమాచారాన్ని దాచడం-155