కొత్తపల్లి, సెప్టెంబర్ 29 : తెలంగాణ ఉద్యమకారులకు సర్కారు సముచిత స్థానం కల్పిస్తున్నదని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ పేర్కొన్నారు. విద్యార్థి ఉద్యమనేత పొన్నం అనిల్ కుమార్ గౌడ్‌కు కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా అవకాశం కల్పించడమే అందుకు నిదర్శనమని చెప్పారు. శుక్రవారం జిల్లా కేంద్ర గ్రంథాలయంలో అనిల్‌కుమార్ బాధ్యతల స్వీకారోత్సవానికి మంత్రి హాజరయ్యారు. అంతకుముందు టీఎన్జీవోస్ ఫంక్షన్హాల్లో అభినందన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, తెలంగాణ పోరాటంలో కీలక భూమిక పోషించిన నాయకులను ప్రోత్సహించడంలో సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ఎప్పుడూ ముందుంటారన్నారు. చొప్పదండికి చెందిన ఏనుగు రవీందర్‌రెడ్డికి రాష్ట్రం ఏర్పడ్డాక తొలిసారిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా అవకాశం కల్పించి సముచిత స్థానం కల్పించారని, ఆయన పదవీ కాలం పూర్తయిన నేపథ్యంలో రెండోసారి సైతం మరో విద్యార్థి ఉద్యమకారుడు అనిల్ కుమార్‌కు అవకాశం కల్పించారన్నారు.
కరీంనగర్ జిల్లాకు, జిల్లా గ్రంథాలయ సంస్థకు గొప్ప చరిత్ర ఉందని, దీనికి చైర్మన్‌గా అనిల్‌ను నియమించిన సీఎం కేసీఆర్‌కు మంత్రి కృతజ్ఞతలు తెలిపారు. టీఆర్ఎస్ పార్టీ మాత్రమే కాదని అది ఓ కుటుంబం లాంటిదని, కుటుంబంలోని ఏ ఒక్క సభ్యుడికి ఇబ్బంది వచ్చినా అండగా ఉండి ఆదుకుంటామన్నారు. ఇటీవల కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమితులైన రెడ్డవేని మధు బాగా పనిచేస్తూ ఆ పదవికే వన్నే తెస్తున్నాడని ప్రశంసించారు. అదే తరహాలో పార్టీ నేతలు కష్టపడి పనిచేయాలని సూచించారు. సీఎం కేసీఆర్‌కు కరీంనగర్ జిల్లాపై అమితమైన ప్రేమ ఉంటుందని, ఈ నియోజకవర్గ అభివృద్ధికి ఆయన రూ.వెయ్యి కోట్లు ఇచ్చారని గుర్తు చేశారు. కరీంనగర్లో 50 ఏండ్లల్లో జరగని అభివృద్ధి, ఐదేండ్లలో జరిగిందని, అది సీఎం కేసీఆర్‌తోనే సాధ్యమైందన్నారు.
మానేరు రివర్‌ఫ్రంట్, కేబుల్ బ్రిడ్జి, ప్రభుత్వ మెడికల్ కళాశాల, వెంకటేశ్వర టెంపుల్ నిర్మాణంతో నగరం పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా మారబోతున్నదన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంతో జిల్లాతోపాటు రాష్ట్రంలో సాగు, తాగునీటికి కొదవలేకుండా పోయిందన్నారు. ఢిల్లీ పాలకులు మతం పేరిట తెలంగాణాపై విషం చిమ్ముతున్నారని విమర్శించారు. రాష్ట్ర అభివృద్ధిని చూసి బీజేపీ నాయకులకు కడుపు మండుతుందని, వారు చేసే కుట్రలపై అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు దేశంలో మరెక్కడా లేవని, అభివృద్ధ్ది కొనసాగాలంటే సీఎంగా కేసీఆరే ఉండాలన్నారు. పాఠకులు, విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తూ కేంద్ర గ్రంథాలయాన్ని మోడల్‌గా మార్చాలని చైర్మన్‌కు సూచించారు. స్మార్ట్‌సిటీ నిధులతో కేంద్ర గ్రంథాలయాన్ని 5 ఫ్లోర్లతో అధునాతనంగా మార్చుతున్నామన్నారు. మేయర్ వై సునీల్‌రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ కనుమల్ల విజయ, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, మాజీ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ రెడ్డవేని మధు, కొత్తపల్లి మున్సిపల్ చైర్మన్ రుద్రరాజు, కరీంనగర్ మండల టీఆర్ఎస్ అధ్యక్షుడు శ్యాంసుందర్‌రెడ్డి ఉన్నారు.
బాధ్యతగా పనిచేస్తా.. మంచి పేరు తెస్తా
ఉద్యమ నాయకులను టీఆర్ఎస్ ఎప్పుడూ గౌరవిస్తుంది. జిల్లాలోని చాలా మందికి పార్టీ, నామినేటెడ్ పదవులిచ్చింది. విద్యార్థి ఉద్యమ నేతనైన నాకు గ్రంథాలయ సంస్థ చైర్మన్‌గా అవకాశం ఇచ్చింది. మంత్రి గంగుల కమలాకర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌కు పాదాభివందనం చేస్తు న్నా. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ ప్రత్యేక కృతజ్ఞతలు. బాధ్యతగా పనిచేసి పార్టీతో పాటు ప్రభుత్వానికి మంచిపేరును తీసుకువస్తా.
– పొన్నం అనిల్‌కుమార్ గౌడ్, కరీంనగర్ జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్