అక్కినేని కుటుంబానికి బాలీవుడ్ కొత్త కాదు. ఇప్పటికే ఈ ఫ్యామిలీ నుంచి తాత, తండ్రి అంతా హిందీ సినిమాలు చేసారు. అప్పట్లో నాగేశ్వరరావు సువర్ణ సుందరి సినిమాతో ఉత్తరాది ప్రేక్షకులను పలకరించాడు. ఇక నాగార్జున గురించి కొత్తగా చెప్పాల్సిందేం లేదు. అక్కడ చాలా సినిమాలు చేసాడు. ఇప్పటికే డజన్ సినిమాలకు పైగా నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇప్పుడు వాళ్ల బాటలోనే నాగ చైతన్య కూడా వెళ్తున్నాడు. ఈయన కూడా త్వరలోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
అక్కడ తొలి సినిమా కోసం అన్నీ సిద్ధం చేసుకుంటున్నాడు నాగ చైతన్య. అయితే ఆయన హీరోగా కాకుండా మంచి పాత్రతో అక్కడి ఆడియన్స్ ను పలకరించబోతున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా వస్తున్న లాల్ సింగ్ చడ్డా సినిమాలో నాగ చైతన్య కీలక పాత్రలో నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ పాత్ర కోసం ముందు విజయ్ సేతుపతిని ఎంచుకున్నారు. విజయ్ సేతుపతి షూటింగ్ కోసం డేట్స్ కూడా కేటాయించాడు. అయితే చివరి నిమిషంలో ఈయన డేట్స్ కుదరకపోవడం.. కరోనా కారణంగా షూటింగ్ ఏడాది పాటు వాయిదా పడటంతో ఇప్పుడు విజయ్ తప్పుకున్నాడు.
దాంతో ఇప్పుడు ఆ స్థానంలోనే నాగ చైతన్యను ఎంపిక చేసినట్లు తెలుస్తుంది. సినిమాలో ఈ పాత్ర సౌత్ ఇండస్ట్రీకి సంబంధించింది కావడంతో చైతూను తీసుకున్నారు దర్శక నిర్మాతలు. ఈ సినిమాలో హాలీవుడ్ లో హిట్ అయిన ఫారెస్ట్ గంప్ రీమేక్. కరీనా కపూర్ ఈ సినిమాలో హీరోయిన్. రెండోసారి తల్లి కావడంతో ఈమె పాత్ర కొన్ని రోజుల కిందే పూర్తి చేసాడు దర్శకుడు. మరోవైపు నాగ చైతన్య ఈ సినిమా కోసం మే నుంచి డేట్స్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి చూడాలిక.. నాగ చైతన్య బాలీవుడ్ ఎంట్రీ ఎలా ఉండబోతుందో..?
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.