బయట మాత్రమే కాదు సినిమాల్లో కూడా హీరోలకు అభిమానులుంటారు. అప్పుడప్పుడూ ఆ నేపథ్యంలోనే కథలు కూడా రాస్తుంటారు దర్శకులు. అప్పట్లో కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాలో బాలయ్య అభిమానిగా నటించాడు నాని. మరోవైపు ఇడియట్ సినిమాలో రవితేజ కూడా చిరు అభిమానిగా నటించాడు. అలా చాలా సినిమాల్లో హీరోలకు అభిమానులుగా మన హీరోలు నటించారు. ఇప్పుడు కూడా ఇలాంటి సీన్ జరగబోతుంది. తాజాగా నాగ చైతన్య కూడా మహేష్ బాబు అభిమానిగా కనిపించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ప్రస్తుతం ఈయన విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ సినిమా చేస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో సమంత అక్కినేని కూడా చిన్న పాత్రలో మెరుస్తుందని ప్రచారం జరుగుతుంది.
మనం తర్వాత ఆ స్థాయి విజయం రాలేదు ఈ దర్శకుడికి. భారీ అంచనాలతో వచ్చిన 24, గ్యాంగ్ లీడర్ నిరాశ పరిచాయి. ఇలాంటి సమయంలో ఈయన నుంచి వస్తున్న థ్యాంక్యూ. ఈ రొమాంటిక్ ఎంటర్టైనర్తో కచ్చితంగా తనకు విజయం అందుతుందని ధీమాగా ఉన్నాడు నాగ చైతన్య. తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది. ఇందులో హీరో నాగ చైతన్య సూపర్ స్టార్ మహేష్ బాబు అభిమానిగా నటించబోతున్నాడని ప్రచారం జరుగుతుంది. ఈ సినిమా చిత్రీకరణలో భాగంగా మహేష్ బాబు కటౌట్‌కు చైతూ పాలాభిషేకం చేస్తున్న వీడియో లీక్ అయింది.
అది ఇంటర్నెట్లో వైరల్ అవుతోందిప్పుడు. పైగా అందులో మహేష్ బాబు ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ఒక్కడు పోస్టర్ కూడా ఉంది. ఈ వార్త తెలియడంతో అటు మహేష్ బాబు ఫ్యాన్స్‌తో పాటు ఇటు అక్కినేని అభిమానులు ఖుషీ అవుతున్నారు. మహేష్ కటౌట్‌కు పాలాభిషేకం చేసే సీన్‌కు థియేటర్లు దద్దరిల్లిపోవడం ఖాయమని నమ్ముతున్నారు ఫ్యాన్స్. ఇదిలా ఉంటే ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట సినిమాతో బిజీగా ఉన్నాడు. పరశురామ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.