సిటీబ్యూరో, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ): కరోనా వైరస్ నుంచి పూర్తిగా కోలుకోకముందే రకరకాల వైరస్లు జనాలను ఆందోళనకు గురిచేస్తున్నాయి. కొన్ని రోజులుగా ‘టమాటా ఫ్లూ’ దేశంలోని పలు ప్రాంతాల్లో కలకలం సృష్టిస్తున్నది. తొలిసారిగా కేరళలో నమోదైన టమాటా ఫ్లూ ఆ తరువాత నెమ్మదిగా హర్యానా, తమిళనాడు, ఒడిశా, కర్ణాటక ప్రాంతాలకు కేసులు విస్తరించాయి. 9 సంవత్సరాలలోపు పిల్లలు ఎక్కువగా ఈ వైరస్‌కు గురవుతున్నారు. ఇప్పటి వరకు దేశంలోని ఐదు రాష్ర్టాల్లో 100 కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో అన్ని రాష్ర్టాలను అప్రమత్తం చేసి పలు సూచనలు జారీ చేసినట్లు అధికారిక వర్గాలు తెలిపాయి.
తెలంగాణ పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో టమాటా ఫ్లూ కేసులు నమోదవడంతో రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. కరోనా తరహాలోనే టమాటా ఫ్లూ అంటువ్యాధి కావడంతో వైరస్ మరిన్ని ప్రాంతాలకు వ్యాపించే అవకాశాలు లేకపోలేవని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యనిపుణులు చెబుతున్నారు. కేరళ, కర్ణాటక, తమిళనాడు తదితర రాష్ర్టాలను టమాటా ఫ్లూ వణికిస్తుండడంతో సంబంధిత వైద్య, ఆరోగ్యశాఖ అధికారులు ఆయా రాష్ర్టాల సరిహద్దుల్లో చెక్‌పోస్టులను ఏర్పాటు చేసి, స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. లక్షణాలున్నవారిని గుర్తించి, ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. కొత్తగా వెలుగుచూసిన ఈ టమాటా ఫ్లూలో చికున్‌గున్యా, డెంగ్యూకు సంబంధించి దగ్గరి లక్షణాలు కనిపిస్తున్నట్లు వైద్యనిపుణులు చెబుతున్నారు. తెలుగు రాష్ర్టాలలో ఇప్పటి వరకు ఎలాంటి కేసులు నమోదు కానందున ప్రజలు ఆందోళన చెందాల్సిన పనిలేదని, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైద్యాధికారులు తెలిపారు. చికున్‌గున్యా, డెంగ్యూ వ్యాధులకు ఇచ్చే సపోర్టింగ్ ట్రీట్మెంటే టమాటా ఫ్లూకు ఇవ్వనున్నట్లు వైద్య నిపుణులు తెలిపారు.
ఆందోళన అవసరం లేదు
టమాటా ఫ్లూ అనేది ఈ మధ్య వస్తున్న కొత్త వైరస్. ఇప్పటి వరకు మన తెలుగు రాష్ర్టాల్లో ఎక్కడా కూడా కేసులు నమోదు కాలేదు. చికున్‌గున్యా, డెంగీ స్వభావాన్ని కలిగి ఉన్న ఈ వైరస్‌కు వాటికి ఇచ్చే సపోర్టింగ్ ట్రీట్మెంట్ ఇస్తే సరిపోతుంది. దీనిపై ఇంకా పూర్తి స్థాయి స్పష్టత రావల్సి ఉంది. ఎలాంటి పరిస్థితులనైనా సమర్థవంతంగా ఎదుర్కొంటాం. అందుకు మన ప్రభుత్వం పూర్తిస్థాయిలో సహకరిస్తుంది.
– డాక్టర్ ఉషారాణి, ప్రొఫెసర్
ఆఫ్ పీడియాట్రిక్, నిలోఫర్ హాస్పిటల్