హైదరాబాద్, మే 23 (నమస్తే తెలంగాణ) : పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల భర్తీకి నిర్వహించిన టీజీ పాలిసెట్ ఫలితాలు శనివారం విడుదలయ్యాయి. మాసాబ్‌ట్యాంక్‌లోని సాంకేతిక విద్యామండలి కార్యాలయంలో సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ఫలితాలు విడుదల చేశారు. ఈసారి 82.94% ఉత్తీర్ణత నమోదయ్యింది. బాలురు 79.92%, బాలికలు 86.38% క్వాలిఫై అయ్యారు. బాలురతో పోల్చితే బాలికలు 6.46% అధికంగా ఉత్తీర్ణత నమోదుచేశారు.
ఈ ఏడాది 1,06,439 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 98,029 మంది పరీక్షకు హాజరయ్యారు. వీరిలో 81,307(82.94%) మంది అర్హత సాధించారు. ఎస్సీలు, ఎస్టీలకు క్వాలిఫై మార్కు ఒకటి కాగా, ఈ క్యాటగిరీలో వందశాతం క్వాలిఫై అయ్యారు. ఈ ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్ డిప్లొమాతోపాటు ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్, కొండా లక్ష్మణ్‌బాపూజీ హార్టికల్చర్, పీవీ నర్సింహారావు వెటర్నరీ వర్సిటీల్లోని డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. డిప్లొమా కోర్సుల సీట్ల భర్తీ షెడ్యూల్ ఇప్పటికే విడుదలయ్యింది. ఈ నెల 27 నుంచి మొదటి విడత కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. సాంకేతిక విద్యామండలి కార్యదర్శి పుల్లయ్య, అధికారులు గిరిబాబు, వెంకటేశ్వర్లు, శ్రీనివాస్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఎంపీసీ విభాగంలో 11 మంది స్టేట్ మొ దటి ర్యాంకు సొంతం చేసుకున్నారు. ఒకే మా ర్కు మీద ఉండటంతో వీరికి మొదటి ర్యాంకు కేటాయించారు. గతంలో ఒకరిద్దరు.. లేదా ముగ్గురు ఒకే మార్కు సాధించిన సందర్భాలున్నాయి. కానీ ఈసారి 11మంది ఒకే ర్యాంకుపై ఉండటం గమనార్హం. అయితే వీరికి స్టేట్-1 ర్యాంకు కేటాయించినా తర్వాత సబ్జెక్టుల వారీగా వచ్చిన మార్కులు, పుట్టిన తేదీ ఆధారంగా ఒకటి, రెండు, మూడు, ర్యాంకులు ఖరారుచేస్తారు.
ఐటీఐ పాసైన వారికి పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాలు కల్పించేందుకు నిర్వహించిన ఎల్పీసెట్లో 57.28% ఉత్తీర్ణత నమోదయ్యింది. బాలురు 57.23%, బాలికలు 58.82% క్వాలిపై అయినట్టు శ్రీదేవసేన వెల్లడించారు. ఎల్పీసెట్ పరీక్షకు 508 మంది హాజరు కాగా, 291 మంది క్వాలిఫై అయినట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన వారు 100% ఉత్తీర్ణులైనట్టు వెల్లడించారు.
