హైదరాబాద్ : తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ (టాక్) ఆధ్వర్యంలో అక్టోబర్ 9న లండన్ హౌంస్లాలోని ఐసల్ వర్త్ అండ్ సయాన్ ఆడిటోరియంలో (Isleworth and Syon School, Ridgeway Road, Isleworth, Middlesex,TW75LJ) ‘లండన్-చేనేత బతుకమ్మ-దసరా సంబురాలు’ నిర్వహిస్తున్నట్లు టాక్ అధ్యక్షుడు రత్నాకర్ కడుదుల తెలిపారు. కొవిడ్ నిబంధనలను మేరకు అన్ని జాగ్రత్తలు పాటిస్తూ వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. గత కొన్ని వారాలుగా కోర్ కమిటీ సభ్యులంతా హాజరయ్యే ప్రవాస బిడ్డలంతా ఆనందంగా వేడుకల్ని జరుపుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై స్థానిక అధికారులు, ఆరోగ్య నిపుణులతో చర్చిస్తున్నట్లు పేర్కొన్నారు.
త్వరలోనే వేడుకలకు హాజరయ్యే వారికి పాటించాల్సిన జాగ్రత్తలను వివరించనున్నట్లు చెప్పారు. తెలంగాణ ఆడబిడ్డ కల్వకుంట్ల కవిత ఆశయాల స్ఫూర్తితో మన సంస్కృతిని విశ్వవ్యాప్తం చేయాలనే సంకల్పంతో ఏళ్లుగా వేడుకలు నిర్వహిస్తూ వస్తున్నామన్నారు. ప్రవాస బిడ్డలంతా హాజరై.. విజయవంతం చేయాలని కోరారు. వేడుకలకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదని, ఉచితమని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం, మంత్రి కేటీఆర్ చేనేతకు చేయూతనిచ్చేందుకు చేస్తున్న కార్యక్రమాల స్ఫూర్తితో ఈ సారి ‘చేనేత బతుకమ్మ’గా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీలైనంత వరకు ప్రవాసుల్లో చేనేతపై అవగాహన కల్పించి, వీలైనన్ని సందర్భాల్లో చేనేత వస్త్రాలు ధరించి నేత కుటుంబాలకు అండగా నిలువాలని కోరుతున్నట్లు చెప్పారు.