హైదరాబాద్, డిసెంబర్ 2(నమస్తే తెలంగాణ): ఏపీ పునర్విభజన చట్టం-2014కి విరుద్ధంగా పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టును చేపట్టకుండా ఏపీ సర్కారును సత్వరం నిలువరించాలని గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు(జీఆర్ఎంబీ)కి తెలంగాణ సర్కారు డిమాండ్ చేసింది. ఈమేరకు జీఆర్ఎంబీకి తెలంగాణ నీటి పారుదలశాఖ ఈఎన్సీ అమ్జద్ హుస్సేన్ మంగళవారం లేఖ రాశారు. గోదావరి జలాలను మళ్లించేందుకు ఏపీ ప్రభుత్వం అనేక విధాలుగా యత్నిస్తున్నదని, గతంలో గోదావరి-పెన్నా ఇంటర్ రివర్ లింక్ ప్రాజెక్టు చేపట్టిందని, ఇటీవల కొద్దిగా మార్చి పోలవరం-బనకచర్ల లింక్‌గా తెరమీదికి తీసుకొచ్చిందని గుర్తుచేశారు.
కేంద్ర ఏజెన్సీలు, తెలంగాణ వ్యతిరేకించడంతో ఆయా ప్రాజెక్టుల్లో మళ్లీ మార్పులు చేసి ఇప్పుడు కొత్తగా పోలవరం-నల్లమలసాగర్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైందని పేర్కొన్నారు. ఇప్పటికే డీపీఆర్ తయారీ, ఇన్వెస్టిగేషన్ కోసం టెండర్లు కూడా ఆహ్వానించిందని, ఇది ఏపీ పునర్విభజన చట్టానికి విరుద్ధమని తెలిపారు. గోదావరి జలాల మళ్లింపు వల్ల కో బేసిన్ రాష్ర్టాలపై తీవ్ర ప్రభావం పడుతుందని చెప్పారు. జీఆర్ఎంబీ ఈ విషయంలో సత్వరం స్పందించి ప్రాజెక్టుపై ముందుకు వెళ్లకుండా చూడాలని ఈఎన్సీ ఆ లేఖలో డిమాండ్ చేశారు.