హైదరాబాద్ : దసరా పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు బుధవారం దసరా శుభాకాంక్షలు తెలిపారు. ధర్మస్థాపనకు నిదర్శనంగా, విజయాలను అందించే విజయ దశమిగా దసరా పండుగను దేశవ్యాప్తంగా జరుపుకుంటారని సీఎం అన్నారు.
దసరా రోజున శుభసూచకంగా పాలపిట్టను దర్శించి పవిత్రమైన జమ్మిచెట్టుకు పూజలు చేసే సాంప్రదాయం గొప్పదని పేర్కొన్నారు. జమ్మి ఆకును బంగారంలా భావించి పంచుకొంటూ, పెద్దల ఆశీర్వాదాలను అందుకుంటూ, అలయ్ బలయ్ తీసుకొంటూ ప్రేమాభిమానాలను చాటుకోవడం దసరా పండుగ ప్రత్యేకత అని సీఎం చెప్పారు. అనతికాలంలోనే అభివృద్ధిని సాధించి రాష్ట్రాన్ని ముందంజలో నిలిపిన తెలంగాణ పాలన, దేశానికి ఆదర్శంగా నిలిచిందని అన్నారు.
తెలంగాణ స్ఫూర్తితో దేశం ప్రగతిబాటలో నడువాలని సీఎం ఆకాంక్షించారు. విజయానికి సంకేతమైన దసరా నాడు తలపెట్టిన కార్యాలన్నీ ఫలించాలని సీఎం ప్రార్థించారు. విజయ దశమి స్ఫూర్తిని కొనసాగిస్తామని తెలిపారు. ప్రజలందరూ సుఖశాంతులతో వర్ధిల్లాలని దసరా సందర్భంగా సీఎం కోరుకున్నారు.