ప్రస్తుతం టీమిండియాలో అద్భుతమైన ఫామ్‌లో ఉన్న ఆటగాళ్లలో సూర్యకుమార్ యాదవ్ ఒకడు. నాలుగో నెంబర్ స్థానంలో క్రీజులోకి వచ్చే సూర్య.. మైదానం అన్ని వైపులా షాట్లు ఆడగలడు. భారత్ తరఫున టీ20 ఫార్మాట్లో అరంగేట్రం చేసినప్పటి నుంచి అదిరిపోయే ఆటతీరుతో అలరిస్తున్న సూర్య.. 176.8 స్ట్రైక్‌రేటుతో 1045 పరుగులు చేశాడు.
మిడిల్ ఓవర్లలో ఇంత ప్రభావవంతంగా ఆడలేదంటే అతిశయోక్తి కాదు. అందుకే అభిమానులు అతన్ని పొట్టి ఫార్మాట్లో బెస్ట్ ప్లేయర్ అని కీర్తిస్తున్నారు. ఇదే విషయాన్ని సౌతాఫ్రికా లెజెండరీ పేసర్ డేల్ స్టెయిన్ కూడా అంగీకరించాడు. ‘సూర్యకు ఎలాంటి డెలివరీ వేసినా అతని దగ్గర రెండు రకాల షాట్లు అందుబాటులో ఉన్నట్లు కనిపిస్తుంది. తనను చూస్తుంటే డివిల్లీర్స్ గుర్తుకొస్తుంటాడు. అతను కూడా ఇలాంటి శైలిలోనే, నిలకడగా ఆడేవాడు’ అని చెప్పాడు.
పేస్‌ను వాడుకోవడానికి ఈ ఆటగాళ్లు ఇష్టపడతారన్న స్టెయిన్.. పెర్త్, మెల్బోర్న్ ఇలా ఆస్ట్రేలియాలో ఏ వేదికను తీసుకున్నా అవి బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉంటాయని, అక్కడ అద్భుతమైన పేస్ దొరుకుతుందని చెప్పాడు. కాబట్టి ఈ పొట్టి ప్రపంచకప్‌లో సూర్యకుమార్ విషయంలో మిగతా జట్లు జాగ్రత్తగా ఉండాలని సలహా ఇచ్చాడు.