హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఇండస్ట్రియల్ హెల్త్ క్లినిక్ లిమిటెడ్ (టీఐహెచ్‌సీఎల్) మూడేండ్లలోనే ఖాయిలాపడిన 67 కుటీర, చిన్న పరిశ్రమలను పునరుద్ధరించి 1,800 మందిని జీవనోపాధిని కాపాడింది. ఇందులో 30 యూనిట్లకు ఆర్థిక సహకారం అందించగా, మిగిలిన వాటిని వ్యూహాత్మక చర్యల ద్వారా పునరుద్ధరించారు. మరిన్ని యూనిట్లను ఆదుకొనేందుకు వీలుగా నాబార్డ్, సిడ్బీలతో టీఐహెచ్‌సీఎల్ సంప్రదింపులు జరుపుతున్నది.
సమస్య చెప్తే సత్వరం రంగంలోకి..
ఖాయిలాపడిన కుటీర, చిన్న పరిశ్రమలను పునరుద్ధరించేందుకు రాష్ట్రప్రభుత్వం టీఐహెచ్‌సీఎల్‌ను 2017లో ఏర్పాటుచేసింది. రూ.100 కోట్ల కార్పస్ ఫండ్‌తో దీన్ని నెలకొల్పి పరిశ్రమల నిర్వహణ, ఆర్థిక వ్యవహారాల్లో నిపుణులను అందులో నియమించారు. ఆర్థిక సమస్యలు, స్థానికంగా ఏర్పడ్డ చిన్నాచితకా ఇబ్బందుల వల్ల మూసివేసిన పరిశ్రమలకు చేయూతనందించి తిరిగి తెరిపించడమే దీని లక్ష్యం. మూసివేసిన పరిశ్రమలకు చెందినవారు టీఐహెచ్‌సీఎల్‌ను సంప్రదిస్తే ఈ సంస్థ తగిన సహకారం అందిస్తుంది. టీఐహెజ్సీఎల్ గత మూడేండ్లలో 220 యూనిట్లను పరిశీలించి 67యూనిట్లకు రూ.3 కోట్ల వరకు సహాయం అందించింది. బ్యాంకర్లతో ఏర్పడిన సమస్యల పరిష్కారానికి చర్చలు జరుపడం, ప్రభుత్వం నుంచి రాయితీలు కల్పించటం, విద్యుత్‌శాఖకు సంబంధించిన సమస్యలు, విద్యుత్ చార్జీల రాయితీలు తదితర సమస్యలు ఈ సంస్థ పరిష్కరించినవాటిలో ముఖ్యమైనవి.
టీఐహెచ్సీఎల్కు మైక్రోసాఫ్ట్ సాంకేతిక సహకారం అందిస్తున్నది. ఐ-హెల్త్ యాప్ ద్వారా ఖాయిలాపడిన యూనిట్ల యజమానుల సమస్యలను తెలుసుకుంటారు. వారిచ్చే సమాచారం ఆధారంగా సంస్థను పునరుద్ధరించే వీలుందా, లేదా? అనేది నిర్ణయిస్తారు. ఒకవేళ పునరుద్ధరించే వీలుంటే నామమాత్రం ఫీజు చెల్లించి తమ వెబ్సైట్లో నమోదు చేసుకోమని కోరుతారు. ఐదు పనిదినాల్లో వారు సదరు యూనిట్ నిర్వాహకులను సంప్రదించి తగిన మార్గనిర్దేశం చేస్తారు. ఒకవేళ ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలతో సంస్థను పునరుద్ధరించే వీలుంటే అందుకు తగిన చర్యలు తీసుకుంటారు. టీఐహెచ్‌సీఎల్ తన పరిధిని పెంచుకొనేందుకు నాబార్డ్, సిడ్బీని కూడా సంప్రదిస్తున్నది.