SUV Car Sales | దేశీయ అతిపెద్ద కార్ల తయారీ సంస్థ మారుతి సుజుకి కస్టమర్ల ఆకాంక్షలను అందుకోవడంలో వెనుకబడుతుందా.. టాటా, హ్యుండాయ్, కియా మోటార్స్ దూసుకెళ్తున్నాయా? అంటే అవుననే సమాధానమే వస్తున్నది. కార్ల విక్రయాల్లో అత్యధికంగా ఎస్యూవీ మోడల్స్‌కే కస్టమర్లు పట్టం గట్టారు. వాటిల్లో టాటా మోటార్స్ పాపులర్ మోడల్ నెక్సాన్ కార్ల సేల్స్‌లో 67.9 శాతం గ్రోత్ నమోదు చేసింది. 2021 జనవరిలో 8,225 కార్లు అమ్ముడైన నెక్సాన్.. ఈ ఏడాది 13,816 యూనిట్లు విక్రయించింది. టాటా ఎస్యూవీ కార్ల విక్రయాలు పెరగడానికి ఇటీవల ఆవిష్కరించిన టాటా పంచ్ మోడల్ కూడా ఒక కారణంగా కనిపిస్తున్నది.
మరోవైపు దక్షిణ కొరియా ఆటో మేజర్ కియా మోటార్స్ వారి సెల్టోస్ రెండో స్థానంలో నిలిచింది. గతేడాదితో పోలిస్తే 2022 జనవరిలో 16.3 శాతం వృద్ధి నమోదు చేసింది. 2021 జనవరిలో 9,869 యూనిట్లు అమ్ముడు కాగా, గత నెలలో 11,483 సెల్టోస్ కార్లు సేల్ అయ్యాయి.
మరో దక్షిణ కొరియా కార్ల తయారీ సంస్థ హ్యుండాయ్ వారి వెన్యూ మూడో స్థానంలో నిలిచింది. 2021 జనవరితో పోలిస్తే ఈ ఏడాది 3.4 శాతం సేల్స్ తగ్గాయి. 2021లో 11,779 కార్లు అమ్మితే, ఈ ఏడాది 11,377 యూనిట్లతోనే సరిపెట్టుకుంది. ఇదిలా ఉంటే టాటా పాపులర్ మోడల్ పంచ్ ఆవిష్కరించినప్పటి నుంచి గత నెలలో 10,027 కార్లు విక్రయమైంది.
హ్యుండాయ్ క్రెటా కార్ల విక్రయాలు 19.6 శాతం తగ్గాయి. 2021 జనవరిలో 12,284 కార్లు అమ్ముడైతే, గత నెలలో 9,869 యూనిట్లకు పరిమితమైంది. ఈ ఏడాది ద్వితీయార్థంలో క్రెటా ఫేస్‌లిఫ్ట్ మార్కెట్లోకి వస్తుందని అంచనా వేస్తున్నారు.
ఇక మారుతి సుజుకి వారి విటారా బ్రెజా ఆరో స్థానానికి పరిమితమైంది. 2021లో 10,623 కార్లు అమ్ముడైతే, ఈ ఏడాది 9.8 శాతం తగ్గి 9,576 యూనిట్లకు పడిపోయింది. ఈ నేపథ్యంలో విటారా బ్రెజా నూతన జనరేషన్ కారును ఆవిష్కరించడం ద్వారా కస్టమర్లకు చేరువ అయ్యేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నది. బ్రెజా పేరుతో ఆవిష్కరించనున్నట్లు వార్తలొస్తున్నాయి.
దక్షిణ కొరియా కియా మోటార్స్ వారి సొనెట్ సేల్స్ 22 శాతం పడిపోయాయి. 2021లో 8,859 యూనిట్లు అమ్ముడైన సొనెట్.. గత నెలలో 6904 యూనిట్లకు పరిమితమైంది. మహీంద్రా అండ్ మహీంద్రా థార్ మోడల్ 47.3 శాతం గ్రోత్ నమోదు చేసింది. గతేడాది జనవరిలో 3,152 యూనిట్ల థార్ కార్లు అమ్ముడైతే, గత నెలలో 4,646 కార్లు విక్రయించింది.
మరో మహీంద్రా కారు ఎక్స్‌యూవీ 300 కూడా గత నెలలో అమ్ముడైన టాప్-10 కార్ల జాబితాలో చేరింది. అయితే, 2021లో 4,612 యూనిట్ల కార్లు అమ్ముడు కాగా, గతనెలలో 4550 యూనిట్లకు పరిమితమైంది. గతేడాదితో పోలిస్తే 1.3 శాతం పడిపోయింది. మహీంద్రా ఎక్స్‌యూవీ 700 మోడల్ కూడా టాప్-10లోకి చేరుకుంది. గత నెలలో 4,119 యూనిట్లు విక్రయించింది.