అదివారం హైదరాబాద్‌లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా జరిగిన ఓ సమావేశంలో అగ్రహీరో చిరంజీవి అభిమానులతో భేటీ అయ్యారు. ఈ సమావేశానికి ఆయన కుడి చేతికి కట్టుతో హాజరు కావడంతో అభిమానులు అందోళన చెందారు. వారి కలవరపాటును గమనించిన చిరంజీవి చేతికి చిన్నపాటి సర్జరీ జరిగిందని, ఎవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదని తెలిపారు. ‘కుడి చేతితో ఏదైనా పనిచేస్తున్నప్పుడు నొప్పిగా, తిమ్మిరిగా అనిపిస్తుండటంతో వైద్యులను సంప్రదించాను. కుడిచేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్‌పై ఒత్తిడి పడటమే నొప్పికి కారణమని వైద్యులు తేల్చారు. దీనిని కార్పల్ టన్నెల్ సిండ్రోమ్ అంటారని వారు పేర్కొన్నారు. అపోలో ఆసుపత్రిలో డాక్టర్ సుధాకర్‌రెడ్డి ఆధ్వర్యంలో చేతికి సర్జరీ జరిగింది. నలభై ఐదు నిమిషాల పాటు జరిగిన ఈ సర్జరీలో మీడియన్ నర్వ్ చుట్టుపక్కల ఉన్న టిష్యూలను సరిచేసి ఒత్తిడిని తగ్గించారు. పదిహేను రోజుల్లో కుడి చేయి తిరిగి సాధారణ స్థితికి చేరుకుంటుంది. అభిమానులెవరూ కంగారు పడాల్సిన పనిలేదు’ అని చిరంజీవి తెలిపారు. ఈ సర్జరీ కారణంగా ‘గాడ్‌ఫాదర్’ సినిమా షూటింగ్‌కు పదిహేను రోజులు విరామం తీసుకున్నానని ఆయన తెలిపారు. నవంబర్ 1వ తేది నుంచి తిరిగి షూటింగ్లో పాల్గొంటానని చిరంజీవి పేర్కొన్నారు.