హైదరాబాద్, మే 24(నమస్తే తెలంగాణ): జొన్న, పొద్దుతిరుగుడు పంటలు కొనుగోలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. వెంటనే జిల్లాల వారీగా ఏర్పాట్లు చేయాలని ఒక ప్రకటనలో అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం మారెట్లో జొన్న ధర క్విం టాకు రూ. 2 వేలు మాత్రమే ఉండగా, కేంద్రం మద్దతు ధర రూ.3,699గా ఉన్నదని పేర్కొన్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకు రూ.1,100 కోట్లకు పైగా వ్యయంతో జొన్న కొనుగోలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు.
పొద్దుతిరుగుడు పంట విషయంలో కేంద్ర ప్రభుత్వం కేవలం 25 శాతం కొనుగోలుకే అనుమతించిందని మం త్రి తుమ్మల తెలిపారు. ఆ పరిమితికి మించి రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేపట్టాలని నిర్ణయించిందని తెలిపారు. ప్రస్తుతం పొద్దుతిరుగుడు మద్దతు ధర క్వింటాకు రూ.7,721 ఉంటే, మారెట్లో రూ.5,376 మాత్రమే ఉందని అన్నారు. అదనంగా మరో 6.53 లక్షల టన్నుల మక్కల కొనుగోలుకు రూ.1867.77 కోట్ల బ్యాంకు గ్యారెంటీకి క్యాబినెట్ నిర్ణయం తీసుకున్నదని తెలిపారు.