Dasara Movie | ఫలితంతో సంబంధంలేకుండా విభిన్న కథలతో ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తుంటాడు నాచ్యురల్ స్టార్ నాని. ఇటీవలే ఈయన నటించిన ‘అంటే సుందరానికీ’ విడుదలై మంచి విజయం సాధించింది. ప్రస్తుతం నాని ‘దసరా’ అనే అవుట్ అండ్ అవుట్ యాక్షన్ సినిమాను చేస్తున్నాడు. ఇప్పటికే చిత్రం నుండి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేశాయి. శ్రీకాంత్ ఓదెలా దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం తెలంగాణలోని గోదావరి ఖనిలో షూటింగ్ జరుపుకుంటుంది. అయితే తాజాగా చిత్రీకరణ సమయంలో ఓ పెను ప్రమాదం నుండి నాని బయటపడ్డాడని సమాచారం.
వివరాల్లోకి వెళ్తే బొగ్గులారి కింద ఓ సీన్ చేస్తుండగా బొగ్గంత నానిపై పడిందట. అయితే అదృష్టవశాత్తు నానికి ఈ సమయంలో ఎలాంటి గాయాలు కాలేదని తెలుస్తోంది. ఇలా నానిపై ఒక్కసారిగా బొగ్గు పడటంతో యూనిట్ అంతా షాక్ అయ్యారట. వెంటనే షూటింగ్ ఆపేసి నాని దగ్గరకు వెళ్ళి బొగ్గును తొలిగించారట. దీంతో చిత్రీకరణకు కొద్దిసేపు అంతరాయం కలిగింది. అయితే నాని తనకేమీ కాలేదని వాళ్లకు ధైర్యం చెప్పి మళ్లీ షూటింగ్‌కి సిద్ధమైనట్లు సమాచారం.
ఈ చిత్రంలో నానికి జోడీగా కీర్తిసురేష్ హీరోయిన్గా నటించింది. ఇక ఈ ఇద్దరూ ఈ సినిమాలో డీ గ్లామర్ పాత్రల్లో నటించారు. ఎస్ఎల్వి సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. సంతోష్ నారాయణ్, సత్యన్ సూర్యన్ స్వరాలను సమకూరుస్తున్నారు. వీలైనంత త్వరగా షూటింగ్‌ను పూర్తి చేసి ఈ ఏడాది డిసెంబర్లో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.