Bheemla Nayak | పవన్ కళ్యాణ్ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తే బాక్సాఫీస్ దగ్గర సునామీ ఎలా ఉంటుందో ఇప్పటికే చాలా సినిమాలు నిరూపించాయి. మొన్న విడుదలైన భీమ్లా నాయక్ దీనికి మినహాయింపు కాదు. సాగర్ కేంద్ర తెరకెక్కించిన ఈ సినిమా మూడు రోజుల్లోనే 100 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఆ తర్వాత కూడా మంచి వసూళ్లు వస్తున్నాయి. ఏపీలో ప్రతికూల పరిస్థితులు తట్టుకుని మరీ నిలబడుతుంది భీమ్లా నాయక్. అక్కడ టికెట్ రేట్లు మామూలుగా ఉండి ఉంటే భీమ్లా నాయక్‌కు ఈ పాటికి 100 కోట్ల షేర్ వచ్చేది. విడుదలైన ఐదో రోజు కూడా ప్రపంచ వ్యాప్తంగా 9.5 కోట్ల షేర్ వసూలు చేసింది పవన్ కళ్యాణ్ సినిమా.
ఇదిలా ఉంటే భీమ్లా నాయక్‌కు చిన్న సినిమాల నుంచి పోటీ ఎదురు కానుంది. శర్వానంద్ హీరోగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు మార్చి 4న విడుదల అవుతుంది. కిశోర్ తిరుమల తెరకెక్కించిన ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఈ మధ్య కాలంలో సరైన విజయం లేని శర్వానంద్ కెరీర్‌కు ఆడవాళ్లు మీకు జోహార్లు అత్యంత కీలకంగా మారింది. మరోవైపు అదే రోజు పవన్ కళ్యాణ్ వీరాభిమాని కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన సెబాస్టియన్ విడుదల కానుంది. గతేడాది ఎస్ ఆర్ కళ్యాణమండపం సినిమాతో మంచి విజయం అందుకున్న ఈ కుర్రాడు ఇప్పుడు మరో హిట్‌పై కన్నేశాడు. పైగా ఈ సినిమా కథ ఆసక్తికరంగా ఉంది. రేచీకటి ఉన్న పోలీస్ డ్యూటీలో ఉన్నప్పుడు జరిగే అనూహ్య పరిణామాల చుట్టూ జరిగే కథ ఇది. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది.
వీటితో పాటు దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన హే సైనామిక సినిమా కూడా ఇదే వారం వస్తుంది. ఈ మూడు సినిమాలు పవన్ జోరుకు అడ్డుకట్ట వేస్తాయి అనేది అనుమానమే. ఆడవాళ్లు మీకు జోహార్లు పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే తప్ప ఈ వారం పవన్ సునామీ తట్టుకొని నిలబడటానికి సాధ్యం కాదు. మరోవైపు భీమ్లా నాయక్ బ్రేక్ ఈవెన్ అవ్వడానికి మరో 20 కోట్ల దూరంలో ఉంది. అందుకే సెకండ్ వీకెండ్ దీనికి కూడా కీలకంగా మారింది. మరి చూడాలిక ఏం జరగబోతుందో..!